బీహార్ ఎన్డీయేకే!..మెజారిటీ దక్కించుకున్న BJP, JDU కూటమి

బీహార్ ఎన్డీయేకే!..మెజారిటీ దక్కించుకున్న BJP, JDU కూటమి
  • మెజారిటీ దక్కించుకున్న బీజేపీ, జేడీయూ కూటమి
  • గట్టి పోటీ ఇచ్చిన మహాకూటమి
  • ఎన్డీయే – 124
  • మహాకూటమి- 111
  • ఎంఐఎం – 05
  • ఇతరులు – 03

పాట్నా: నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్(ఎన్డీయే)​కు బీహార్ ప్రజలు జైకొట్టారు. బీజేపీ, జేడీయూ ఆధ్వర్యంలోని కూటమికి అధికారం అప్పజెప్పారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తారుమారు చూస్తూ.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన మెజారిటీని కట్టబెట్టారు. గట్టిపోటీ ఇచ్చిన మహాకూటమి సీట్ల రేసులో వెనుకబడిపోయింది. ప్రధాని మోడీ, సీఎం నితీశ్ కుమార్ సీనియారిటీ ముందు యువ నేత తేజస్వీ యాదవ్ ఎత్తులు చిత్తయ్యాయి. ఇక ప్రభుత్వ ఏర్పాటులో కీలకం అవుతుందనుకున్న చిరాగ్ పాశ్వాన్ ఆధ్వర్యంలోని లోక్​జనశక్తి పార్టీ (ఎల్జేపీ) బొక్కబోర్లా పడింది. 5.69 శాతం ఓట్లు సాధించినా కేవలం ఒక్క సీటుకే పరిమితమైంది. కానీ దాదాపు 30కి పైగా సీట్లలో జేడీయూ గెలుపోటములపై ప్రభావం చూపింది. హైదరాబాద్​కు చెందిన మజ్లిస్ పార్టీ 1.26 శాతం ఓట్లే సాధించినా 5 సీట్లు
దక్కించుకుంది.

ఆర్జేడీకి 23 శాతం ఓట్లు

బీహార్​ ఎన్నికల్లో బీజేపీ దాదాపు 20 శాతం ఓటు షేర్ సాధించింది. మొత్తం 243 స్థానాలున్న అసెంబ్లీలో మంగళవారం అర్ధరాత్రి వరకు 63 సీట్లలో గెలిచి, 10 సీట్లలో లీడింగ్​లో ఉంది. జేడీయూ.. 34 సీట్లలో గెలిచి 9 సీట్లలో ముందంజలో ఉంది. ఇక సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఆర్జేడీ.. 23 శాతం ఓట్లు సాధించింది. 64 సీట్లలో గెలిచి 12 సీట్లలో లీడింగ్​లో ఉంది. ఇక 70 నియోజకవర్గాల్లో పోటీ చేసిన కాంగ్రెస్.. 17 సీట్లలో గెలిచి 2 చోట్ల ముందంజలో ఉంది. చాలా చోట్ల అభ్యర్తుల మధ్య టఫ్ ఫైట్ కనిపించింది. కొన్ని చోట్ల ఓట్ల మార్జిన్ చాలా తక్కువగా కనిపించింది. రౌండ్ రౌండ్​కూ ఆధిక్యం మారింది. ఎన్డీయే లీడింగ్​లో ఉండటంతో ప్రస్తుత సీఎం నితీశ్ కుమార్​కు కేంద్ర హోం మంత్రి షా ఫోన్ చేశారు. మరోవైపు డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ షిండే తదితరులు కూడా సీఎం నితీశ్ ఇంటికి వెళ్లి కలిశారు.

ప్రముఖుల గెలుపోటములు

  •     రాఘోపూర్​ నుంచి తేజస్వీ యాదవ్ గెలిచారు. అయితే ఈసీ అధికారంగా వెల్లడించలేదు.
  •     హసన్​పూర్ నుంచి ఆర్జేడీ నేత తేజ్ ప్రతాప్ యాదవ్ 21 వేల మెజారిటీతో గెలిచారు.
  •     దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్​పుత్ కజిన్ నీరజ్ సింగ్ బబ్లూ(బీజేపీ) ఛతాపూర్​నుంచి గెలిచారు.
  •     ఇమాంగంజ్ సీటు నుంచి హిందుస్తానీ అవామ్ మోర్చా ప్రెసిడెంట్ జితన్ రామ్ మాంఝీ 16,034 మెజారిటీతో గెలిచారు.
  •     38 క్రిమినల్ కేసులు ఉన్న ఆర్జేడీ అభ్యర్థి అనంత్ కుమార్ సింగ్.. మొకామా సీటు నుంచి గెలిచారు.
  •     జేడీయూకు చెందిన సీనియర్ మంత్రి విజేంద్ర ప్రసాద్ యాదవ్.. సుపౌల్ నుంచి గెలిచారు.
  •     శరద్ యాదవ్ కూతురు సుభాషిని శరద్ యాదవ్.. బిహారీ గంజ్‌లో ఓడిపోయారు.
  •     బీహార్ ఆర్జేడీ మాజీ చీఫ్ అబ్దుల్ బారీ సిద్దిఖీ, లాల్ ప్రసాద్ యాదవ్ సన్నిహితుడు భోలా యాదవ్ ఓడిపోయారు.
  •     షూటర్, కామెన్​వెల్త్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ శ్రేషాసి సింగ్ జముయ్ నుంచి విజయం సాధించారు.

119 సీట్లు గెలిచినం.. సర్టిఫికెట్లు ఇవ్వలె: ఆర్జేడీ

ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయని ఆర్జేడీ ఆరోపించింది. తమ అభ్యర్థులు గెలిచినా ఎలక్షన్ కమిషన్ సర్టిఫికెట్లు ఇవ్వలేదని చెప్పింది. ‘‘119 సీట్లలో మహాకూటమి క్యాండిడేట్లు గెలిచారు. మా క్యాండిడేట్లను రిటర్నింగ్ ఆఫీసర్లు అభినందించారు. మా అభ్యర్థులు గెలిచినట్లుగా ఈసీఐ వెబ్​సైట్​లో కూడా చూపించారు. కానీ తర్వాత మాట మార్చారు. ‘మీరు ఓడిపోయారు’ అని చెబుతున్నారు. గెలిచినట్లుగా సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. ఇలాంటి దోపిడీ ప్రజాస్వామ్యంలో పని చేయదు’’ అని ట్వీట్ చేసింది. తర్వాత మహాకూటమికి చెందిన 119 మంది గెలిచారంటూ వారి పేర్లతో లిస్టు రిలీజ్ చేసింది. అయితే ఆర్జేడీ ఆరోపణలపై ఈసీ అధికారికంగా స్పందించలేదు. మరోవైపు ఓట్ల లెక్కిపును సీఎం నితీశ్ కుమార్ ట్యాంపర్ చేస్తున్నారని ఫిర్యాదు చేసేందుకు ఆర్జేడీ, కాంగ్రెస్ నేతలు ఈసీ ఆఫీసుకు వెళ్లారు. అంతకుముందు లెఫ్ట్ పార్టీలు కూడా ఈవీఎంలను ట్యాంపర్ చేస్తున్నారని ఆరోపించాయి.