లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. రూ.4.5 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద

 లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. రూ.4.5 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద
  • సెన్సెక్స్ 638 పాయింట్లు జంప్​.. 206 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ

ముంబై:స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాలతో ముగిశాయి. విదేశీ పెట్టుబడులు అధికంగా రావడంతో పాటు అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల ధోరణి ఉండటం ఇన్వెస్టర్లలో ఉత్సాహం నింపింది.  ఐటీ,  ఆటో,  మెటల్ రంగాల షేర్లలో భారీగా కొనుగోళ్లు జరిగాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను రానున్న కాలంలో మరింత తగ్గిస్తుందనే అంచనాలు అంతర్జాతీయంగా మార్కెట్ల ర్యాలీకి కారణమయ్యాయి. ఈ సానుకూల ప్రభావం భారత మార్కెట్లపై స్పష్టంగా కనిపించింది.  సెన్సెక్స్ 638.12 పాయింట్లు పెరిగి 85,567.48 వద్ద స్థిరపడింది.  నిఫ్టీ 206 పాయింట్లు లాభపడి 26,172.40 వద్ద ముగిసింది. ఇది 26,100 కీలక స్థాయిని నిఫ్టీ అధిగమించడం విశేషం. దీంతో ఇన్వెస్టర్ల సంపద సుమారు రూ.4.5 లక్షల కోట్లు పెరిగింది. బీఎస్ఈ లో లిస్ట్ అయిన కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ మునుపటి సెషన్ లో ఉన్న రూ.487 లక్షల కోట్ల నుంచి దాదాపు రూ.491.5 లక్షల కోట్లకు చేరింది. సెన్సెక్స్ కంపెనీల్లో ట్రెంట్ షేరు 3.56 శాతం లాభంతో మొదటిస్థానంలో నిలిచింది. ఐటీ షేర్లు మార్కెట్ పుంజుకోవడంలో కీలక పాత్ర పోషించాయి. ఇన్ఫోసిస్ 3.06 శాతం పెరగ్గా, టెక్ మహీంద్రా 2.09 శాతం లాభపడింది. హెచ్​సీఎల్ టెక్ 1.67 శాతం, టీసీఎస్ 1.28 శాతం మేర వృద్ధిని కనబరిచాయి. వీటితోపాటు భారతీ ఎయిర్​టెల్, భారత్ ఎలక్ట్రానిక్స్, టాటా మోటార్స్, రిలయన్స్, మారుతీ షేర్లు కూడా పెరిగాయి. ఎఫ్​ఐఐలు తిరిగి కొనుగోళ్ల వైపు మొగ్గు చూపడం ఐటీ రంగం రాణించడానికి దోహదం చేసిందని ఎనలిస్టులు తెలిపారు.

ఇతర సూచీలూ లాభాల్లోనే..

బీఎస్​ఈ  స్మాల్ క్యాప్ సూచీ 1.12 శాతం పెరగ్గా,  మిడ్ క్యాప్ సూచీ 0.86 శాతం లాభపడింది. దాదాపు అన్ని రంగాల సూచీలు లాభాల్లోనే ముగిశాయి. ఐటీ రంగం 1.99 శాతం లాభపడగా, బీఎస్​ఈ ఫోకస్డ్ ఐటీ 1.72 శాతం పెరిగింది. క్యాపిటల్ గూడ్స్ 1.65 శాతం లాభం సాధించింది. ఇండస్ట్రియల్స్ 1.33 శాతం, మెటల్ 1.32 శాతం చొప్పున పెరిగాయి. కమోడిటీస్ రంగం 1.05 శాతం వృద్ధి చెందింది.  బీఎస్​ఈలో 2,796 షేర్లు లాభాల్లో పయనించగా 1,514 షేర్లు నష్టాల్లో ముగిశాయి.  ఆసియా మార్కెట్లలో దక్షిణ కొరియా కోస్పి,  జపాన్ నిక్కీ 225 సూచీలు దాదాపు 2 శాతం మేర పెరిగాయి. షాంఘై ఎస్ఎస్ఈ కాంపోజిట్‌తో పాటు హాంగ్ కాంగ్ హాంగ్ సెంగ్ మార్కెట్లూ లాభాల్లోనే ముగిశాయి. యూరప్ మార్కెట్లు మాత్రం మిశ్రమంగా స్పందించాయి. శుక్రవారం  అమెరికా మార్కెట్లు లాభాలతో ముగియడం దేశీయ మార్కెట్లకు కలిసి వచ్చింది. ఎఫ్​ఐఐలు శుక్రవారం రూ.1,830.89 కోట్ల విలువైన షేర్లను, డీఐఐలు రూ.5,722.89 కోట్ల విలువైన షేర్లను కొన్నారు.