
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి 25 వేల ఓట్ల మెజార్టీ తీసుకురావాలని మంత్రి వివేక్ వెంకట స్వామి కేడర్‌కు పిలుపునిచ్చారు. ఆదివారం (ఆగస్ట్ 17) జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రెహమత్ నగర్ డివిజన్లో కాంగ్రెస్ కార్యకర్తల బూత్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి వివేక్ హాజరయ్యి మాట్లాడారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రజా పాలనలో రాష్ట్ర ప్రజలు చాలా హ్యపీగా ఉన్నారని అన్నారు. పేద ప్రజల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తుందని.. కేసీఆర్ డబుల్ బెడ్ రూము ఇండ్లు ఎవరికీ ఇచ్చారని ప్రశ్నించారు.
కేసీఆర్ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని ఓట్లు వేయించుకుని ఇవ్వకుండా మోసం చేశాడని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం 10 లక్షల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ లిమిట్ పెంచిందని, ఎవరూ ప్రైవేట్ ఆసుపత్రలకు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కమిషన్ల కోసం ప్రాజెక్టులు కట్టిందని దుయ్యబట్టారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ పోటీలో లేదన్నారు.
మనం లొల్లి పెట్టుకుంటే బీఆర్ఎస్ పార్టీకి లాభం జరుగుతదని.. మన లోపాలను వెంటనే సరిదిద్దుకోవాలని సూచించారు.
మీకు ఎవరికీ అన్యాయం జరగకుండా చూసుకునే బాధ్యత నాదని భరోసా ఇచ్చారు. రూ.20 కోట్లతో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేస్తామని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ 25 వేల మెజారిటీ సాధించాలని.. దీని కోసం అందరం కలిసి పని చేయాలని సూచించారు. ఒక్కో బూత్‌లో 50 మంది ఉండాలని.. బూత్‌లు స్ట్రాంగ్ చేసుకోకుంటే మెజారిటీ రాదన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరూ బహిరంగంగ విభేదాలు పెట్టుకోద్దని.. ఏ సమస్య ఉన్నా పార్టీ పెద్దల దృష్టికి తీసుకురావాలని చెప్పారు.