రీకాల్ హక్కును రాజ్యాంగంలో చేర్చాలి.. ఐదేళ్ల మౌనం ప్రజాస్వామ్యానికి చేటు

రీకాల్ హక్కును రాజ్యాంగంలో చేర్చాలి.. ఐదేళ్ల మౌనం ప్రజాస్వామ్యానికి చేటు

భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత శక్తిమంతమైన ఆయుధం. అయితే, ఐదేళ్లకోసారి మాత్రమే ఈ ఆయుధాన్ని ప్రయోగించే అవకాశం ఓటరుకు లభిస్తోంది. ఎన్నికైన ప్రజాప్రతినిధి తన బాధ్యతలను విస్మరించినా, అవినీతికి పాల్పడినా, ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా  ప్రవర్తించినా, తదుపరి ఎన్నికల వరకు నిస్సహాయంగా వేచి చూడాల్సిన  పరిస్థితి  నేడు నెలకొంది.

ఈ నేపథ్యంలో ప్రతినిధులపై ఓటరుకు నిరంతర నియంత్రణను కల్పించే ‘రీకాల్’ హక్కును భారత రాజ్యాంగంలో అంతర్భాగం చేయాలి.ఇటీవలే ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు  రాఘవ్ చద్దా భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో రీకాల్ హక్కును ప్రవేశపెట్టాలని బలంగా ప్రతిపాదించారు. 

రీకాల్  అనేది ఓటర్లకు  లభించే  ఒక ప్రత్యక్ష  ప్రజాస్వామ్య సాధనం.  ఎన్నికైన  ప్రతినిధి  తన పదవీకాలాన్ని పూర్తి చేయకముందే, అతడు తన విధుల్లో  విఫలమైనప్పుడు ఓటర్లు ఓటింగ్ ద్వారా అతడిని పదవి నుంచి తొలగించడాన్ని ‘రీకాల్’ అంటారు. ఇది కేవలం శిక్షాత్మక చర్య మాత్రమే కాదు, ఎన్నికైన నేతను నిరంతరం అప్రమత్తంగా ఉంచే ఒక జవాబుదారీ యంత్రాంగం. 

ప్రతినిధి తన నియోజకవర్గ ప్రజలకు సేవకుడిగా మాత్రమే కొనసాగేలా ఈ హక్కు నిర్ధారిస్తుంది.  ప్రజా స్వామ్యం అంటే కేవలం ఎన్నికల రోజున ఓటు వేయడం మాత్రమే కాదు,  పాలకుల పనితీరును ప్రశ్నించే, అవసరమైతే మార్చే అధికారం పౌరుల వద్ద  నిరంతరం ఉండాలి.

రాజ్యాంగబద్ధమైన తొలగింపు ప్రక్రియలు 
ప్రస్తుత భారత రాజ్యాంగం అత్యున్నత పదవుల్లో ఉన్నవారిని తొలగించడానికి నిర్దిష్ట ప్రక్రియ కలిగి ఉంది. రాష్ట్రపతిని సుప్రీంకోర్టు,  హైకోర్టు న్యాయ మూర్తులను తొలగించడానికి, ‘అభిశంసన’  ప్రక్రియ, ఉప రాష్ట్రపతి తొలగింపునకు రాజ్యసభ ఆమోదం వంటివి అమల్లో ఉన్నాయి. 

అదే విధంగా ప్రభుత్వాలపై ‘అవిశ్వాస తీర్మానం’ ద్వారా సభలో మెజారిటీ కోల్పోయిన మంత్రి మండలిని తొలగించే అధికారం శాసనసభలకు ఉంటుంది. ఇక్కడ  గమనించాల్సిన కీలకాంశం ఏమిటంటే, ఈ అధికారాలన్నీ ప్రజాప్రతినిధుల మధ్య లేదా వ్యవస్థల మధ్యే పరిమితమై ఉన్నాయి. ఓటర్లు నేరుగా తమ ప్రతినిధిని తొలగించే అవకాశం ప్రస్తుతం లేదు. రాజ్యాంగంలోని ఈ లోటును పూడ్చడమే రీకాల్ హక్కు ప్రధాన ఉద్దేశం. ఉన్నత పదవులకు ఉన్న తొలగింపు సూత్రాలను సామాన్య ఎమ్మెల్యే, ఎంపీ స్థాయికి కూడా విస్తరించడం ప్రజాస్వామ్యబద్ధం.

ఓటర్లకు రీకాల్
భారతదేశంలో రీకాల్ హక్కుపై దశాబ్దాలుగా మేధోమథనం జరుగుతోంది. లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ‘సంపూర్ణ క్రాంతి’ ఉద్యమ కాలంలో ఓటర్లకు రీకాల్ హక్కు ఉండాలని బలంగా వాదించారు. ఎన్నికైన నేతలు ప్రజల పట్ల జవాబుదారీతనం కోల్పోయినప్పుడు వారిని వెనక్కి పిలిపించే అధికారం లేకపోతే ప్రజాస్వామ్యం అసంపూర్ణమని ఆయన అభిప్రాయపడ్డారు. మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎస్.వై. ఖురేషీ కూడా ఈ అంశంపై భిన్న కోణాలను ఆవిష్కరించారు. 

రీకాల్ హక్కు వల్ల ఎన్నికైన ప్రతినిధుల్లో ‘భయం’ ఏర్పడుతుందని, అది వారిని నిరంతరం పని చేసేలా ప్రేరేపిస్తుందని ఆయన పలు సందర్భాల్లో పేర్కొన్నారు. అయితే, దీని అమలులో తలెత్తే పరిపాలనాపరమైన సవాళ్లను దృష్టిలో ఉంచుకోవాలని న్యాయ నిపుణులు సూచిస్తున్నారు. లా కమిషన్ తన నివేదికల్లో జవాబుదారీతనాన్ని పెంచే సంస్కరణల ఆవశ్యకతను నొక్కి చెప్పడం గమనార్హం.

ఐదేళ్ల మౌనం ప్రజాస్వామ్యానికి చేటు
ప్రజాస్వామ్యంలో ఎన్నికైన ప్రభుత్వం లేదా ప్రతినిధికి ఐదేళ్లపాటు నిరంతరాయంగా అధికారాన్ని కట్టబెట్టడం వల్ల జవాబుదారీతనం క్షీణిస్తోంది. అశక్తత, అవినీతి, ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరించే నేతలను భరించడం ఓటరుకు ఒక శిక్షగా మారింది. కేవలం ఐదేళ్లకోసారి మాత్రమే ఓటు వేయడం వల్ల ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం పరిపూర్ణం కాదు.

ప్రతినిధికి, ఓటరుకు మధ్య ఉన్న సంబంధం ఎన్నికల తర్వాత తెగిపోకుండా ఉండాలంటే, మధ్య కాలంలో కూడా ఓటరుకు నియంత్రణాధికారం ఉండాలి. నేటి ఆధునిక కాలంలో బాధ్యతారాహిత్యాన్ని ఐదేళ్లపాటు సహించడం అంటే ప్రజాస్వామ్య స్ఫూర్తిని నీరుగార్చడమే అవుతుంది.

అంతర్జాతీయ అనుభవాల స్ఫూర్తి
ప్రపంచవ్యాప్తంగా సుమారు ఇరవై నాలుగుకు పైగా దేశాలు ఏదో ఒక రూపంలో రీకాల్ హక్కును అమలు చేస్తున్నాయి. అమెరికాలోని పలు రాష్ట్రాలు, స్విట్జర్లాండ్, కెనడా వంటి దేశాల్లో ఓటర్లు తమ ప్రతినిధులను రీకాల్ విధానం విజయవంతంగా  కొనసాగుతోంది. ఈ దేశాలలో ఓటర్లు చైతన్యవంతంగా  వ్యవహరిస్తూ,  ప్రజాప్రతినిధుల  పనితీరును  నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

భారత దేశం వంటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో కూడా ఇటువంటి సంస్కరణను ప్రవేశపెట్టడం ద్వారా వ్యవస్థలో మరింత పారదర్శకతను తీసుకురావచ్చు. ఇది పౌరులను కేవలం ఓటర్లుగా కాకుండా క్రియాశీల భాగస్వాములుగా మారుస్తుంది.

రాజకీయ దుర్వినియోగాన్ని అరికట్టాలి
రీకాల్ హక్కు అనగానే  రాజకీయ అస్థిరత ఏర్పడుతుందనే ఆందోళన కలగడం సహజం. ప్రత్యర్థి పార్టీలు ఈ హక్కును  ఆయుధంగా మలచుకుని ఎన్నికైన నేతలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడే అవకాశం ఉంది. అందుకే ఈ యంత్రాంగం దుర్వినియోగం కాకుండా పటిష్టమైన రక్షణ కవచాలను ఏర్పాటు చేయాలి.

రాజ్యాంగ సవరణలో భాగంగా కొన్ని నిబంధనలను తప్పనిసరి చేయాలి.  మొదటగా ఎన్నికలు ముగిసిన 18 నెలల వరకు రీకాల్ ప్రక్రియను  చేపట్టడానికి  వీలుండకూడదు.  దీనిని ‘కూలింగ్ పిరియడ్’ అంటారు. ఇది ప్రతినిధి తన పనితీరును నిరూపించుకోవడానికి తగిన సమయం ఇస్తుంది.

రెండోది రీకాల్ ప్రక్రియ ప్రారంభం కావాలంటే సదరు నియోజకవర్గంలోని కనీసం 35 నుంచి 40 శాతం ఓటర్లు  సంతకాలతో కూడిన విన్నపాన్ని ఎన్నికల సంఘానికి సమర్పించాలి.  ఈ సంతకాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే  ప్రక్రియ ముందుకు సాగాలి. మూడవది ప్రతినిధిపై నిరూపితమైన అవినీతి, మోసం, విధి నిర్వహణలో ఘోరమైన నిర్లక్ష్యం లేదా ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన వంటి తీవ్రమైన కారణాలు ఉన్నప్పుడు మాత్రమే రీకాల్ అనుమతించాలి.

కేవలం రాజకీయ విభేదాల ఆధారంగా ఈ ప్రక్రియకు చోటు ఉండకూడదు. చివరగా అసలు ఓటింగ్ జరిగినప్పుడు నియోజకవర్గంలోని మొత్తం ఓటర్లలో 50 శాతం కంటే ఎక్కువ మంది ప్రతినిధి తొలగింపునకు మద్దతు తెలిపితేనే రీకాల్ విజయం సాధించినట్లు ప్రకటించాలి. ఈ కఠిన నిబంధనలు  రాజకీయ స్థిరత్వాన్ని కాపాడుతూనే జవాబుదారీతనాన్ని నిర్ధారిస్తాయి.

ఆర్టికల్ 368 ద్వారా రాజ్యాంగ సవరణ ఆవశ్యకత
ఒక రాజ్యాంగ పరిశోధకుడి కోణం నుంచి విశ్లేషిస్తే,  రీకాల్ హక్కును ప్రవేశపెట్టడానికి రాజ్యాంగంలోని 368వ అధికరణ కింద  సమగ్ర సవరణ అవసరం.  కేవలం చట్టం చేయడం ద్వారా కాకుండా దీన్ని రాజ్యాంగబద్ధమైన హక్కుగా గుర్తించాలి. 

ఈ సవరణలో భాగంగా రీకాల్ పరిధి, అనుసరించాల్సిన విధానం, భారత ఎన్నికల సంఘం పర్యవేక్షణ వంటి అంశాలను స్పష్టంగా పొందుపరచాలి. ఎన్నికైన ప్రతినిధికి ఉన్న రాజ్యాంగ రక్షణలను గౌరవిస్తూనే, ఓటరు సర్వ సత్తాకతను చాటిచెప్పేలా ఈ సవరణ ఉండాలి. ఇది భారత ప్రజాస్వామ్య చరిత్రలో  ఒక నూతన అధ్యాయానికి నాంది పలుకుతుంది.

రాజ్యాంగ నైతికత - పౌర సాధికారత
రీకాల్ హక్కు  ప్రజాస్వామ్య నైతికతను  పెంపొందిస్తుంది.  ఇది పౌరులకు తమ ప్రతినిధులపై ఒక నైతిక ఒత్తిడిని ఉంచుతుంది. ప్రజాస్వామ్యంలో అధికారం అనేది ప్రజలు ఇచ్చిన తాత్కాలిక బాధ్యత మాత్రమే అని నేతలు గ్రహించేలా చేస్తుంది.  అవినీతి వ్యతిరేక పోరాటంలో ఇది ఒక గొప్ప అస్త్రంగా మారుతుంది. పారదర్శకమైన పాలన, క్రియాశీల పౌర సమాజం ఏర్పడడానికి ఇది దోహదపడుతుంది.  ప్రజలు కేవలం ఐదేళ్లకోసారి  ఓటు వేసే యంత్రాలుగా  కాకుండా,  నిరంతరం పర్యవేక్షించే  కాపలాదారులుగా మారతారు. భారత ప్రజాస్వామ్యం పరిణతి చెందుతున్న తరుణంలో ‘రీకాల్’ హక్కుపై జాతీయ స్థాయిలో  విస్తృత చర్చ జరగాలి.

ఇటీవలే ఆప్​ ఎంపీ రాఘవ్ చద్దా భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో రీకాల్ హక్కును  ప్రవేశపెట్టాలని ప్రతిపాదించారు. ఇటువంటి ప్రతిపాదనలు రాజకీయ వర్గాల్లో ఆలోచనలను రేకెత్తిస్తున్నాయి. రాజ్యాంగ రూపకర్తలు ఆశించిన భాగస్వామ్య ప్రజాస్వామ్యం సిద్ధించాలంటే పౌరులకు అపరిమిత అధికారాలు ఉండాలి. చట్ట సభలు ఈ దిశగా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవాలి. రాజ్యాంగ సవరణ ద్వారా రీకాల్ హక్కును అమలు చేయడం అంటే  ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడమే. ప్రజాప్రతినిధులు ప్రజలకు జవాబుదారీగా ఉన్నప్పుడే భారత గణతంత్రం నిజమైన అర్థాన్ని సంతరించుకుంటుంది.

డా.కట్కూరి సైబర్ సెక్యూరిటీ న్యాయ నిపుణుడు