
హైదరాబాద్: విజయవాడ-హైదరాబాద్ నేషనల్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. వీకెండ్ ముగియడంతో ప్రజలు తిరిగి పట్నం బాట పట్టారు. ఈ క్రమంలో ఏపీ నుంచి వేల సంఖ్యలో వాహనాలు హైదరాబాద్ వైపు వస్తుండడంతో విజయవాడ– హైదరాబాద్ హైవేపై, టోల్‌ప్లాజాల వద్ద వాహనాల రద్దీ పెరిగింది. చిట్యాల మండలం పెద్దకాపర్తి దగ్గర ఫ్లైఓవర్ పనులు జరుగుతుండటంతో పెద్దకాపర్తి నుంచి చిట్యాల వరకు వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.
కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో టోల్‌ప్లాజాల వద్ద మరిన్నీ బూత్‌లను ఓపెన్ చేశారు. హైవే పై భారీగా వాహనాల రద్దీ నెలకొనడంతో ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనాలు ముందుకు కదలలేని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇందులోనే వర్షం కురుస్తుండటంతో వారి తిప్పలు మరింత ఎక్కువయ్యాయి.