రాజగోపాల్ రెడ్డిని బీజేపీలో చేర్చుకునేందుకు కసరత్తు

రాజగోపాల్ రెడ్డిని బీజేపీలో  చేర్చుకునేందుకు కసరత్తు

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని బీజేపీలోకి తీసుకొచ్చేందుకు పార్టీ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా.. సాయంత్రం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దగ్గరకు బీజేపీ నేతలు వెళ్లనున్నారు. రాజగోపాల్ రెడ్డితో బండి సంజయ్, వివేక్ వెంకటస్వామి భేటీ కానున్నట్లు తెలుస్తోంది. రాజగోపాల్ ను పార్టీలో జాయిన్ అయ్యేలా చర్చలు జరపనున్నారు. 

రాజగోపాల్ రెడ్డి పార్టీ మార్పుపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. రాజగోపాల్ రెడ్డి ఇష్యూ పార్టీ అధిష్టానం చూసుకుంటుందని స్పష్టం చేశారు. రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై పార్టీలో అంతర్గతంగా చరిస్తామన్నారు. 

మునుగోడు నియోజకవర్గ ముఖ్య కార్యకర్తలతో  ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వరుసగా  భేటీ అవుతున్నారు.  రాజగోపాల్ రెడ్డి తన అభిప్రాయాలను కార్యకర్తలకు తెలియజేశారు.హైదరాబాద్‌లోని తన నివాసంలో మంగళవారం  నాంపల్లి, మర్రిగూడ, చండూరు మండలాల కార్యకర్తలు, నేతలతో మాట్లాడారు. అటు సంస్థాన్ నారాయణపురం కార్యకర్తలతోనూ భేటీ అయ్యారు.  వారం రోజుల్లో సమాధానం చెప్పాలని కార్యకర్తలకు సూచించారు. బిజెపిలో చేరితే ఉప ఎన్నిక వస్తుందని..దాని వల్ల నియోజకవర్గం కూడా అభివృద్ధి చెందుతుందని కార్యకర్తలకు రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేసినట్లు సమాచారం. ఏడాదిన్నర పదవి పోయినా పర్వాలేదని... మూడున్నర ఏళ్లుగా జరగని అభివృద్ధి .. ఉప ఎన్నికల వస్తే  జరుగుతుందని చెప్పారు. 

పీసీసీ చీఫ్ పదవిపై గంపెడాశలు పెట్టుకున్న రాజగోపాల్ రెడ్డి..ఆ పదవిని రేవంత్ రెడ్డికి అధిష్టానం కట్టబెట్టడంతో తీవ్ర అసహనంతో ఉన్నారు. గత కొద్దికాలంగా పార్టీ అధిష్టానంపై బహిరంగంగానే విమర్శలు చేస్తూ వచ్చారు.  తెలంగాణ ఉద్యమం చేసిన వారికి కాంగ్రెస్‌లో ప్రయారిటీ లేదని, ఎక్కడెక్కడి నుంచో వచ్చినవారికి పదవులు ఇస్తున్నారని ఆయన ఆరోపించారు.  తెలంగాణలో ఇప్పుడు ఒరిజినల్ కాంగ్రెస్ లేదని సంచలన వాఖ్యలు చేశారు. అంతేకాకుండా అమిత్ షాతోనూ భేటీ అయ్యారు. ఆ తర్వాత టీఆర్ఎస్ ను ఓడించే సత్తా బీజేపీకే ఉందని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా టీఆర్ఎస్ ను ఓడించే పార్టీలోకి వెళ్తానని పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చారు. 


మరోవైపు రాజగోపాల్ పార్టీ మార్పు వార్తలతో కాంగ్రెస్ అధిష్టానం అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేస్తే ఉప ఎన్నికలో కాంగ్రెస్ తరపున  పాల్వాయి స్రవంతి, జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి పేర్లను పరిశీలిస్తోంది.అటు అభ్యర్థిపై టీఆర్ఎస్ అధిష్టానం కూడా..గట్టిగానే కసరత్తు చేస్తోంది.  టీఆర్ఎస్ తరపున మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు నేతి విద్యాసాగర్, కర్నె ప్రభాకర్ పేర్లను అధిష్టానం పరిశీలిస్తోంది.