మున్సిపల్ పోరులో కాంగ్రెస్ జైత్రయాత్ర కేవలం ఒక ఎన్నికల విజయం మాత్రమే కాదు. రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రంలో సంభవించిన భారీ మార్పుకు నిదర్శనం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వ పటిమ, మంత్రుల సమన్వయం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు వెరసి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ఒక తిరుగులేని శక్తిగా నిలబెట్టాయి.
గణాంకాలను విశ్లేషిస్తే, ఈ గెలుపు ఒక ఆకస్మిక పరిణామం కాదు. ఒక పక్కా ప్రణాళికతో కూడిన ఎదుగుదల అని స్పష్టమవుతోంది. రేవంత్ రెడ్డి నాయకత్వంపై ప్రజలు పెంచుకున్న నమ్మకాన్ని ఈ ఫలితాలు బలపరిచాయి. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల గెలుపుతో క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్‌లో కూడా నూతనోత్సాహం నెలకొంది.
90కి పైగా మున్సిపాలిటీలు, 5 కార్పొరేషన్లను కైవసం చేసుకోవడం ద్వారా కాంగ్రెస్ పార్టీ తన పట్టును చాటుకుంది. 2020లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కేవలం 4 స్థానాలకే పరిమితమైన హస్తం పార్టీ, నేడు ఈ స్థాయి ప్రభంజనాన్ని సృష్టించడం వెనుక బలమైన నాయకత్వం, స్పష్టమైన అభివృద్ధి ఎజెండా ఉన్నాయని అర్థమవుతోంది. ఈ ఊపును ఇలాగే కొనసాగిస్తే, తెలంగాణలో కాంగ్రెస్ ఒక బలమైన రాజకీయ చరిత్రను లిఖించడం ఖాయం.
ఓటు షేరులో అసాధారణ పెరుగుదల
ఏ పార్టీ రాజకీయ బలాన్నైనా కొలవడానికి ఓటు బ్యాంకు కంటే మెరుగైన ప్రామాణికం మరొకటి ఉండదు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటు షేర్ కేవలం 28.43 శాతంగా ఉంది. అప్పట్లో పార్టీ ఉనికిపైనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ, 2023 అసెంబ్లీ ఎన్నికల నాటికి అది 39.69 శాతానికి పెరిగింది. అక్కడితో ఆగకుండా 2024 పార్లమెంట్ ఎన్నికల నాటికి 40.10 శాతానికి చేరింది. అంటే, ప్రతి ఎన్నికకూ కాంగ్రెస్ గ్రాఫ్ క్రమంగా పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా ఇటీవల జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ బలాన్ని మరింత సుస్థిరం చేశాయి.
కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటర్లు కాంగ్రెస్‌కు బ్రహ్మరథం పట్టారు. జూబ్లీహిల్స్ వంటి కీలకమైన సెగ్మెంట్‌లో 50.83 శాతం ఓటు షేర్ సాధించడం సామాన్యమైన విషయం కాదు. ఇది పట్టణ ఓటర్లలో కూడా కాంగ్రెస్ పట్ల పెరుగుతున్న నమ్మకానికి నిదర్శనం. పంచాయతీ ఎన్నికల్లో 66 శాతం సీట్లు సాధించి గ్రామీణ తెలంగాణలో తన పట్టును నిరూపించుకున్న పార్టీ, ఇప్పుడు మున్సిపాలిటీల్లో 53 శాతం సీట్లతో పట్టణాల్లోనూ పాగా వేసింది.
రేవంత్ రెడ్డి ‘గేమ్ ఛేంజర్’ నాయకత్వం
మున్సిపల్ ఎన్నికల్లో ఈ ఘనవిజయం వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యూహరచన ప్రధాన పాత్ర పోషించింది. పీసీసీ అధ్యక్షుడిగా పార్టీని గెలి పించిన రేవంత్, ముఖ్యమంత్రిగా తన పాలనతో ప్రజల మనసు గెలుచుకుంటున్నారు. మంత్రులు సైతం తమ తమ జిల్లాల్లో సమన్వయకర్తలుగా వ్యవహరిస్తూ, క్షేత్రస్థాయిలో అభ్యర్థుల గెలుపునకు అహర్నిశలు కృషి చేశారు. ముఖ్యంగా గ్యారెంటీల అమలు, రైతుల రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలు సామాన్య మధ్యతరగతి ప్రజలను కాంగ్రెస్ వైపు ఆకర్షించాయి. అభివృద్ధి కేవలం కాగితాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో సేవలను మెరుగుపరచడం మున్సిపల్ ఎన్నికల్లో కలిసొచ్చింది.
పీసీసీ, సీఎం సమన్వయమే సక్సెస్
ఈ గెలుపులో అత్యంత కీలకమైన అంశం ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ మధ్య నెలకొన్న అద్భుతమైన సమన్వయం. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో పాలనలో దూసుకుపోతుంటే, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పార్టీ యంత్రాంగాన్ని క్షేత్రస్థాయిలో పటిష్టం చేస్తున్నారు. వీరిద్దరి మధ్య ఉన్న అవగాహన పార్టీ క్యాడర్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పార్టీ శ్రేణులను మహేష్ కుమార్ గౌడ్ సమర్థవంతంగా నడిపిస్తుండగా, పరిపాలనాపరమైన నిర్ణయాలతో రేవంత్ రెడ్డి ప్రజల మన్ననలు గెలుచుకుంటున్నారు. మంత్రులు సైతం తమ జిల్లాల్లో సమన్వయకర్తలుగా వ్యవహరిస్తూ, క్షేత్రస్థాయిలో అభ్యర్థుల గెలుపునకు అహర్నిశలు కృషి చేయడం ఈ భారీ విజయానికి బాటలు వేసింది.
విపక్షాల పతనం.. కాంగ్రెస్ ఉత్థానం
ఒకప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తిరుగులేని శక్తిగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ, స్థానిక సంస్థల ఎన్నికల నాటికి తన ప్రభావాన్ని పూర్తిగా కోల్పోతున్నట్లు కనిపిస్తోంది. పట్టణ ఓటర్లు సైతం ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్‌నే ఎంచుకోవడం విశేషం. బీజేపీ గ్రాఫ్ కొన్నిచోట్ల పెరిగినట్లు కనిపిస్తున్నా, కాంగ్రెస్‌ను ఢీకొనే స్థాయికి చేరలేకపోయింది. ఈ క్రమంలోనే 2020లో కేవలం 4 స్థానాలు ఉన్న కాంగ్రెస్, నేడు వందకుపైగా స్థానాలను దక్కించుకోవడం అంటే.. రాష్ట్రంలో రాజకీయ శూన్యతను కాంగ్రెస్ భర్తీ చేయడమే కాకుండా, తనకంటూ ఒక పటిష్టమైన కోటను నిర్మించుకుంది.
మరో ఎనిమిదేళ్లు తిరుగులేదు
రాజకీయాల్లో ఏదీ శాశ్వతం కాకపోయినా ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, గణాంకాలు విశ్లేషిస్తే కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో ఇప్పుడప్పుడే ఎదురులేదనిపిస్తోంది. పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు, గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఒకే వరుసలో విజయాలను నమోదు చేయడం పార్టీకి ప్రజల్లో ఉన్న ఆదరణను చాటుతోంది.
సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం ఇదే జోరును కొనసాగిస్తే, రానున్న ఎనిమిది సంవత్సరాలపాటు తెలంగాణలో కాంగ్రెస్ హవాను ఆపడం ఎవరికీ సాధ్యం కాకపోవచ్చు. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు కేవలం సీట్ల సంఖ్యను మాత్రమే కాదు.. ప్రజాభిప్రాయాన్ని కూడా ప్రతిబింబిస్తాయి. ప్రజలు ‘నిలకడైన పాలన, నిబద్ధత గల నాయకత్వం’ వైపు మొగ్గు చూపుతున్నారని ఈ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.
దూడం వెంకటరమణ, పీసీసీ అధికార ప్రతినిధి
NOTE: ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు 'వెలుగు' కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.
