ములుగు, వెలుగు : మేడారం మహాజాతర జనవరి 28 నుంచి 31వరకు జరుగనున్న నేపథ్యంలో టీటీడీ కల్యాణ మండపంలో ఏర్పాటు చేయనున్న శిబిరంలో 50 పడకలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ములుగు డీఎంహెచ్వో గోపాల్ రావు తెలిపారు. బుధవారం ములుగు జిల్లా వైద్యారోగ్యశాఖ ఆఫీస్లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతర సందర్భంగా అవసరమైన మందులు, సర్జికల్ పరికరాలు, మంచాలు సమకూర్చుకోవాలన్నారు.
జాతర పరిసరాల్లో 30 ఉచిత వైద్యశిబిరాలను ఏర్పాటు చేస్తూ స్పెషలిస్ట్ వైద్యులు, సిబ్బంది మూడు షిఫ్టులుగా సేవలు అందించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. అత్యవసర వైద్యసేవల కోసం 108 అంబులెన్స్ లను అన్ని వేళలా అందుబాటులో ఉంచుతామని, టీటీడీ కల్యాణ మండపంలోని వైద్యశాల, బస్టాండ్, జంపన్న వాగు వద్ద వాహనాలను ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్వో విపిన్కుమార్, వైద్యులు తదితరులు పాల్గొన్నారు.
