రాష్ట్రంలో భూరికార్డుల ప్రక్షాళన పెద్ద మోసం

రాష్ట్రంలో భూరికార్డుల ప్రక్షాళన పెద్ద మోసం

రాష్ట్రంలో అక్రమ భూదందాలకు సీఎం కేసీఆరే రూపకర్త అని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. రాష్ట్రంలో భూ రికార్డుల ప్రక్షాళన పెద్ద మోసమన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో భూరికార్డుల సమస్యలే ఉన్నాయని.. సీఎం కేసీఆర్ రెవెన్యూ వ్యవస్థను ఆగం చేశారని మండిపడ్డారు. భూరికార్డుల తిప్పలు లేకుండా చేస్తానని కేసీఆర్ గొప్పలు చెప్పారని..రెవెన్యూ రికార్డులు బాగా చేశారని ఉద్యోగులకు నెలజీతం బోనస్ కూడా ఇచ్చారన్నారు. ప్రజల నుంచి పెద్దఎత్తున ఫిర్యాదులు వచ్చేసరికి తప్పంతా ఉద్యోగులదే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. 

ధరణితో లక్షల మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఈటల రాజేందర్ అన్నారు. ధరణిలో తప్పులతడకగా భూముల వివరాలు ఉన్నాయని.. 18లక్షల దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నట్లు చెప్పారు. ధరణి పోర్టల్ రైతుల కోసం పెట్టారా..లేక డబ్బులు సంపాదించడానికి పెట్టారా అని ప్రశ్నించారు. మహిళ ఎమ్మార్వోపై పెట్రోల్ పోసి తగలబెట్టిన నీచ చరిత్రకు కారకుడు కేసీఆర్ అని మండిపడ్డారు.

రంగారెడ్డి జిల్లా గండిపేటలో వేల కోట్లు విలువ చేసే వెయ్యి ఎకరాల భూమిని ప్రగతిభవన్ తో సంబంధం ఉన్నవాళ్లు కబ్జా చేశారని ఈటల రాజేందర్ ఆరోపించారు. భూముల వివరాలను భద్రపరిచే బాధ్యతలను అన్ని రాష్ట్రాలు ఎన్ఐసీకి అప్పగిస్తే.. కేసీఆర్ మాత్రం రాష్ట్రానికి సంబంధించిన భూరికార్డులను ఫిలిప్పిన్స్ కంపెనీ చేతిలో పెట్టారని అన్నారు. భూముల వివరాలపై సీఎం కేసీఆర్ శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.