అంబులెన్స్ ఆపి కుక్కలను విడిపించాడు ..జంతు ప్రేమికుడి వీడియో వైరల్

అంబులెన్స్ ఆపి కుక్కలను విడిపించాడు ..జంతు ప్రేమికుడి వీడియో వైరల్

దేశవ్యాప్తంగా ఇప్పుడు హాట్ టాపిక్ వీధికుక్కలు. వీధికుక్కల నిర్వహణపై ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన సంచలన తీర్పు తర్వాత ఈ అంశం పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. కుక్కలను బతకనీయాలి, అవి కూడా జీవులే” అని ఒకవైపు జంతు ప్రేమికుల వాదిస్తుంటే.. మరోవైపు వీధికుక్కల వల్ల ప్రమాదాలు, మరణాలు పెరుగుతున్నాయి..కఠిన చర్యలు అవసరం అని మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదంలో సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు, సామాజిక కార్యకర్తలు కుక్కలకు సపోర్టుగా కొందరు, వ్యతిరేకిస్తూ మరికొందరు అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జంతు అంబులెన్స్లో తరలిస్తున్న కుక్కలను విడిపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

కుక్కలకు టీకాలు వేయడానికి ఏర్పాటు చేసిన MCD కి చెందిన జంతు అంబులెన్స్ నుంచి ఓ యువకుడు కుక్కలను విడిపిస్తున్న దృశ్యం వైరల్ వీడియోలో కనిపించింది. ఈ క్లిప్ తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. అతని వైఖరిపై నెటిజన్లలో తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. వీధి కుక్కల పట్ల ప్రేమను చూపించడంలో అతనికి కనీస జ్ఞానం లేదని చాలా మంది విమర్శిస్తున్నారు. వైరల్ వీడియోలో పేరు తెలియని వ్యక్తి అంబులెన్స్ తలుపులు తెరిచి కుక్కలను విడిపించడం స్పష్టంగా కనిపిస్తోంది. 

ఖచ్చితంగా తెలియదు గానీ.. ఈ ఘటన ఢిల్లీలో ఓ ప్రాంతంలో జరిగినట్లు తెలుస్తోంది. రెండు కుక్కలను బందించి MCD జంతు అంబులెన్స్ లో తరలిస్తుండగా వెనకనుంచి బైక్ పై వచ్చిన వ్యక్తి వెహికల్ డోర్స్ తెరిచి కుక్కలను విడిచిపెట్టాడు. వెంటనే అక్కడినుంచి పారి పోయాడు. వెనక కారులో ఉన్న  ఓ వ్యక్తి ఈ వీడియోను రికార్డు చేసి వైరల్ చేశాడు. 

►ALSO READ | యూత్ను ఉర్రూతలూగిస్తున్న.. మనాలి స్కేట్‌బోర్డింగ్ వీడియో

ఈ వీడియోను @Incognito_qfs అనే సంస్థ X లో షేర్ చేసింది. MCD కుక్కలను వ్యాక్సినేషన్ చేయడానికి తీసుకెళ్లింది. అప్పుడు ఈ కుక్క ప్రేమికుడు వచ్చి వాటిని వ్యాక్సినేన్ చేయడానికి ముందే వదిలేశాడు. దేశంలో ఇంత పెద్ద సంఖ్యలో వీధికుక్కల జనాభా ఉండటం ఇలాంటి వాళ్ల వల్లే.. కుక్కలను  ప్రేమించేవాళ్లు ఎవరినీ తమ పని చేయనివ్వరు. ఎప్పుడూ గందరగోళానికి గురిచేస్తారు అని సంస్థ తెలిపింది. 

ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ విషయం మరింత వేడెక్కింది. కుక్కలు పిల్లలను, వృద్ధులను దాడి చేస్తున్న వీడియోలు ఒకవైపు వైరల్ అవుతుండగా..కుక్కలకు ఆహారం పెడుతున్న హ్యూమనిటేరియన్ వీడియోలు మరోవైపు చర్చనీయాంశమవుతున్నాయి. ఇక ప్రజలు మాత్రం ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి. వీధికుక్కలకు స్వేచ్ఛ ఇవ్వాలా? లేక నియంత్రణ విధించాలా? అని అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం సందేహంలో పడ్డారు.