రాజకీయ స్పీచ్​లా బడ్జెట్ : మహేశ్వర్​రెడ్డి

రాజకీయ స్పీచ్​లా బడ్జెట్ : మహేశ్వర్​రెడ్డి

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన బడ్జెట్​రాజకీయ ప్రసంగంలా సాగిందని బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్​రెడ్డి విమర్శించారు. బడ్జెట్​తర్వాత మీడియా పాయింట్​లో ఆయన ఎమ్మెల్యేలు పాయల్​శంకర్, రామారావు పాటిల్, సూర్యనారాయణతో కలిసి మట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజల్ని మభ్యపెట్టేలా ఉందన్నారు.

వచ్చే ఎంపీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తయారు చేసినట్టుగా ఉందన్నారు. రైతులు, నిరుద్యోగులకు ఎలాంటి ప్రయోజనంలేని బడ్జెట్​అన్నారు. తెలంగాణలోని అన్ని వర్గాలను బడ్జెట్ నిరాశపరిచిందని చెప్పారు. అంకెల గారడీ, పొంతన లేని లెక్కలతో రూపొందించారని విమర్శించారు. బడ్జెట్​స్పీచ్​లో కేసీఆర్ వైఫల్యాలను ఏకరువుపెట్టారని తెలిపారు. ఆయా సమస్యలను ఎలా అధిగమిస్తారో చెప్పలేదన్నారు.

ఈ బడ్జెట్​తో కాంగ్రెస్​ప్రభుత్వ డొల్లతనం బయటపడిందన్నారు. రాష్ట్రంలోని 35 లక్షల మంది నిరుద్యోగులను నిరాశపరిచారని తెలిపారు. నిరుద్యోగ భృతి గురించి మాటేలేదు, భృతి కోసం ఇప్పటికే రూ.1400 కోట్లు బాకీపడ్డారని అన్నారు. కాంగ్రెస్​పార్టీ ఇచ్చిన 412 హామీలను నెరవేర్చడానికి బీజేపీ పోరాటం చేస్తుందని చెప్పారు. 56 శాతం ఉన్న బీసీలకు రూ.8వేల కోట్లనే కేటాయించి బీఆర్ఎస్ లెక్క కాంగ్రెస్ కూడా మోసం చేసిందని ఆరోపించారు.

ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ గొల్ల కురుమలను ఈ ప్రభుత్వం మోసం చేసిందని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో కట్టిన డబుల్​బెడ్​రూమ్ ఇండ్లు ఖాళీగా ఉన్నాయని.. వాటిని లబ్ధిదారులకు ఎలా కేటాయిస్తారన్న విషయం కాంగ్రెస్ ప్రభుత్వం పేర్కొనలేదన్నారు.