కేసీఆర్‌‌వి మాటలే.. అభివృద్ధి లేదు

కేసీఆర్‌‌వి మాటలే.. అభివృద్ధి లేదు

తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ కాదు... ఒక కుటుంబ పాలన అంటూ ఫైర్ అయ్యారు ఛత్తీస్ గడ్ రాష్ట్రంలోని Kurud నియోజకవర్గ ఎమ్మెల్యే అజయ్ చంద్రకర్. రజాకార్ల పరిపాలనలో ప్రజలను దోచుకొని ఏలాంటి చిత్రహింసలు పెట్టారో అదేవిధంగా ఈనాడు కేసీఆర్ కుటుంబ పాలన అదేవిధంగా జరుగుతోందని విమర్శించారు. మంథనిలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే  అజయ్ చంద్రకర్ పాల్గొన్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో... బీజేపీలోని కీలక నేతలంతా తెలంగాణ రాష్ట్రంలో మోహరించారు. పలువురు బీజేపీ నేతలకు నియోకవర్గాల్లో పర్యటించాలని అధిష్టానం ఆదేశించింది. దీంతో వారు ఆయా నియోజకవర్గాలకు చేరుకుని సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మంథనిలో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే అజయ్ చంద్రకర్ పాల్గొన్నారు. హైదరాబాదులో వచ్చే నెల 3న జరిగే ప్రధాన మంత్రి మోడీ బహిరంగ సభ విజయవంతం చేయాలని సూచించారు. టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల సొమ్ము దోచుకొని నేషనల్ కు పోవడానికి ప్రయత్నం చేస్తుందని విమర్శించారు.

కేసిఆర్ మాటలు తప్ప తెలంగాణలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. కరోనాతో అల్లాడుతున్న సమయంలో భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా మోడీనే కరోనా టీకా సమకూర్చారని గుర్తు చేశారు. ఇంటింటికి నల్లా సౌకర్యం కల్పించి నీరు అందిస్తామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పారని, అది మాటల వరకే పరిమితమైందన్నారు. ఇప్పటికీ ప్రజలు నీటి కోసం ఖాళీ బిందెలతో దర్శనమిస్తున్నారని విమర్శించారు. ప్రతి గ్రామంలోని పేదలకు ఇంటింటికి మరుగుదొడ్లు నిర్మాణం, గ్యాస్ సౌకర్యం, పీఎం కిసాన్ యోజన పథకం ద్వారా ప్రతి పేద రైతుకు రూ. 6 వేలు మోడీ ప్రభుత్వం అందించిందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం హంతకులను ఆదుకొంటోందని, మంథనిలో జరిగిన న్యాయవాద దంపతుల హత్యే అందుకు ఉదహారణగా పేర్కొన్నారు. తాడిచర్ల ఏఎంఆర్ మైనింగ్ కంపెనీతో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ నాయకులు రాజీపడడంతో టెండర్ల వాల్యుయేషన్‌ లో చాలా అవినీతి జరిగిందని ఆరోపించారు. మంథని నియోజకవర్గ యువతను రెచ్చగొడుతూ అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా స్థానిక ఎమ్మెల్యే ఇటీవల సత్యాగ్రహ దీక్ష చేశారని ఎమ్మెల్యే అజయ్ చంద్రకర్ తెలిపారు.