- హెల్త్, లైఫ్, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కల్పించనున్న కేంద్రం
- ఒకే అగ్రిగ్రేటర్ ద్వారా అయితే.. కనీస పని దినాలు 90
- వేర్వేరు అగ్రిగ్రేటర్ల ద్వారా అయితే.. 120 రోజులు పని చేయాలి
- రోజులో ఎంతసేపు పని చేసినా.. ఒక రోజు కిందే లెక్క
- డ్రాఫ్ట్ రూల్స్ విడుదల చేసిన కేంద్ర కార్మిక శాఖ
- అభ్యంతరాలు, సూచనలకు 45 రోజుల గడువు
- హెల్త్, లైఫ్, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కల్పించనున్న కేంద్రం
న్యూఢిల్లీ: గిగ్ వర్కర్లకు ఆరోగ్య, జీవిత, ప్రమాద బీమా సౌకర్యాలతో సామాజిక భద్రత కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం ముసాయిదాను విడుదల చేసింది. ఒక ఏడాదిలో కనీసం 90 రోజులు గిగ్ అండ్ ప్లాట్ ఫామ్ వర్కర్లుగా పనిచేసిన వారికి ఇన్సూరెన్స్, ఇతర ప్రయోజనాలను అందించనున్నట్టు పేర్కొంది. గిగ్ వర్కర్లు ఒక రోజులో ఒక అగ్రిగ్రేటర్ వద్ద ఎంతసేపు పనిచేసినా.. దానిని ఒక రోజు కిందే లెక్కించనుంది.
ఈ మేరకు కొత్తగా తెచ్చిన నాలుగు లేబర్ కోడ్ల అమలుకు సంబంధించిన డ్రాఫ్ట్ రూల్స్ ను కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ రిలీజ్ చేసింది. గిగ్ అండ్ ప్లాట్ ఫామ్ వర్కర్లు సహా ఆయా రంగాల్లో వర్కర్లకు సంబంధించి స్పష్టమైన నిర్వచనాలను ఈ రూల్స్‌లో పేర్కొన్నారు. అలాగే వేతనాలు, ఉద్యోగ రకాలు, గ్రాట్యుటీ, బోనస్, సామాజిక భద్రత వంటి వాటికి వివరణలు ఇచ్చారు. ఈ డ్రాఫ్ట్ రూల్స్ పై 45 రోజుల్లోగా అభ్యంతరాలు లేదా సూచనలను సమర్పించాలని ప్రజలకు కేంద్రం విజ్ఞప్తి చేసింది.
డ్రాఫ్ట్ రూల్స్ లోని కీలక అంశాలు ఇవే..
ఒకే అగ్రిగ్రేటర్(స్విగ్గీ, జొమాటో వంటి సంస్థలు) ద్వారా కనీసం 90 రోజులు పని చేసిన గిగ్ వర్కర్లకు హెల్త్, లైఫ్, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది.
ఫుడ్ డెలివరీ, బైక్ ట్యాక్సీ వంటి వేర్వేరు అగ్రిగ్రేటర్ల ద్వారా అయితే.. ఒకే ఆర్థిక సంవత్సరంలో కనీసం120 రోజులు పని చేసిన వారు అర్హులు.
వర్కర్లు ఒకరోజులో ఎంత సంపాదించారన్నది పట్టించుకోకుండా, ఎంతసేపు పనిచేసినా.. దానిని ఒక రోజుగా లెక్కిస్తారు. ఒకవేళ ఒకే రోజులో వేర్వరు అగ్రిగ్రేటర్ల ద్వారా పని చేసినట్లయితే.. వాటిని సపరేట్ డేస్‌గా లెక్కిస్తారు.
గిగ్ వర్కర్లుగా 16 ఏండ్లు దాటిన వారు తమ ఆధార్, ఇతర డాక్యుమెంట్లు సమర్పించి, రిజిస్టర్ చేసుకోవాలి. సెంట్రల్ పోర్టల్‌లో వివరాలు నమోదు చేసుకుని, యూనిక్ ఐడీని పొందాలి.
రిజిస్టర్ చేసుకుని, అర్హతలు ఉన్న వారికి ఐడీ కార్డులు కేటాయిస్తారు.
అగ్రిగ్రేటర్ల నుంచి కంట్రిబ్యూషన్‌ను సేకరించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఆఫీసర్ లేదా అథారిటీని నియమిస్తుంది.
రిజిస్టర్ చేసుకున్నవారికి 60 ఏండ్లు వచ్చిన వెంటనే లేదా ఏడాదిలో కనీసం 90 రోజులకు మించి పనిచేయకుంటే సామాజిక భద్రతా ప్రయోజనాలు రద్దు అవుతాయి.
అసంఘటిత రంగ కార్మికుల కోసం ఏర్పాటు చేసిన నేషనల్ సోషల్ సెక్యూరిటీ బోర్డులోకి గిగ్ అండ్ ప్లాట్ ఫామ్ వర్కర్ల నుంచి ఐదుగురిని సభ్యులుగా నియమిస్తారు. ఈ నియామకాలు కేటగిరీల వారీగా రొటేషన్ పద్ధతిలో ఉంటాయి.
