మునుగోడు కోసమే కేసీఆర్ ప్రజల మధ్యకొచ్చిండు

మునుగోడు కోసమే కేసీఆర్ ప్రజల మధ్యకొచ్చిండు

నల్గొండ: ఎన్నికలప్పుడే కేసీఆర్ కు ప్రజలు గుర్తొస్తారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శించారు. మంగళవారం నల్గొండ మున్సిపాలిటీలో ఈటల పర్యటించారు. మర్రిగూడ నుంచి క్లాక్ టవర్ వరకు నిర్వహించిన బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం పద్మానగర్ లో  నిర్వహించిన  కొండా లక్ష్మణ్ బాపూజీ జన్మదిన వేడుకలకు ఈటల రాజేందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. ఉప ఎన్నికలు వస్తేనే కేసీఆర్ కు ప్రజల సమస్యలు, కొత్త పథకాలు గుర్తుకు వస్తాయన్నారు. ఎప్పుడూ ఫాం హౌజ్ లో పడుకునే కేసీఆర్... మునుగోడు ఉప ఎన్నిక కోసం ప్రజల మధ్యకు వచ్చారని మండిపడ్డారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రాజీనామా తర్వాత కేసీఆర్ కొత్త పథకాలకు శ్రీకారం చుట్టారన్నారన్నారు.

మునుగోడులో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో సీఎం కేసీఆర్ ఉన్నారని, ఈ క్రమంలోనే టీఆర్ఎస్ ఆధ్వర్యంలో దావత్ కార్యక్రమాలు నడుస్తున్నాయని ఆరోపించారు. మునుగోడు నియోజవర్గంలోని దళితులందరికీ దళిత బంధు ఇవ్వాలని, గిరిజన బంధును వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. మునుగోడు నియోజకవర్గాన్ని పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకొని సంక్షేమ పథకాలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని అన్నారు. మద్యం, డబ్బు విచ్చలవిడిగా పంచి టీఆర్ఎస్ ఎన్ని కుట్రలు పన్నినా మునుగోడులో గెలిచేది రాజగోపాల్ రెడ్డి మాత్రమేనని ధీమా వ్యక్తం చేశారు.