అసలైన ముద్దాయిలను ఎందుకు వదిలేస్తున్నరు?

అసలైన ముద్దాయిలను ఎందుకు వదిలేస్తున్నరు?
  • ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు, హోంమంత్రి మనవడు లేరని క్లీన్ చిట్ ఎట్ల ఇస్తరు?
  • ఎమ్మెల్యే కొడుకు ముద్దాయి అని చెప్పడానికి ఆధారాలున్నయ్ 
  • ఈ కేసులో పెద్దోళ్ల పిల్లలు ఉన్నందునే పోలీసులు దర్యాప్తు చేస్తలే
  • బెంజ్ కారులో వచ్చినోళ్లే అసలైన నిందితులు.. అందులోనే అత్యాచారం 
  • సీబీఐ, హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ : రఘునందన్ రావు 

హైదరాబాద్, వెలుగు: మైనర్ పై గ్యాంగ్ రేప్ కేసులో అసలైన నిందితులను ఎందుకు వదిలేశారని, ఆధారాలున్నా ఎందుకు దాస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రశ్నించారు. విచారణ చేయకుండానే ఈ కేసులో ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు, హోంమంత్రి మనవడు లేడని క్లీన్ చిట్ ఎలా ఇస్తారని నిలదీశారు. ఈ కేసులో పోలీసులు వాస్తవాలు దాస్తున్నారని, అందుకే తాను ఆధారాలు బయటపెడుతున్నానని చెప్పారు. అసలైన నిందితులకు శిక్ష పడాలని, బాధితురాలికి న్యాయం జరగాలని కోరారు. శనివారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. 

ఎమ్మెల్యే కొడుకు అసలు ముద్దాయి అని చెప్పడానికి కావాల్సిన ఫొటోలు, వీడియోలు తన దగ్గర ఉన్నాయంటూ వాటిని మీడియాకు చూపించారు. చట్ట ప్రకారమే బాధితురాలి ముఖం ఎవరికీ కనపడకుండా వీటిని చూపిస్తున్నానని తెలిపారు. ‘‘పెద్ద పెద్ద వాళ్ల పిల్లలు ఈ కేసులో ఉన్నందుననే పోలీసులు ఫెయిర్ గా ఇన్వెస్టిగేషన్ చేయడం లేదు. అసలు నిందితులు రెడ్ కలర్ మెర్సిడెస్ బెంజ్ కారులో ఉన్నారు. ఆ కారులోనే మైనర్ బాలికపై లైంగిక దాడి జరిగింది. ఆ సమయంలో నలుగురు నిందితులు, బాలిక అందులో ఉన్నారు. ఇందులో ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు బాలికపై లైంగిక దాడి చేస్తున్న దృశ్యాలు స్పష్టంగా ఉన్నాయి. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియో నా దగ్గర ఉంది” అని చెప్పారు. ‘‘ఆ కారు ఎమ్మెల్యే సోదరి పేరు మీద ఉంది. కానీ పోలీసులు మాత్రం ఆ కారును, అందులో ఉన్న నిందితులను చూపించడం లేదు. బెంజ్ కారు వెనకాల వచ్చిన ఇన్నోవా కారును, అందులో ఉన్న వారిని మాత్రమే నిందితులుగా చూపించారు. అసలు నిందితులు ఇప్పటికే దుబాయి, ఇతర దేశాలకు పారిపోయారు. ఈ కేసు చల్లబడ్డ తర్వాత తిరిగి వస్తారు” అని తెలిపారు. 

అసలు నిందితులను అరెస్టు చేయండి.. 

పోలీసులకు ఇంతకన్నా ఆధారాలు ఇంకేం కావాలని, వీటిని వారికి ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నానని రఘునందన్ రావు చెప్పారు. ఇవి సరిపోవు అంటే మరిన్ని కూడా ఇస్తానని తెలిపారు. పోలీసు వ్యవస్థపై తనకు నమ్మకం ఉందని, కానీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పైనే నమ్మకం లేదన్నారు. ‘‘నేను స్వయంగా వెళ్లి డీజీపీ, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కు ఆధారాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాను. ఇన్ని ఆధారాలున్నా ఎమ్మెల్యే కొడుకు లేడని క్లీన్ చిట్ ఇచ్చే అధికారం పోలీసులకు ఎవరిచ్చారు. ఎవరు దోషులో, ఎవరు  నిర్దోషులో తేల్చాల్సింది కోర్టు. ఈ కేసుపై మాట్లాడుతున్నానని నన్ను కొందరు నన్ను బెదిరించే ప్రయత్నం చేశారు. పోలీసులు మీడియాను బెదిరిస్తున్నారు. నిజాలను బయటపెట్టే వాళ్లను బెదిరించడం కాదు.. అసలు నిందితులను అరెస్టు చేయాలి” అని అన్నారు.  
మజ్లిస్ నేతలు చెప్పినట్లే పోలీసులు వింటున్నరు.. 
ఈ కేసును హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణకు రఘునందన్ రావు విజ్ఞప్తి శారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కు నిజాయితీ ఉంటే ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని కోరారు. పోలీసులు బాధితుల పక్షమా? నిందితుల పక్షమా? అని ప్రశ్నించారు. రజాకార్ల వారసుల చేతిలో పోలీసులు కీలు బొమ్మలుగా మారారని ఆరోపించారు. మంచి పోస్టింగ్ ల కోసం పోలీసులు మజ్లిస్ నేతలు చెప్పినట్లు నడుచుకుంటున్నారని మండిపడ్డారు. ఈ కేసులో మంత్రి కేటీఆర్ సొంత పార్టీ వారిని బొందపెట్టి, పక్క పార్టీ వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారన్నారు.

సీసీ టీవీ ఫుటేజీ ఏమైంది? 

‘‘ఈ కేసులో ఎమ్మెల్యే కొడుకు, హోంమంత్రి మనవడు లేనప్పుడు సీసీ టీవీ ఫుటేజీని పబ్లిక్ డొమైన్ లో ఎందుకు ఉంచలేదు. అమ్మాయి ఇంటి నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి పబ్ కు వెళ్లిన ఫుటేజీ ఏమైంది?’’ అని రఘునందన్ ప్రశ్నించారు. కరెంట్ పోయిందనే పేరుతో అసలు ఫుటేజీకి కత్తెర పెట్టడం పోలీసులు చేసే పని అని ఆరోపించారు. వీడియోలో నలుగురు నిందితుల మధ్య అమ్మాయి ఉందని, ఆమెపై లైంగిక దాడి జరిగితే ఎలా ప్రతిఘటిస్తుందని ప్రశ్నించారు. ఒకవేళ అమ్మాయి అంగీకారంతోనే ఇది జరిగినా, ఆమె మైనర్ కాబట్టి అది నేరం కిందికే వస్తుందని చెప్పారు. ‘‘నిందితులు మైనర్లు. వాళ్ల వివరాలు వెల్లడించలేమని పోలీసులు అంటున్నారు. మరి నిర్భయ కేసులో నిందితులు మైనర్లే. వారి వివరాలు వెల్లడించలేదా?’’ అని ప్రశ్నించారు.