మహారాష్ట్రలో 16 నుంచి బీజేపీ మరాఠా ఉద్యమం

మహారాష్ట్రలో 16 నుంచి బీజేపీ మరాఠా ఉద్యమం

ముంబయి: రెండు నెలలుగా కరోనా మహమ్మారితో కిందా మిందా పడిన మహారాష్ట్ర ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటోంది. కేసులు తగ్గుముఖం పడుతున్న నేపధ్యంలో కఠిన ఆంక్షలు ఒక్కొక్కటీ ఎత్తేస్తున్న తరుణంలో మహారాష్ట్ర లో మరాఠా రిజర్వేషన్ రాజకీయ నిప్పుల కుంపటి రగిలించేందుకు బీజేపీ సన్నాహాలు చేస్తోంది. ఈనెల 16వ తేదీ నుంచి మరాఠా ఉద్యమాన్ని చేపట్టి దశల వారీగా ఉధృతం చేయాలని నిర్ణయించింది. 
మరాఠా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని బీజేపీ మిత్రపక్షమైన శివ సంగ్రామ్‌ పార్టీ నేత వినాయక్‌ మీటే నిన్న బీడ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రకటించిన విషయం తెలిసిందే. 

సాధారణ ప్రకటనే అని భావిస్తున్న నేపధ్యంలో ఇవాళ ఛత్రపతి శివాజీ వంశానికి చెందిన వ్యక్తి అయిన బీజేపీ ఎంపీ సంభాషి రాజే ఛత్రపతి కూడా మరాఠా ఉద్యమాన్ని తాము ఉధృతం చేస్తామని ప్రకటించడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. కోల్హాపూర్‌లో ఈ ఉద్యమం ప్రారంభిస్తామని ఆయన చెప్పారు. ఈ నేపధ్యంలో రాజకీయంగా ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తున్న మరాఠా క్రాంతి మోర్చా కూడా రాష్ట్రంలోని పరిస్థితులపై రేపు సమావేశమై భవిష్యత్‌ కార్యక్రమాన్ని నిర్ణయిస్తామని ప్రకటించడంతో రాష్ట్ర రాజకీయాలు మరోసారి వేడెక్కే పరిస్థితి కనిపిస్తోంది.