క్షీణిస్తున్న సమాచార సమగ్రత.. డిజిటల్ గవర్నెన్స్ చొరవలు.. కార్యాచరణ సవాళ్లు

క్షీణిస్తున్న సమాచార సమగ్రత.. డిజిటల్ గవర్నెన్స్ చొరవలు.. కార్యాచరణ సవాళ్లు

సమాచార సమగ్రత  క్షీణించడంతో మానవ హక్కులను  వినియోగించుకునే విషయంలో ప్రజల సామర్థ్యం దెబ్బతింటోంది. శాంతి,  శ్రేయస్సు,  భవిష్యత్తు సాధించే ప్రయత్నాలకు ఆటంకం కలుగుతోంది.  సమాచార సమగ్రతను బలోపేతం చేయడం అత్యంత అత్యవసర  సవాళ్లలో ఒకటిగా మారింది. మానవ హక్కులు, శాంతియుత సమాజాలు, స్థిరమైన భవిష్యత్తును నిర్దేశించడం వంటివి సమాచార సమగ్రతతోనే సాధ్యం.

సమాచార సమగ్రతను ప్రోత్సహించడం అంటే ప్రజలు అన్ని రకాల సమాచారాన్ని, ఆలోచనలను స్వీకరించడానికి, అందించడానికి, జోక్యం లేకుండా అభిప్రాయాలను కలిగి ఉండటానికి,  వారి హక్కును వినియోగించుకోవడానికి సాధికారత కల్పించడమే. ప్రభుత్వం, వ్యాపారం, ఆరోగ్య సంరక్షణ వంటి రంగాలలో  మంచి నిర్ణయాలు తీసుకోవడానికి  సమాచార  సమగ్రత  చాలా ముఖ్యం.  డిజిటల్ ప్రపంచంలో.. హ్యాకింగ్, మోసం లేదా డేటాను ట్యాంపరింగ్ చేయకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలి.

సాంకేతిక పురోగతులు కొన్ని స్వల్ప దశాబ్దాలలో  కమ్యూనికేషన్లలో  విప్లవాత్మక మార్పులు తెచ్చాయి.  వ్యక్తులు,  సంఘాలను ఊహించలేని స్థాయిలో  అనుసంధానించాయి.  జ్ఞానవ్యాప్తి,  సాంస్కృతిక  సుసంపన్నత, స్థిరమైన అభివృద్ధికి  అవసరమైన  అవకాశాలను  అందించాయి.   డిజిటల్ యుగంలో భావ ప్రకటనా స్వేచ్ఛ పూర్తిగా  అందుతోంది.  కానీ,  వివక్ష,  ద్వేషం లేకుండా  కచ్చితమైన,  నమ్మదగిన  సమాచారం  అందరికీ అవసరం.  సమగ్రమైన, సురక్షితమైన  సమాచార  వాతావరణం ఉండాలి.  సమాచారాన్ని  విస్తృతంగా వ్యాప్తి  చేయడానికి  సాంకేతికత వీలు  కల్పించినప్పటికీ దుర్వినియోగం  అవుతోంది.  

తప్పుడు  సమాచారం,  ద్వేషపూరిత ప్రసంగాలు వ్యాప్తి చెందడానికి  దోహదపడుతోంది. సమాచార  పర్యావరణ  వ్యవస్థ  సమగ్రతను ఈ ధోరణి  ప్రమాదంలో  పడేస్తోంది.  కృత్రిమ మేధస్సు సాంకేతికతలలో  వేగవంతమైన  పురోగతుల  మధ్య  ఇటువంటి  ప్రమాదాలు ప్రస్తుత, భవిష్యత్తు ముప్పుని  సూచిస్తోంది.  భారతదేశంలో  సమాచార  సమగ్రత ప్రాథమికంగా సమాచార హక్కు (ఆర్టీఐ) చట్టంపై  ఆధారపడి ఉంటుంది. ఇది ప్రభుత్వంలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని  ప్రోత్సహించడానికి ఉద్దేశించిన ఒక మైలురాయి చట్టం. ప్రభుత్వ అధికారుల  నుంచి  సమాచారాన్ని పౌరులు  అభ్యర్థించడానికి  హక్కును ఈ చట్టం ఇస్తుంది.

ప్రతిస్పందనల  కోసం  కాలక్రమాలను  నిర్దేశిస్తుంది.  పాటించనందుకు  జరిమానాలను  విధిస్తుంది. ఇది సమాచార  సమగ్రతను  సిద్ధాంతపరంగా  బలపరుస్తుంది.  జూన్ 2025 నాటికి  భారతదేశంలోని  29  సమాచార  కమిషన్లలో నాలుగు లక్షలకుపైగా అప్పీళ్లు,  ఫిర్యాదులు పెండింగ్‌‌లో ఉన్నాయి.  సమాచార సమగ్రతను నిలబెట్టడానికి  ఒక సాధనంగా  ఉన్న చట్టం  ప్రభావాన్ని తగ్గిస్తుంది.  చట్టపరమైన నిబంధనలు, ఆచరణాత్మక అమలు మధ్య నిర్మాణాత్మక అంతరాన్ని సూచిస్తుంది.  జవాబుదారీతనం  తప్పనిసరి  చేసినప్పటికీ,  తగినంత  సిబ్బంది లేకపోవడం,  కీలక స్థానాల్లో  ఖాళీలు,  విధానపరమైన  అసమర్థతలు   సమాచార  ప్రవాహాన్ని  నిలువరిస్తోంది.  ఈ  అంతరం  ఒక  క్లిష్టమైన  సందిగ్ధతను  కలిగిస్తోంది.  

డిజిటల్ గవర్నెన్స్ చొరవలు
సమాచార హక్కు  చట్టానికి  సమాంతరంగా  సురక్షితమైన,  డిజిటల్  డేటా  భాగస్వామ్యం ద్వారా  సమాచార  సమగ్రతను  బలోపేతం  చేసేందుకు  భారత  ప్రభుత్వం  ప్రయత్నిస్తోంది.  ఈ–-గవర్నెన్స్  ప్లాట్‌‌ఫామ్‌‌లను  అభివృద్ధి చేసింది.  డిజిటల్  ఇండియా  ప్రోగ్రామ్ కింద  ప్రారంభించిన ‘డిజిలాకర్' ముఖ్యమైనది.  డిజిలాకర్  అనేది  క్లౌడ్- ఆధారిత  రిపోజిటరీ.  ప్రామాణికమైన,  ప్రభుత్వం  జారీ చేసిన  పత్రాలను  నిల్వ చేయడానికి, యాక్సెస్ చేయడానికి వీలు  కల్పిస్తోంది.  అధికారిక  డేటా ప్రకారం  జూన్ 2025 నాటికి  డిజిలాకర్ లో  53.9 కోట్లకు పైగా వినియోగదారులు నమోదు చేస్తుకున్నారు. 

డేటా కచ్చితత్వాన్ని మెరుగుపరిచి, మోసాన్ని తగ్గిస్తుంది. కీలకమైన రికార్డులు (గుర్తింపు, విద్యా ధృవపత్రాలు, వాహన రిజిస్ట్రేషన్ వంటివి) సురక్షితమైన డిజిటల్ మూలాన్ని కలిగి ఉన్నాయని నిర్ధారించడం ద్వారా ఇది సమాచార  సమగ్రతకు  దోహదం చేస్తుంది. కానీ, గోప్యత, భద్రతపై ప్రశ్నలను ఈ విధానం లేవనెత్తుతున్నది.

నకిలీ డిజిలాకర్ యాప్‌‌ల గురించి తరచుగా ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ హెచ్చరికలు  జారీచేస్తోంది.  సైబర్  భద్రతా  సవాళ్లను వివరిస్తోంది.  బలమైన సైబర్ భద్రత,  ప్రజల అవగాహన లేకుంటే  డిజిటల్  రిపోజిటరీలు  దుర్వినియోగం  అయ్యే  ప్రమాదం ఉంది.  అవి  సంరక్షించాలనుకుంటున్న సమాచార  సమగ్రతను  దెబ్బతీసే  అవకాశం ఉంది.

కార్యాచరణ సవాళ్లు
చట్టబద్ధమైన చట్రాలు, డిజిటల్  చొరవలు ఉన్నప్పటికీ  సమాచార  సమగ్రతకు  కార్యాచరణ  సవాళ్లు ఉన్నాయి.   ప్రభుత్వ డేటాకు  బహిరంగ  ప్రాప్యతను  నేషనల్  డేటా షేరింగ్  యాక్సెసిబిలిటీ  పాలసీ ప్రోత్సహిస్తుంది. బలమైన డేటా రక్షణ,  జవాబుదారీతనం  ఫ్రేమ్‌‌వర్క్‌‌లను  రూపొందించాలి.  భారతదేశంలో  డేటా రక్షణ న్యాయశాస్త్రం  ఇప్పుడిప్పుడే  గుర్తింపులోకి వస్తోంది.  సమాచార  సమగ్రతకు చట్టబద్ధమైన పారదర్శకత  యంత్రాంగాలు, డిజిటల్ పాలన  ఆవిష్కరణలు,  సంస్థల  మిశ్రమ కృషి అవసరం.

ఆర్‌‌టిఐ వంటి చట్టాలు, డిజిలాకర్ వంటి ప్లాట్‌‌ఫామ్‌‌ల వ్యవస్థాగత  అసమర్థతలు, డేటా భద్రతా ప్రమాదాలు, నెమ్మదిగా సాగే  న్యాయనిర్ణయ ప్రక్రియ వంటివి సమాచార సమగ్రత  పూర్తి  సామర్థ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. సంస్థాగత  సామర్థ్యాన్ని బలోపేతం చేయాలి. నిబంధనల అమలును కఠినంగా పర్యవేక్షించడం, డేటా పాలన ఫ్రేమ్‌‌వర్క్‌‌లను పటిష్టం చేయడం భారతదేశంలో నిజమైన  సమాచార సమగ్రతను సాధించడానికి అత్యవసరం.

డా. సునీల్ కుమార్ పోతన, సీనియర్ జర్నలిస్ట్

NOTE: ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు 'వెలుగు' కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.