ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

విద్యార్థులు ఫ్లోరైడ్ నీటిని తాగుతూ ఇబ్బంది పడుతున్నారు

జైపూర్,వెలుగు: మండల కేంద్రంలోని కస్తూరీబా గాంధీ పాఠశాలను బుధవారం బీజీపీ లీడర్లు సందర్శించారు. ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షుడు చల్ల విశ్వంబర్ రెడ్డి  మాట్లాడుతూ ప్రహరి నిర్మించాలని, స్కూల్​కు ఈజీగా వెళ్లేందుకు రోడ్డు వేయాలని కోరారు. మంచినీటి సరఫరా సరిగాలేదని, విద్యార్థులు ఫ్లోరైడ్ నీటిని తాగుతూ ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో లీడర్లు బల్ల వెంకటేశ్, పోచన్న  పాల్గొన్నారు.

రాజీనామా వెనక్కి తీసుకున్న జడ్పీటీసీ
కాగజ్ నగర్,వెలుగు: అభివృద్ధి జరగడం లేదని ఆరోపిస్తూ టీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన బెజ్జుర్ జడ్పీటీసీ పంద్రం పుష్పలత సహా సర్పంచులు, డైరెక్టర్లు రాజీనామా వెనక్కి తీసుకుంటున్నట్లు బుధవారం ప్రకటించారు. ఈ మేరకు లేఖ విడుదల చేశారు. సమస్యలు పరిష్కరించడంపై ఎమ్మెల్యే స్పష్టమైన హామీ ఇచ్చిన మేరకు ఉపసంహరించుకున్నట్లు తెలిపారు. అయితే రాజీనామా ఉపసంహరించుకున్న వారిలో కుష్నపల్లి ఎంపీటీసీ ఆత్రం సాయన్న లేకపోవడం గమనార్హం. 

మెరుగైన వైద్యం అందిస్తాం
ఆదిలాబాద్,వెలుగు: జిల్లాలోని గిరిజనులకు మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తామని ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. బుధవారం నార్నూర్ మండలం ఖైర్ దాట్వ గ్రామంలో అప్రిరోన్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్, వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం నిర్వహించారు. అంతకుముందు ఎస్పీ అప్రిరోన్ హెల్త్ కేర్ మొబైల్ హాస్పిటల్ వెహికల్​ను ఎస్పీ ప్రారంభించారు. అనంతరం దాదాపు 500 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో ఉట్నూర్ ఏఎస్పీ హర్షవర్ధన్ శ్రీవాత్సవ, నార్నూర్ సీఐ ప్రేమ్ కుమార్  పాల్గొన్నారు.

పండుగల మెగా ప్లాంటేషన్
దండేపల్లి, వెలుగు:  75వ భారత స్వతంత్ర వజ్రోత్సవాలలో బాగంగా దండేపల్లి లో మెగా ప్లాంటేషన్ ఒక పండుగల నిర్వహించారు. స్వయంగా జిల్లా అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్ పాల్గొని మొక్కలు నాటి సిబ్బందిని ఉత్సాహపరిచారు.మండలం లోని వెల్గనూర్ గ్రామపంచాయతీ పరిధిలోని అందుగులపేట బృహత్ పల్లె ప్రకృతి వనం లో ఏక కాలంలో మూడు వేల మొక్కలు నాటారు.పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ సిబ్బందితో మూడు వేల పిట్స్ తవ్వి మొక్కలు నాటారు. స్వతంత్ర స్పూర్తితో ఉద్యమించి ఒక యజ్ఞం ల మూడు వేల మొక్కలు నాటిన సిబ్బందిని ఆయన అభినందించారు. అక్కడే సిబ్బంది తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మల్లేష్, ఎంపీఓ మేఘమాల, ఏపీఓ దుర్గాదాస్, ఈసి భీమయ్య, టెక్నికల్ అసిస్టెంట్ లు,పంచాయతీ కార్యదర్శులు,కార్యాలయ సిబ్బంది,ఫీల్డ్ ఆసిస్టెంట్స్, మల్టీ పర్పస్ వర్కర్స్  పాల్గొన్నారు. 

దగా చేస్తున్న ప్రభుత్వాలు

ఆసిఫాబాద్,వెలుగు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను దగా చేస్తున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కళావేణ శంకర్ ఆరోపించారు. బుధవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన సీపీఐ జిల్లా మూడో మహాసభలలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు ఆచరణ సాధ్యంకాని హామీలు ఇచ్చి ప్రజలను పక్కదోవ పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ, కేసీఆర్ ప్రభుత్వాలు ‘రాజకీయ ఆకర్ష్’తో ప్రజా ప్రతినిధులను అంగడి సరుకుగా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వం మతపరమైన అంశాలను బలవంతంగా రాజకీయ పాలనరంగంలో చూపిస్తూ రాజ్యాంగ ఔన్నత్యానికి తూడ్లు పొడిచారన్నారు. ప్రజల ఆహార అలవాట్లు,  కట్టుబాట్లపై ఆంక్షలు విధించడం తీరనిమచ్చన్నారు. సంస్కరణల పేరుతో 40 కార్మిక చట్టాలను రద్దుచేసి అన్యాయం చేశారన్నారు. కేసీఆర్ బీజేపీని విమర్శిస్తూ లోపాయికారిగా మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు. మహాసభలో జిల్లా కార్యదర్శి బద్రీ  సత్యనారాయణ, సహాయ కార్యదర్శి తిరుపతి, జిల్లా సభ్యులు ఒండ్రే గోపీనాథ్, జాడి గణేశ్, బోగే ఉపేందర్, పిడుగు శంకర్, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఆత్మకురి చిరంజీవి, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి దుర్గం రవీందర్, మహిళా నాయకురాలు పంచపుల లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

బంగారం చోరీ
లోకేశ్వరం,వెలుగు: మండలంలోని పిప్రి గ్రామానికి చెందిన మల్కి చంద్రకళ ఇంట్లో మంగళవారం చోరీ జరిగింది. ఉదయం 10 గంటలకు ఇంటికి తాళం వేసి కూలి పనుల కోసం వెళ్లిన ఆమె సాయంత్రం 6 గంటలకు ఇంటికి రాగా ఇంటి తాళం తీసి, బీరువా పగులగొట్టి ఉంది. బీరువాలోని రూ. 7 వేల నగదు, 19 గ్రాముల బంగారం చోరీకి గురైనట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

చట్టం ప్రకారమే పనులు చేపట్టాలి
దండేపల్లి, వెలుగు: జాతీయ ఉపాధిహామీ పథకం 2005 చట్టం ప్రకారమే గ్రామాల్లో పనులు చేపట్టాలని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అడిషనల్ డీఆర్డీవో దత్తారావు సూచించారు. లక్షెట్టిపేట మండల పరిషత్ కార్యాలయంలో ఉపాధిహామీ సిబ్బంది,పంచాయతీ సెక్రెటరీస్ తో బుధవారం నిర్వహించిన సమీక్ష సమావేశం లో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన పనులు చట్టానికి లోబడి చేయాలని తెలిపారు.ఉపాధి కూలిలలో మండలంలో 136 మంది ఈ సంవత్సరం 100 రోజులు పనిదినాలు చేసిఉన్నారని వారి కి ఉన్నతి ప్రోగ్రామ్ ద్వారా 3 నెలలు స్వయం ఉపాధి కోసం ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు శిక్షణ కాలం లో 257 స్టైఫండ్,భోజనం,వసతి కూడ కలిపిస్తున్నదని యువతకు ఆసక్తి ఉన్న పనులపై శిక్షణ కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.గ్రామాల్లో ఎంపిక కాబడిన వారికి స్వయం ఉపాధి పై అవగాహన కలిపించి శిక్షణ కు పంపించాలని కోరారు.ఈ నెల 21 న 75వ స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా మెగా ప్లాంటేషన్ చేపట్టాలని అన్నారు.ఈ సమావేశంలో ఉపాధిహామీ పథకం జిల్లా అంబుడ్స్ మెన్ శివరాం, ఎంపీడీఓ నాగేశ్వరరెడ్డి,ఎంపీఓ ప్రసాద్, ఏపీడీ సదానందం,జేడీఎం రామచందర్, ఏపీవో  వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

అన్ని మేనేజ్మెంట్​ స్కూళ్లలో లైవ్ లోకేషన్​
నిర్మల్,వెలుగు: అన్ని మేనేజ్​మెంట్ల పరిధిలో కొనసాగుతున్న వెల్ఫేర్​స్కూళ్లలో లైవ్ లోకేషన్​హాజరు విధానాన్ని అమలు చేయనున్నట్లు కలెక్టర్ ముషారఫ్​అలీ ఫారూఖీ తెలిపారు. బుధవారం కలెక్టరేట్​లో ఆయన విద్యాశాఖపై రివ్యూ నిర్వహించారు. విద్యాబోధన, సౌకర్యాలు, భోజనం, పరిశుభ్రత, విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు, వంట గదుల నిర్వహణపై సమీక్షించారు. అడిషనల్ కలెక్టర్ హేమంత్ బోర్కడే, డీఈవో రవీందర్ రెడ్డి, డీఆర్డీవో విజయలక్ష్మి, ట్రైబల్ వెల్ఫేర్ డెవలప్మెంట్ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డి, ఆర్ సీవో గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

మున్సిపల్ చైర్మన్ ను సన్మానించిన ముస్లింలు
ఖానాపూర్,వెలుగు: ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్ ను బుధవారం ఎండీసీ, ముస్లిం జేఏసీ లీడర్లు సన్మానించారు. పంద్రాగస్టు రోజున మంత్రి అల్లోల ఇంద్ర కరణ్ నుంచి ఉత్తమ మున్సిపల్ చైర్మన్ గా అవార్డు అందుకున్న సందర్భంగా సన్మానించినట్లు వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎండీసీ అధ్యక్షుడు ఖలీల్​, కార్యదర్శి సలీం ఖాన్, జేఏసీ అధ్యక్షుడు షబ్బీర్ పాషా, లీడర్లు డాక్టర్ హఫీజ్ ఖాన్, ఇర్ఫాన్, నసీర్,శర్జీల్, కైసర్, అయ్యూబ్​మెహరాజ్, షోయబ్​తదితరులు పాల్గొన్నారు.

రిమ్స్​లో కార్మికుల ఆందోళన 
ఆదిలాబాద్,వెలుగు: సమస్యలు పరిష్కరించాలని డిమాండ్​ చేస్తూ బుధవారం రిమ్స్ కార్మికులు, సీపీఎం లీడర్లు ఓపీ బ్లాక్​ఎదుట నిరసనకు దిగారు. పెండింగ్ వేతనాలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లేశ్​కోరారు. నెలల తరబడి జీతాలు ఇవ్వకపోవడంతో కార్మికులకు కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో లీడర్లు కిరణ్, ఆశన్న తదితరులు పాల్గొన్నారు.

దొరల పాలనకు చరమగీతం పాడాలి

ఆదిలాబాద్,వెలుగు: రాష్ట్రంలో దొరల పాలనకు చరమగీతం పాడి  బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల రాజ్యం స్థాపించాలని దళిత శక్తి ప్రోగ్రాం రాష్ట్ర అధ్యక్షుడు విశారదన్ మహారాజ్ కోరారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌక్ లో శిలాఫలకం, డీఎస్పీ జెండా ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. అణగారిన వర్గాలను ఓట్లు వేసే బానిసలుగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మన ఓటుతో మన ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలన్నారు. అంబేద్కర్ బియ్యం, నూకల కోసం పోరాటం చేయలేదని.. వందేళ్ల క్రితమే రాజ్యం కోసం పోరాటం చేశారన్నారు. డీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గణేశ్, జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్, బీసీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పార్థసారథి, విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు సత్యనారాయణ, గంగపుత్ర సంఘం అధ్యక్షుడు అశోక్, మహార్ సంఘం లీడర్లు సుదర్శన్, శోభాతాయి, మాల సంఘం అధ్యక్షుడు భూమన్న, వడ్డెర సంఘం లీడర్లు గంగన్న, వెంకన్న, డీఎస్పీ జిల్లా ప్రధాన కార్యదర్శి సురేశ్​పాల్గొన్నారు. 

అవయవదానానికి కలెక్టర్ దంపతుల అంగీకారం
ఆసిఫాబాద్ ,వెలుగు: ఆసిఫాబాద్​కలెక్టర్​రాహుల్​రాజ్​దంపతులు అవయవదానం కోసం అంగీకరించారు. ఈమేరకు బుధవారం స్థానికంగా నిర్వహించిన రక్తదాన శిబిరంలో డీఎంహెచ్​వోకు ప్రభాకర్​రెడ్డికి అంగీకార పత్రం అందజేశారు.

త్వరలో బీజేపీలో చేరుతా
నిర్మల్,వెలుగు: కార్యకర్తలు, అభిమానులు, అనుచరుల అభిప్రాయం మేరకు త్వరలో బీజేపీలో చేరుతానని  వైఎస్సార్​కాంగ్రెస్ పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు కొమ్ముల వినాయక్ రెడ్డి ప్రకటించారు. బుధవారం స్థానిక ఆర్కే ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఈ విషయాన్ని ఆయన తెలిపారు.

సింగరేణిలో పలువురు జీఎంల బదిలీ
మందమర్రి,వెలుగు: సింగరేణి వ్యాప్తంగా పలువురు జీఎంలను బదిలీ చేస్తూ బుధవారం యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. బెల్లంపల్లి రీజియన్ సేఫ్టీ జీఎంగా పనిచేస్తున్న బళ్లారి శ్రీనివాస్​రావును భూపాలపల్లి ఏరియాకు బదిలీ చేశారు.  ఆయన స్థానంలో భూపాలపల్లి ఏరియా కేటీకే- 2 ఓసీపీ పీవోగా కొనసాగుతున్న అడిషనల్ జీఎం జాన్​ ఆనంద్​కు జీఎంగా ప్రమోషన్​ కల్పిస్తూ  నియమించారు. కార్పొరేట్ ఎస్టేట్ జీఎం జి.వెంకటేశ్వర్​రెడ్డిని మణుగూరు జీఎంగా, కొత్తగూడెం ఏరియా జీఎం సీహెచ్ నర్సింహరావును కార్పొరేట్​ జీఎం(సీపీపీ)కు బదిలీ అయ్యారు. మణుగూరు ఏరియా జీఎం జక్కం రమేశ్​ను కొత్తగూడెం ఏరియా జీఎంగా, భూపాలపల్లి ఏరియా జీఎం ఎం.సుబ్బారావును కార్పొరేట్​ జీఎం(ఎంపీ)గా, కార్పొరేట్ జీఎం (డైరెక్టర్​ పీపీ) డి.రవిప్రసాద్​ను కార్పొరేట్​ జీఎం ఏస్టేట్​గా నియమించారు. ఆర్జీ2 ఏరియా జీఎంగా కొనసాగుతున్న టి.వెంకటేశ్వర్​రావును రామగుండం 3 ఏరియా జీఎంగా, ఆర్జీ3 ఏరియా జీఎం ఎ.మనోహర్​ను రామగుండం2 ఏరియాకు బదిలీ చేశారు. రామగుండం 1 ఏరియా అడిషనల్​జీఎం(సేఫ్టీ) కె.వెంకటేశ్వరావుకు రామగుండం రీజియన్ క్వాలిటీ జీఎంగా, మందమర్రి ఏరియా శాంతిఖని గ్రూప్​ అడిషనల్ జీఎం కె.వెంకటేశ్వర్లును  కార్పొరేట్ జీఎం (డైరెక్టర్​ ఆపరేషన్స్​)గా, మందమర్రి ఏరియా కేకే గ్రూప్​అడిషనల్​ జీఎం జి.రాంచందర్​ను కార్పొరేట్​ జీఎం(బీడీ)గా ప్రమోషన్​ కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలి

ఆదిలాబాద్/​కాగజ్ నగర్, వెలుగు: వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని బీజేపీ లీడర్​హరీశ్​బాబు డిమాండ్​చేశారు. 24 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. బుధవారం స్థానిక తహసీల్దార్​ఆఫీస్​ఎదుట వీఆర్ఏల దీక్షకు ఆయన మద్దతు పలికి మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్రంలో బతుకులు బాగుపడుతాయని ఆశించిన వీఆర్ఏలకు నిరాశే మిగిలిందన్నారు. ఆదిలాబాద్​లో వీఆర్​ఏలు కలెక్టరేట్​ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అంతకుముందు ఆర్​అండ్​బీ గెస్ట్​హౌస్​ నుంచి నిరసన ర్యాలీ చేపట్టారు. కార్యక్రమంలో లీడర్లు కరుణాకర్ రెడ్డి, సలీం, ప్రేమ్ సాగర్, జీవన్, రాఘవేంద్ర, రజిత, అపర్ణ తదితరులు పాల్గొన్నారు.