ప్రభుత్వ భూముల్లో విల్లాలు.. వందల కోట్ల కుంభకోణం : రఘునందనరావు

ప్రభుత్వ భూముల్లో విల్లాలు.. వందల కోట్ల కుంభకోణం : రఘునందనరావు

హైదరాబద్ సిటీ నడిబొడ్డున హఫీజ్ పేట సర్వే నెంబర్ 77, 78, 79, 80 భూముల్లో.. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం జరుగుతున్న విలాసవంతమైన విల్లాల వెనక వందల  కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలు జరిగినట్లు చెబుతున్నారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందనరావు. మార్చి 28వ తేదీ మంగళవారం ఆయన.. బీజేపీ ఆఫీసులో విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ భూముల అని హైకోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా.. మున్సిపాలిటీ, జీహెచ్ ఎంసీ ఎలా అనుమతులు ఇస్తుందని ప్రశ్నించారు. దీని వెనక మంత్రి కేటీఆర్ ఉన్నారని.. మున్సిపల్, పట్టణాభివ్రుద్ధి శాఖ మంత్రిగా బాధ్యత వహించాలన్నారు.

ఎనిమిది ఎకరాల్లో అపార్ట్ మెంట్స్ నిర్మాణం శర వేగంగా సాగుతుందని.. ఏపీ బీఆర్ఎస్ శాఖ నేతకు లబ్ధి చేకూర్చుతున్నారని ఆరోపించారు. 500 కోట్ల రూపాయలను ఓ సంస్థకు లాభం చేకూర్చే విధంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని ప్రశ్నించారాయన. మంత్రి కేటీఆర్ పరిధిలోని శాఖ కింద వచ్చే ఈ వ్యవహారంపై ఆయన ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారాయన. 

సర్వే నెంబర్ 77 హఫీజ్ పేట 2013, జూలై 15న ఇచ్చిన సింగిల్ బెంచ్ తీర్పు తప్పని  ఇద్దరు జడ్జీల బెంచ్ సస్పెండ్ చేసినట్లు ఆధారాలను చూపించారాయన.  అది ప్రభుత్వ భూమే అని వివరించారు. అలాంటి భూములను ప్రభుత్వం ఎలా రిజిస్ట్రేషన్ చేస్తుందని ప్రశ్నించారాయన. ప్రభుత్వ భూమి నాది అని ఓ వ్యక్తి అప్లికేషన్ పెట్టుకుంటే.. ఐదు రోజుల్లోనే ఫైల్ మూవ్ అయ్యిందని వెల్లడించారాయన. కోర్టు సస్పెండ్ చేసిన డిక్రీలోని ఎనిమిది ఎకరాల్లో అపార్ట్ మెంట్ నిర్మాణానికి జీహెచ్ ఎంసీ ఎలా అనుమతి ఇస్తుందని నిలదీశారాయన. 

ఈ భూ కుంభకోణంపై ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటామని హెచ్చరించారు. మంత్రి కేటీఆర్ శాఖ పరిధిలో జరిగిన కుంభకోణంపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పాలని డిమాండ్ చేశారు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందనరావు..