బషీర్బాగ్, వెలుగు: ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న హైదరాబాద్ బుక్ ఫెయిర్లో సోమవారం చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ, బాలచెలిమి మాసపత్రిక సంయుక్త ఆధ్వర్యంలో 8వ బాలసాహిత్య కథల పుస్తకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బాలచెలిమి సంపాదకులు మణికొండ వేదకుమార్ మాట్లాడుతూ.. పిల్లల నైపుణ్యాలను వెలికితీసి బాలచెలిమి పత్రిక ద్వారా ప్రచురిస్తున్నామని, తెలంగాణ వ్యాప్తంగా 41 బాలచెలిమి గ్రంథాలయాలు ఏర్పాటు చేశామని, త్వరలో 100కు పెంచుతామని తెలిపారు. ముఖ్య అతిథి శాంతా సిన్హా మాట్లాడుతూ.. చిన్న పుస్తకాల వెనుక ఎంతో కృషి ఉందని, సెల్ ఫోన్లకు ప్రత్యామ్నాయంగా పుస్తక పఠనం ఊహాశక్తిని పెంచుతుందన్నారు. ఆత్మీయ అతిథిగా డాక్టర్ రఘు, ఏనుగు నరసింహారెడ్డి, యాకూబ్, ఎన్. బాలాచారి తదితరులు పాల్గొన్నారు.
