ఏప్రిల్ నుంచి ట్యాక్స్ పేయర్ల.. సోషల్ మీడియా ఖాతాలపైనా ఐటీ శాఖ నజర్

 ఏప్రిల్   నుంచి ట్యాక్స్ పేయర్ల.. సోషల్ మీడియా ఖాతాలపైనా  ఐటీ శాఖ నజర్
  •  డిజిటల్‌‌ సెర్చ్‌‌లు చేసేందుకు  వీలు కల్పిస్తున్న కొత్త ఐటీ బిల్లు   

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఏప్రిల్   నుంచి ట్యాక్స్ పేయర్ల సోషల్ మీడియా అకౌంట్లను కూడా ట్యాక్స్ అధికారులు చెక్‌‌ చేయగలుగుతారు. కొత్త  ఇన్‌‌కమ్ ట్యాక్స్‌‌ బిల్లు, 2025 ప్రకారం,  అనుమానాస్పదంగా దాచిన ఆదాయం లేదా టాక్స్ ఎగవేత ఉన్నట్లు భావిస్తే, ఆ వ్యక్తి  బ్యాంక్ అకౌంట్లు, ట్రేడింగ్ ప్లాట్‌‌ఫామ్స్‌‌, ఈ–మెయిల్స్‌‌, సోషల్ మీడియా ప్రొఫైల్‌‌,  క్లౌడ్ స్టోరేజ్ వంటి డిజిటల్ అకౌంట్ల వివరాలను అధికారులు తీసుకోవచ్చు.     ఇప్పటి వరకు సెక్షన్‌‌ 132 కింద  క్యాష్‌‌, జ్యువెలరీ, పత్రాలు వంటి ఫిజికల్ ఆస్తులను మాత్రమే స్వాధీనం చేసుకునే ట్యాక్స్ అధికారులకు కొత్త చట్టంతో  డిజిటల్‌‌గా కూడా తమ సోదాలను నిర్వహించగలిగే అధికారం దక్కింది. 

మార్పు ఎందుకంటే ?  

లావాదేవీలు ఇప్పుడెక్కువగా ఆన్‌లైన్‌ ప్లాట్‌‌ఫామ్‌‌లలో జరుగుతున్నాయి.   క్రిప్టో ఆస్తులు, విదేశీ ట్రేడింగ్ అకౌంట్లు, డిజిటల్ వాలెట్లు, ఆన్‌‌లైన్ బిజినెస్‌‌ వంటివి డిజిటల్‌‌గా అందుబాటులో ఉంటున్నాయి.  దీంతో  ట్యాక్స్ ఎగవేతలు వంటివి గుర్తించడానికి సాధారణంగా వినియోగిస్తున్న విధానాలు సరిపోవడం లేదు.  అందుకే డిజిటల్ యాక్సెస్ అవసరమని ప్రభుత్వం భావిస్తోంది.

ట్యాక్స్ ఎగ్గొట్టేవాళ్లకు కష్టమే..  

నిజాయితీగా పన్ను చెల్లించే వారిపై పెద్దగా ప్రభావం ఉండదు.  అనుమానాస్పద లావాదేవీలు చేసిన వాళ్ల ఈ–మెయిల్స్, సోషల్ మీడియా సంభాషణలు, ఆన్‌‌లైన్ లావాదేవీలు, డిజిటల్ ఆస్తులతో దాచిన ఆదాయాన్ని గుర్తించగలుగుతారు. ఈ విధానంతో  పన్ను ఎగవేతలు తగ్గుతాయని 
భావిస్తున్నారు.

కారణం ఉంటేనే..  

తమకు ఎప్పుడు నచ్చితే అప్పుడు ట్యాక్స్ పేయర్ల డిజిటల్ అకౌంట్లను యాక్సెస్ చేయడానికి  అధికారులకు వీలుండదు. ఫిజికల్‌‌ సోదాలు నిర్వహించినట్టే,  డిజిటల్‌‌ అకౌంట్లను సెర్చ్ చేయాలంటే  బలమైన కారణం ఉండాలి. ట్యాక్స్ ఎగవేత లేదా అనుమానాస్పద ఆదాయం ఉందని రికార్డ్ చేశాకనే   అధికారులకు అనుమతి లభిస్తుంది. కొత్త ఐటీ బిల్లును ఈ ఏడాది  ఫిబ్రవరి 13న పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు.