
- బీఆర్ఎస్ సభ్యులపై అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ ఫైర్
- కాళేశ్వరం ఎంక్వైరీ రిపోర్ట్‌ను సభలో పెట్టాలి
- కేసీఆర్, హరీశ్ రావును ప్రాసిక్యూట్ చేయాలి
- బీఆర్ఎస్ పాపం పండడం వల్లే ఎన్నికల్లో ప్రజలు శిక్షించారు.. అయినా వాళ్లకు బుద్ధిరాలేదని విమర్శ
హైదరాబాద్, వెలుగు: తుమ్మిడిహెట్టి దగ్గర రాక్ఫౌండేషన్ మీద కట్టాల్సిన ప్రాజెక్టును మేడిగడ్డ లాంటి లూజ్ సాయిల్ మీద కట్టి, కూలేందుకు కారణమయ్యారని మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావుపై బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు మండిపడ్డారు. ఆ ఇద్దరినీ ప్రాసిక్యూట్చేయాలని డిమాండ్ చేశారు. ‘‘వీళ్ల పాపం పండడం వల్లే ఎన్నికల్లో ప్రజలు శిక్షించారు. అయినా వారికి బుద్ధిరాలేదు. ఎక్కడ తమ తప్పులు బయటపడ్తాయోనని ఇరిగేషన్‌పై చర్చకు ముందే పాపాత్ములంతా(బీఆర్ఎస్ సభ్యులను ఉద్దేశించి) పారిపోయారు” అని వ్యాఖ్యానించారు.
బుధవారం అసెంబ్లీలో వివిధ పద్దులపై జరిగిన చర్చలో భాగంగా పాల్వాయి హరీశ్ మాట్లాడారు. ‘‘కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై మనం తప్పకుండా మాట్లాడాలి.. వీళ్లుంటే బాగుండు, కానీ ఈ పాపాత్ములు తప్పించుకుని పోయారు. ఈ శతాబ్దపు అతిపెద్ద ఇంజినీరింగ్ తప్పిదం కాళేశ్వరం. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ రిపోర్ట్‌ను శాసనసభలో పెట్టాలి.ఏడో బ్లాక్ కుంగిపోతే రిపేర్ చేస్తే పక్కనే ఉన్న ఇంకో బ్లాక్ కుంగదనే నమ్మకమేంది? వాళ్లు కట్టిందే లూజ్ సాయిల్మీద.. మా దగ్గర తుమ్మిడిహెట్టి దగ్గర రాక్ ఫౌండేషన్ మీద కట్టాల్సిన ప్రాజెక్టును తీసుకుపోయి ఈ పాపాత్ములు అక్కడ కాళేశ్వరం దగ్గర లూజ్ ఫౌండేషన్ మీద కడ్తే ఎలక్షన్ముందే కుంగింది’’ అని అన్నారు.
కారకులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి
మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టి తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలని పాల్వాయి హరీశ్‌బాబు డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కేసీఆర్, హరీశ్ రావును క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేయడంతోపాటు, ఎల్ అండ్ టీ కాంట్రాక్టర్ పైనా చర్యలు తీసుకోవాలని కోరారు.