సబ్సిడీలు రద్దు చేయాలని కూడా చెప్పలే

సబ్సిడీలు రద్దు చేయాలని కూడా చెప్పలే
  • అబద్ధాలు చెప్పొద్దు: రఘునందన్ రావు
  • 6 నిమిషాలు మాట్లాడగానే మైక్ కట్ చేసిన స్పీకర్
  • విద్యుత్ బిల్లును వ్యతిరేకిస్తున్నామన్న భట్టి

 

హైదరాబాద్, వెలుగు: కేంద్రం తీసుకొచ్చిన విద్యుత్ సవరణ బిల్లులో వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలని, రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న సబ్సిడీలు ఎత్తివేయాలని ఎక్కడా లేదని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు స్పష్టం చేశారు. బిల్లులో ఆ పదాలు ఎక్కడన్నా ఉంటే ప్రజలకు సీఎం బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలని 2020 సెప్టెంబర్ 15న రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసిందని, ఇప్పుడు అదే బిల్లుపై లఘు చర్చ అవసరం లేదని అన్నారు. విద్యుత్ చట్ట సవరణ బిల్లుపై సోమవారం అసెంబ్లీలో రఘునందన్ రావు మాట్లాడారు.“సబ్సిడీలు ఎత్తేస్తారని, మోటార్లకు మీటర్లు పెడుతారని మంత్రులు, ఎమ్మెల్యేలు సభలో, బయట పదే పదే చెబుతున్నారు. కానీ ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీని రద్దు చేయాలని విద్యుత్ సవరణ బిల్లులో ఎక్కడా పేర్కొనలేదు. సబ్సిడీలు ఎత్తేయమని కేంద్రం చెబుతోందని, సబ్సిడీలు తాము ఇస్తుంటే కేంద్రం తొలగించాలని చూస్తోందని ప్రచారం చేస్తున్నరు. ఎక్కడా సబ్సిడీలు ఎత్తేయాలని చెప్పలేదు” అని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ పుట్టిందే అంత్యోదయ కాన్సెప్ట్‌తో అని, పేద బడుగు బలహీన వర్గాలకు నష్టం చేయాలని బీజేపీ చూడదని చెప్పారు. ఈ సమయంలో అధికార పార్టీ సభ్యుల నుంచి నినాదాలు హోరెత్తాయి. వారిని సీఎం వారించి.. రఘునందన్ స్పీచ్‌ను కొనసాగించాలని సూచించారు. సీఎం మాట్లాడమని చెప్పిన తర్వాత అధికార పార్టీ సభ్యులు ఎందుకు అడ్డుపడుతున్నారని, ‘మీ ఇబ్బంది ఏంటి’ అని ప్రశ్నించారు. మోడీ ప్రధాని అయ్యాక 1000 రోజుల ప్లాన్ తీసుకొని 18 వేల గ్రామాలకు కరెంట్ సదుపాయాన్ని కల్పించారని గుర్తు చేశారు. అవాస్తవాలను చెప్పాలనే ఆలోచన తమకు లేదన్నారు. స్పీకర్ పోచారం జోక్యం చేసుకొని.. స్పీచ్‌ను ముగించాలని కోరారు. దీంతో ఇంత పెద్ద బిల్లుపై మాట్లాడటానికి తనకు 2 నిమిషాలు టైమ్ ఇవ్వాలని రఘునందన్ కోరారు. ఇప్పటికే 6 నిమిషాలు టైమ్ ఇచ్చామని స్పీకర్ మైక్ కట్ చేయగా.. సీఎం కేసీఆర్ తన స్పీచ్‌ ప్రారంభించారు.

ఓల్డ్‌ సిటీలో సమస్యలు: ఎమ్మెల్యే బలాల
కేంద్రానికి వ్యతిరేకంగా రాష్ట్రం ఏ నిర్ణయం తీసుకున్నా తమ మద్దతు ఉంటుందని ఎంఐఎం ఎమ్మెల్యే అహ్మద్ బలాల చెప్పారు. విద్యుత్ శాఖకు వేల కోట్లు ఖర్చు పెడుతున్నా.. ఓల్డ్ సిటీలోని నియోజకవర్గాల్లో కొన్ని సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించాలని కోరారు.

7 బిల్లులు ప్రవేశపెట్టిన మంత్రులు
ఆజామాబాద్ ఇండస్ర్టియల్ ఏరియా సవరణ బిల్లు, మున్సిపల్ లాస్ సవరణ బిల్లును మంత్రి కేటీఆర్ ప్రవేశపెట్టారు. పబ్లిక్ ఎంప్లాయిమెంట్ సవరణ బిల్లుని మంత్రి హరీశ్‌ రావు, యూనివర్సిటీ ఆఫ్ ఫారెస్ట్ బిల్లును మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, యూనివర్సిటీ కామన్ రిక్రూట్ మెంట్ బిల్లును మంత్రి సబితా ఇంద్రారెడ్డి, తెలంగాణ మోటార్ వెహికల్ సవరణ బిల్లును మంత్రి పువ్వాడ అజయ్, తెలంగాణ జీఎస్టీ సవరణ బిల్లును సీఎం తరఫున మంత్రి తలసాని ప్రవేశపెట్టారు. వీటిపై మంగళవారం చర్చ జరగనుంది.

కేంద్రం పెత్తనమేంది?: భట్టి విక్రమార్క
ఉమ్మడి జాబితాలో ఉన్న విద్యుత్‌పై కేంద్రం పెత్తనం ఏంటని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రశ్నించారు. ఏపీకి  కరెంట్ బకాయిలు 30 రోజుల్లో చెల్లించాలంటూ సంబంధం లేని విషయంలో కేంద్రం తెలంగాణకు నోటీసులు ఇచ్చుడేందని  ప్రశ్నించారు. ఉచిత కరెంట్ వద్దని, వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగిస్తామనడానికి వాళ్లు ఎవరని మండిపడ్డారు. సబ్సిడీ కరెంట్‌ను బంద్ చేస్తే కులవృత్తుల వాళ్లు ఇబ్బంది పడుతారని చెప్పారు. కేంద్రం బలవంతంగా ఈ బిల్లును అమలు చేయాలని ప్రయత్నిస్తే రాష్ట్ర ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ ఏంటో చెప్పాలని కోరారు. పేదలకు ఇచ్చే రేషన్, పింఛన్లు ప్రభుత్వాలు ఉచితంగా ఇవ్వట్లేదని, వారు చెల్లిస్తున్న పన్నులను వెచ్చించడమేనని  చెప్పారు. ఇంతలో సీఎం జోక్యం చేసుకొని గణేశ్ నిమజ్జనం, సెప్టెంబర్ 17 వజ్రోత్సవ వేడుకల నేపథ్యంలో సమావేశాలను కుదించామన్నారు.