బీజేపీ ఎమ్మెల్యేలం.. మల్లె తీగలం కాదు: మహేశ్వర్ రెడ్డి

బీజేపీ ఎమ్మెల్యేలం.. మల్లె తీగలం కాదు: మహేశ్వర్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: బీజేపీ ఎమ్మెల్యేలం మల్లెతీగలం కాదని, పట్టుకొని చూస్తే తమ పవర్​ ఏంటో తెలుస్తదని బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి అన్నారు. డోర్లు తెరిస్తే ఎమ్మెల్యేలంతా వస్తారని సీఎం రేవంత్​రెడ్డి భావించారని.. కానీ, నాలుగు నెలల్లో ముగ్గురు మాత్రమే చేరారని ఆయన ఎద్దేవా చేశారు. సోమవారం బీజేపీ స్టేట్ ఆఫీస్​లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘వారి 64 మంది ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు వాళ్లు టచ్ లో ఉన్నారు.. వీళ్లు టచ్​లో ఉన్నారు అని రేవంత్ రెడ్డి చెప్తున్నారు. 

అతనితో ఎవరూ టచ్​లో లేరు. ఆయనే ఎవరితోనైనా టచ్ లో ఉన్నారేమోనని అనుమానం కలుగుతోంది” అని మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఇచ్చిన హామీలన్నీ ఆగస్టు 15లోపు పూర్తి చేయకుంటే ముఖ్యమంత్రిగా తప్పుకుంటానని చెప్పే దమ్ము, ధైర్యం సీఎం రేవంత్ రెడ్డికి ఉందా? అని మహేశ్వర్ రెడ్డి సవాల్ విసిరారు. హామీల అమలు, రాజకీయాల కోసం ఆయన దేవుళ్ల మీద ఒట్టు పెట్టి.. వారిని కూడా వాడుకుంటున్నారని ఆయన విమర్శించారు. ఎన్నికల సమయంలో పీసీసీ ప్రెసిడెంట్ హోదాలో రేవంత్ రెడ్డి అనేక హామీలిచ్చారని ఆయన గుర్తుచేశారు. నాలుగు నెలలైనా హామీలను అమలు చేయకపోవడంతో పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన్ను నమ్మే పరిస్థితి లేదని విమర్శించారు. 

ఆగస్టు సంక్షోభం భయంతోనే కోమటిరెడ్డి సీఎం అని రేవంత్ చెప్తున్నారని, ఏ ఊరికి వెళ్లినా అక్కడి నేతకు నీవే నెక్స్ట్​సీఎం అంటూ వారితో చెప్తున్నారని ఆయన విమర్శించారు. తమతో 20 మంది టచ్ లో ఉన్నారని చెప్తున్న కేసీఆర్​ మాటలు చూస్తుంటే.. అతనితో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి టచ్ లో ఉన్నారేమోనని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఓ వైపు నీళ్లు లేక.. మరో వైపు ధాన్యం కొనుగోలు చేయక రైతులు ఇబ్బంది పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షాలతో ధాన్యం తడిసిందని, దాన్ని ప్రభుత్వం కొనడం లేదన్నారు.