- రూ.4.5 కోట్లతో నట్టల నివారణ ప్రోగ్రాం: మంత్రి వాకిటి శ్రీహరి
మహబూబ్‌నగర్, వెలుగు: మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా విద్యార్థులు తమను తాము తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి పొన్న ప్రభాకర్ పేర్కొన్నారు. మహబూబ్‌నగర్ నగరంలో సోమవారం మంత్రులు వివేక్ వెంకటస్వామి, వాకిటి శ్రీహరి, మహ్మద్ అజారుద్దీన్ పర్యటించారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో కలెక్టరేట్‌కు చేరుకున్నారు.
వారికి కలెక్టర్ విజయేందిర బోయి, కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం నగరంలోని బీసీ బాలికల సంక్షేమ హాస్టల్ ప్రాంగణంలో స్థానిక ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తన తండ్రి దివంగత యెన్నం జానకి రామిరెడ్డి జ్ఞాపకార్థం సొంత నిధులతో ఏర్పాటు చేసిన డిజిటల్ లర్నింగ్ సెంటర్‌ను మంత్రులు ప్రారంభించారు.
మహబూబ్‌నగర్ రూరల్ మండలం అప్పనపల్లి గ్రామంలో మంత్రులు గొర్రెలు, మేకలకు నట్టల నివారణ (డీవార్మింగ్) మందులు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ ఎమ్మెల్యే యెన్నం విద్యా ప్రదాతగా నిలుస్తున్నారన్నారు. విద్యను అందించడం సామాజిక బాధ్యతగా గుర్తించిన వ్యక్తి అని కొనియాడారు.
తన నియోజకవర్గంలోని సర్కారు బడులు, హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థులకు ప్రైవేట్ విద్యార్థులకు దీటుగా డిజిటల్ లర్నింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. విద్యార్థులు పుస్తకాలకే పరిమితం కాకుండా, డిజిటల్ టెక్నాలజీ, కంప్యూటర్, ఆన్‌లైన్ లర్నింగ్ వంటి అంశాల్లో నైపుణ్యం సాధించాలని సూచించారు.
ప్రభుత్వం రూ. 4.5 కోట్లతో నట్టల నివారణ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వివరించారు. గొర్రెలు, మేకలు వ్యాధులతో చనిపోయినప్పుడు ఆర్థిక భద్రత కల్పించేందుకు ప్రభుత్వం కొత్త బీమా పాలసీని తీసుకొస్తుందన్నారు. పశు పోషణ అనేక కుటుంబాలకు ప్రధాన జీవనాధారం కావడంతో, వాటి రక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
మహబూబ్‌నగర్ డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్, ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనా రెడ్డి, లైబ్రరీ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, ఏఎంసీ చైర్‌పర్సన్ బెక్కెరి అనిత, జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం పర్సన్ ఇన్‌చార్జ్ గోనెల శ్రీనివాసులు, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ పాల్గొన్నారు.
