బషీర్బాగ్, వెలుగు: హైదరాబాద్లో నెలకొన్న ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్కు బీజేపీ నేతలు వినతిపత్రం అందజేశారు. అనంతరం బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎన్. గౌతమ్ రావు, మహంకాళి జిల్లా అధ్యక్షుడు జి. భరత్ గౌడ్ మాట్లాడుతూ.. జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి, ఆసరా పెన్షన్లు, కల్యాణ లక్ష్మి, గృహ నిర్మాణ పథకం వంటి హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.
నగరంలో పారిశుధ్యం, వీధి దీపాలు, మౌలిక సదుపాయాల కొరత తీవ్రంగా ఉందని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అలాగే ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాల జారీలో జరుగుతున్న జాప్యాన్ని నివారించాలని కోరారు. ఫీజు రీయింబర్స్మెంట్, బీసీ, ఎస్సీ డిక్లరేషన్లను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
