భారతదేశ సామాజిక చరిత్రలో మహిళా విద్యకు పునాది వేసిన మహనీయురాలు సావిత్రిబాయి ఫూలే. 19వ శతాబ్దంలో స్త్రీలు చదువుకోవడం అపరాధంగా భావించిన కాలంలో, అణచివేతకు గురైన వర్గాలకు విద్య అనే ఆయుధాన్ని అందించిన తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా ఆమె చరిత్రలో నిలిచారు.
జనవరి 3న ఆమె జయంతిని జరుపుకోవడం కేవలం ఒక మహానుభావురాలిని స్మరించుకోవడమే కాదు, సమానత్వం, సామాజిక న్యాయం పట్ల మన బాధ్యతను మరోసారి గుర్తు చేసుకోవడమే. నేటి సమకాలీన సమాజంలో, మహిళల అక్షరాస్యత రేటు పెరగడం, మహిళల రాజకీయాల్లో, క్రీడల్లో సాధిస్తున్న విజయాలను చూస్తుంటే, సావిత్రిబాయి ఆశయాలు ఇప్పటికీ ఎంత ముఖ్యమైనవో అర్థమవుతుంది. ఆమె జీవితం నేటి సమాజానికి స్ఫూర్తిదాయకం, ముఖ్యంగా మహిళల హక్కులు, విద్యావకాశాల పట్ల మన దృక్పథాన్ని మార్చే శక్తి కలిగి ఉంది. గతకాల అడ్డంకులను దాటి సమకాలీన సవాళ్లను ఎదుర్కొనే శక్తిని అందిస్తుంది.
సావిత్రిబాయి ఫూలే 1831 జనవరి 3న మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని నైగావ్ గ్రామంలో ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు. ఆ కాలంలో మహిళలకు విద్య అందుబాటులో లేకపోవడం వల్ల ఆమెకు బాల్యంలో చదువు లభించలేదు. కానీ, 9 సంవత్సరాల వయసులో మహాత్మా జ్యోతిరావు ఫూలేను వివాహం చేసుకున్న తర్వాత, ఆయన ఆమెకు స్వయంగా చదువు నేర్పారు. ఇద్దరూ కలిసి సమాజంలోని అసమానతలపై పోరాడారు. 1848లో పూణేలో బాలికల కోసం తొలి పాఠశాలను ప్రారంభించడం భారతదేశ విద్యా చరిత్రలో సంచలనాత్మక అధ్యాయం.
అప్పటి సమాజంలో మహిళలు ఇంటి గడప దాటకూడదనే నిబంధనలు ఉండేవి. సావిత్రిబాయి ఈ సంప్రదాయాలను ధిక్కరించి, ఇండియాలో మొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా మారారు. పాఠశాలకు వెళ్తున్నప్పుడు ఆమెపై రాళ్లు, రప్పలు, మట్టి విసిరేవారు. సమాజం నుంచి ఎదురైన అవమానాలు, దాడులు, నిరసనలన్నింటినీ తట్టుకొని కూడా ఆమె తన లక్ష్యాన్ని వదలలేదు. ఆమె భర్తతో కలిసి 18 పాఠశాలలు స్థాపించారు. అందులో ఎక్కువగా అణగారిన వర్గాల బాలికలకు విద్య అందించారు. ఇది సమాజంలోని కుల, జెండర్ అసమానతలపై పోరాటానికి పునాది వేసింది.
సామాజిక మార్పుకు ఆయుధం విద్య
విద్య అనేది కేవలం జ్ఞానం కాదు, సామాజిక మార్పుకు ఆయుధమని సావిత్రిబాయి ఫూలే నమ్మి తన జీవితాన్ని అంకితం చేశారు. ఇది కేవలం వ్యక్తిగత ప్రయాణం కాదు, భారతీయ సామాజిక ఉద్యమాలలో ఒక మైలురాయి. నేటి ఆధునికకాలంలోనూ సావిత్రిబాయి ఫూలే పోరాటం నేటి మహిళా సాధికారతతో దగ్గరి సంబంధం కలిగి ఉంది. 19వ శతాబ్దంలో ఆమె కుల వివక్ష, బాల్యవివాహాలు, సతీ సహగమనం వంటి దురాచారాలపై పోరాడారు. నేడు మహిళల అక్షరాస్యత, మహిళల లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ పెరిగినప్పుడు ఆమె ఆశయాలు సఫలమవుతున్నట్టు కనిపిస్తుంది. అయితే, ఇంకా సవాళ్లు ఉన్నాయి.
గ్రామీణ ప్రాంతాల్లో మహిళల విద్యా రేటు తక్కువగా ఉండటం, జెండర్ వేజ్ గ్యాప్, డొమెస్టిక్ వయోలెన్స్ వంటివి. సావిత్రిబాయి మాటల్లో ‘చదువు బానిసత్వం నుంచి విముక్తికి మార్గం’. ఇది నేటి మహిళలు ‘STEM’ రంగాల్లో అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్ అనే నాలుగు ప్రధాన రంగాల్లో చేరుతున్నప్పుడు, ఆర్థిక స్వావలంబన సాధిస్తున్నప్పుడు ఎంతో అవసరం. ఉదాహరణకు 2025లో మహిళలు మొదటిసారిగా డిఫెన్స్, ఏవియేషన్ రంగాల్లో చేరి చరిత్ర సృష్టించారు. ఇది ఆమె పోరాటానికి సమకాలీన ప్రతిబింబం.
దురాచారాలపై పోరాటం
సావిత్రిబాయి కేవలం విద్యావేత్త మాత్రమే కాదు, సామాజిక సంస్కర్త కూడా. విద్యతోనే సామాజిక మార్పు సాధ్యమని విశ్వసించిన ఆమె, కుల వివక్ష, బాల్యవివాహాలు, సతీ సహగమనం వంటి దురాచారాలపై పోరాటం చేశారు. 1851లో వితంతువుల పునర్వివాహాన్ని ప్రోత్సహించడానికి ఒక హోమ్ స్థాపించారు. అణగారిన వర్గాల హక్కుల పరిరక్షణ కోసం ఆమె చేసిన కృషి భారత సామాజిక ఉద్యమాలకు పునాది వేసింది. మహిళల హక్కుల కోసం చేసిన సేవలకు గుర్తింపుగా 1852లో బ్రిటిష్ ప్రభుత్వం ఆమెను సత్కరించింది. ఆమె పోరాటం డా. బి.ఆర్. అంబేద్కర్ వంటి నాయకులకు స్ఫూర్తిగా నిలిచింది.
2025లో ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే థీమ్ ‘టువార్డ్స్ ఈక్వాలిటీ అండ్ ఎంపవర్‌మెంట్’ అని ఉండటం ఆమె ఆలోచనలతో ప్రతిబింబిస్తోంది. మరోవైపు, మహిళలు క్రికెట్ వరల్డ్ కప్ గెలిచినప్పుడు, ఫోర్బ్స్ లిస్ట్‌లో భారతీయ మహిళలు టాప్ ప్లేస్‌లు సాధించినప్పుడు, ఆమె విశ్వాసం ‘ఎంపవర్ ఏ ఉమన్, అండ్ యు అప్‌లిఫ్ట్ ఏన్ ఎంటైర్ కమ్యూనిటీ’ సార్థకమవుతుంది. ఈ విజయాలు విశ్లేషిస్తే, విద్యా సాధికారత ఆర్థిక, రాజకీయ స్వాతంత్ర్యానికి దారి తీస్తుందని తెలుస్తుంది.
బీసీ, పేదల అభ్యున్నతే లక్ష్యం
ఏఐసీసీ అధినేత్రి సోనియమ్మ ఆశీస్సులతో, రాహుల్ గాంధీ మార్గదర్శకత్వంలో.. తెలంగాణలోని పేద మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు అన్నిరకాల సంక్షేమ, అభివృద్ధి పథకాలను తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అందజేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో మహిళల అభ్యున్నతి, సంక్షేమాల కోసం మేం అందరం చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం. ప్రజాప్రభుత్వం తీసుకుంటున్న కార్యక్రమాలన్నీ కూడా తెలంగాణలో విద్య, ఆర్థిక స్వావలంబనకు ఎంతగానో దోహదపడుతున్నాయి. బీసీ వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా విద్య, రవాణా, సంక్షేమ రంగాల్లో విప్లవాత్మక నిర్ణయాలను మా ప్రభుత్వం తీసుకుంటోంది. సావిత్రిబాయి ఫూలే ఆశయాలే ఈ ప్రజాపాలనకు మార్గదర్శకాలు. సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా, ఆమె చూపిన బాటలో నడుస్తూ.. ప్రతి బాలికకు విద్య, ప్రతి మహిళకు సమాన హక్కులు కల్పించడమే ఆమెకు నిజమైన నివాళి.
మహిళల గౌరవాన్ని పెంపొందించిన కవయిత్రి
సావిత్రిబాయి మంచి కవయిత్రి కూడా. ఆమె రచనలు మహిళల ఆత్మగౌరవాన్ని పెంపొందించాయి. ‘చదువు బానిసత్వం నుంచి విముక్తికి మార్గం’ అనే ఆమె ఆలోచన నేటికీ ప్రాసంగికంగా నిలుస్తోంది. ‘ఎ సొసైటీ దట్ నెగ్లెక్ట్ ద ఎడ్యుకేషన్ ఆఫ్ ఉమెన్డినైస్ ఇట్సెల్ఫ్ హాఫ్ ఇట్స్ పొటెన్షియల్’ అనే ఆమె ఆలోచన నేటి మహిళా ఎంటర్‌ప్రెన్యూర్‌లు, లీడర్‌లకు స్ఫూర్తి. ఆమె కవితలు సమాజంలోని అసమానతలను విమర్శిస్తూ, మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని ప్రేరేపించాయి. ఆమె రచనలు ‘కావ్య ఫూలే’ వంటి సంకలనాలలో లభ్యమవుతాయి, అవి నేటి మహిళా ఉద్యమాలకు మూలాధారాలు కూడా.
తెలంగాణ ప్రభుత్వం నేడు సావిత్రిబాయి ఫూలే ఆశయాలకు అనుగుణంగా సామాజిక న్యాయం, సమానత్వం అనే విలువలను కేంద్రంగా చేసుకుని అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోంది. ముఖ్యంగా మహాలక్ష్మి స్కీమ్‌ను దిగ్విజయంగా అమలు చేస్తూ, మహిళలకు టీజీఎస్‌ఆర్‌టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం అందిస్తోంది, ఇది వారి మొబిలిటీ, ఆర్థిక స్వాతంత్ర్యాన్ని పెంచుతోంది.
పొన్నం ప్రభాకర్, బీసీ సంక్షేమం & రవాణా శాఖ మంత్రి
