స్వదేశంలో చిక్కుకుపోయిన హెచ్-1బీ వీసా హోల్డర్లు..వీసా రెన్యువల్ ఇంటర్వ్యూ లేట్ ఎఫెక్ట్

స్వదేశంలో చిక్కుకుపోయిన హెచ్-1బీ వీసా హోల్డర్లు..వీసా రెన్యువల్ ఇంటర్వ్యూ లేట్ ఎఫెక్ట్
  • వర్క్  పర్మిట్ రెన్యువల్  కోసం భారీ సంఖ్యలో వచ్చిన భారతీయులు
  • అమెరికా సోషల్ మీడియా వెట్టింగ్ పాలసీతో ఇంటర్వ్యూలు రీషెడ్యూల్

        

న్యూఢిల్లీ: వర్క్  పర్మిట్  రెన్యువల్  కోసం భారత్ కు వచ్చిన కొన్నివేల మంది హెచ్ 1బీ వీసా హోల్డర్లు ఇక్కడే చిక్కుకుపోయారు. అమెరికా విదేశాంగ శాఖ సోషల్ మీడియా వెట్టింగ్  పాలసీ (సోషల్ మీడియా అకౌంట్ ను పూర్తిగా తనిఖీచేసే ప్రక్రియ) కారణంగా వీసా అపాయింట్ మెంట్లను రీషెడ్యూల్  చేశారు. వాస్తవానికి హెచ్ 1బీ వీసా హోల్డర్ల ఇంటర్వ్యూలు ఈ నెల 15 నుంచి 26 మధ్య జరగాల్సి ఉంది. అయితే.. సోషల్ మీడియా వెట్టింగ్  పాలసీ వల్ల ఇంటర్వ్యూలను వచ్చే ఏడాది మార్చి నెలకు వాయిదా వేశారు. దీంతో వీసా రెన్యువల్  (పునరుద్ధరణ) తో పాటు వేర్వేరు సొంత పనుల కోసం భారత్​కు వచ్చిన వారు ఇక్కడే ఉండిపోయారు. అమెరికాలోని డెట్రాయిట్  సబర్బ్స్ లో పనిచేస్తున్న ఓ హెచ్ 1బీ వీసా హోల్డర్.. భారత్ లో తన బంధువు పెళ్లి కోసం వచ్చాడు. అతని అపాయింట్ మెంట్  ఈనెల 17, 23న ఉంది. కానీ, సోషల్  మీడియా వెట్టింగ్ పాలసీతో ఇంటర్వ్యూ తేదీలను రీషెడ్యూల్  చేశారు. దీంతో ఆ వ్యక్తి ఇంటర్వ్యూ మధ్యలోనే ఆగిపోయింది.

ఎంబసీకి రావద్దని అభ్యర్థులకు హెచ్చరిక

ఇంటర్వ్యూ తేదీలను భారత కాన్సులర్ కు తెలియజేశామని యూఎస్  విదేశాంగ శాఖ పేర్కొంది. అమెరికా జాతీయ భద్రత, పబ్లిక్ సేఫ్టీకి విదేశీ పౌరులు ముప్పుగా మారకుండా ఉండడానికే సోషల్ మీడియా వెట్టింగ్ పాలసీని తెచ్చామని తెలిపింది. కొత్త డేట్స్  గురించి భారత కాన్సులర్ కు వెల్లడించినందున షెడ్యూల్  కన్నా ముందే అభ్యర్థులు యూఎస్  ఎంబసీకి రాకూడదని, ఒకవేళ వచ్చినా వారిని లోపలికి రానివ్వబోమని హెచ్చరించింది. ‘‘మీ వీసా అపాయింట్ మెంట్  రీషెడ్యూల్  అయిందని మీకు ఈమెయిల్  ద్వారా ఇప్పటికే తెలియజేశాం. కొత్త అపాయింట్ మెంట్ డేట్ కోసం ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ తేదీల కన్నా ముందే అమెరికా ఎంబసీకి రావద్దు. ఒకవేళ వచ్చినా లోపలికి రానివ్వం” అని అమెరికా విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. కాగా.. హెచ్ 1బీ వీసా హోల్డర్లలో 71 శాతం భారతీయులే ఉన్నారు.