మరోసారి వాయిదా పడ్డ ఖానాపూర్ మున్సిపల్ ఎన్నిక

మరోసారి వాయిదా పడ్డ ఖానాపూర్ మున్సిపల్ ఎన్నిక
  •     మీటింగ్ కు దూరంగా బీజేపీ, బీఆర్ఎస్ కౌన్సిలర్లు
  •     ఓటమి భయంతోనే ఎన్నికకు రావడం లేదు: బొజ్జు పటేల్​
  •     నేను ఉన్నంతవరకు దొరల పెత్తనం ఉండదని కామెంట్

ఖానాపూర్, వెలుగు: ఖానాపూర్ మున్సిపల్ చైర్​పర్సన్, వైస్ చైర్​పర్సన్ ఎన్నిక రెండోసారి  వాయిదా పడింది. మంగళవారం పట్టణంలోని మున్సిపల్ ఆఫీసులో చైర్​పర్సన్, వైస్ చైర్​పర్సన్ ఎన్నిక సమావేశానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సమావేశానికి ఎమ్మెల్యే బొజ్జు పటేల్, కాంగ్రెస్ కౌన్సిలర్లు, ఓ ఇండిపెండెంట్ హాజరయ్యారు. ఒంటిగంట వరకు కూడా బీజేపీ, బీఆర్​ఎస్​కు చెందిన మిగతా 8 మంది సభ్యులు సమావేశానికి హాజరు కాలేదు. ఎన్నికకు సరిపడా కోరం లేదని సమావేశాన్ని రెండోసారి వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల అధికారి జీవరత్నం తెలిపారు. అంతకుముందు మున్సిపల్ ఆఫీస్​ను ఎస్పీ జానకీ షర్మిల, అడిషనల్ ఎస్పీ సాయికిరణ్ సందర్శించి బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. 

పీఠాన్ని దక్కించుకుంటాం

ఖానాపూర్ నియోజకవర్గంలో బొజ్జు పటేల్ ఉన్నంతవరకు దొరల పాలన సాగదని, వారిని తరిమికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే బొజ్జు పటేల్ అన్నారు. మంగళవారం ఖానాపూర్ లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మున్సిపల్ చైర్​పర్సన్, వైస్ చైర్​పర్సన్ ఎలక్షన్​కు ఎన్నికల అధికారులు రెండుసార్లు మీటింగ్ పెట్టినా బీఆర్ఎస్, బీజేపీ నేతలు తమ సభ్యులను ఓటమి భయంతో ఇక్కడికి పంపించడం లేదని ఎద్దేవా చేశారు. తమ పార్టీ కౌన్సిల్ సభ్యులతో పాటు తానూ రెండుసార్లు సమావేశానికి హాజరయ్యానన్నారు. బీఆర్ ఎస్, బీజేపీ నేతలు రవీందర్ రావు దొరతోపాటు అతడి అనుచరులు చెప్పే మాటలు విని ఖానాపూర్ లో రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.

ఖానాపూర్ మున్సిపల్ చైర్​పర్సన్, వైస్ చైర్​పర్సన్ పోస్టులను కాంగ్రెస్ దక్కించుకోవడం ఖాయమన్నారు. త్వరలో జరగనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ అత్యధిక స్థానాలు సాధించి జడ్పీ పీఠాన్ని కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. సామావేశంలో కౌన్సిలర్లు రాజురా సత్యం, నిమ్మల రమేశ్, గొర్రె తిరుమల, సాజిదా బేగం పాల్గొన్నారు.