- ఏ వర్గానికి ఏ వార్డు రిజర్వు అవుతుందోనని చర్చ
- ఎన్నికల నిర్వహణ ప్రక్రియను ప్రారంభించిన సర్కార్
- ఇప్పటికే ముసాయిదా ఓటరు జాబితా విడుదల, 10న ఫైనల్ లిస్ట్
- కామారెడ్డి జిల్లాలో 4 మున్సిపాలిటీలు, 1,49,786 మంది ఓటర్లు
కామారెడ్డి, వెలుగు : మున్సిపల్ ఎన్నికల నిర్వహణ ప్రక్రియను రాష్ట్ర సర్కార్ ప్రారంభించింది. తాజాగా మున్సిపాలిటీల్లోని వార్డుల వారీగా ముసాయిదా ఓటరు జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. అభ్యంతరాల స్వీకరణ అనంతరం ఈ నెల 10న ఫైనల్ లిస్ట్‌ను రిలీజ్ చేయనుంది. తర్వాత ఎన్నిక షెడ్యూల్ప్రకటించే అవకాశం ఉండడంతో ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. ఏ వార్డు ఏ వర్గానికి రిజర్వు అవుతుందోనన్న చర్చలు జోరుగా సాగుతున్నాయి. కామారెడ్డి జిల్లాలో 4 మున్సిపాలిటీలు, 92 వార్డులు ఉన్నాయి. కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి మున్సిపాలిటీలు ఉండగా, ఇటీవల బిచ్కుంద మున్సిపాలిటీగా ఏర్పడింది. మున్సిపాలిటీల పాలన గడువు ముగిసి ఏడాది అవుతోంది. ఇటీవల పంచాయతీ ఎన్నికలు పూర్తి కాగా, మున్సిపల్ ఎన్నికలపై ప్రభుత్వం దృష్టి సారించింది.
వార్డుల వారీగా పోలింగ్ కేంద్రాల ప్రకటనతో పాటు, ఓటర్ల లిస్టును వెల్లడించారు. పంచాయతీ ఎన్నికల మాదిరిగా మున్సిపాలిటీల్లోనూ రిజర్వేషన్లు మారుతాయని ఆయా పార్టీల లీడర్లు భావిస్తున్నారు. దీంతో ఆయా వార్డుల్లో పోటీకి రెడీ అవుతున్న నాయకులకు రిజర్వేషన్ల భయం పట్టుకుంది. ఇప్పటికే చాలా వార్డుల్లో స్థానిక నాయకులు పోటీ కోసం వ్యూహరచనలు చేసుకున్నారు. వార్డుల్లో పరిచయాలు పెంచుకోవటం, నిత్యం పర్యటించటం, పండుగలకు చందాలు రాయటం, సేవా కార్యక్రమాలు చేపట్టారు. కామారెడ్డి మున్సిపాలిటీలోని కొన్ని వార్డుల్లో పలువురు నాయకులు లక్షలాది రూపాయలు ఖర్చు చేశారు. ఎండా కాలంలో ట్యాంకర్లు పెట్టి తాగునీటిని సరఫరా చేశారు. పండుగలు, చావులు, ఆపదలో ఉన్నవారికి చందాలు రాయడం వంటి వాటికి భారీగా ఖర్చు చేశారు. రిజర్వేషన్ల మార్పు అంశం తేరమీదకు రావడంతో ఏ వార్డు ఏ వర్గానికి దక్కుతుందోనన్న ఆటోచనలో
పడ్డారు.
బరిలో నిలిచేందుకు రెడీ..
మున్సిపల్ ఎన్నికల బరిలో నిలిచేందుకు ఆశావహులు సిద్ధమవుతున్నారు. ఏ వర్గానికి రిజర్వేషన్ వచ్చినా తమ అభ్యర్థులను పోటీలో ఉంచేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. అనుకున్న వార్డు రిజర్వు కాకపోతే వేరే వార్డుల్లో పోటీ చేసేందుకు ఆశావహులు ప్లాన్ వేసుకుంటున్నారు. కొందరు లీడర్లు ఒకటి, రెండు వార్డులపై ఫోకస్ చేస్తున్నారు. జనరల్ కాకుండా మహిళలకు రిజర్వు అయితే తమ కుటుంబీకులను బరిలో నిలిపేందుకు రెడీ అవుతున్నారు. కామారెడ్డి మున్సిపాలిటీలో 49 వార్డులు ఉన్నాయి. గత ఎన్నికల్లో జనరల్ 13, జనరల్ మహిళకు 13, బీసీ జనరల్ 9, బీసీ మహిళలకు 8, ఎస్సీ జనరల్ 3. ఎస్సీ మహిళ 2, ఎస్టీలకు 1 వార్డు రిజర్వు అయ్యింది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ లీడర్లు మున్సిపాలిటీల్లో పర్యటిస్తూ ఓటర్లను మచ్చిక చేసుకుంటున్నారు. రెండు రోజులుగా మున్సిపాలిటీల్లోని వార్డుల్లో రాజకీయం వేడెక్కింది.
జిల్లాలో 1,49,786 మంది ఓటర్లు
జిల్లాలోని 4 మున్సిపాలిటీల్లో 1,49,786 మంది ఓటర్లు ఉన్నారు. పురుషులు 72,619 మంది, మహిళలు 77,136 మంది, ఇతరులు 31 మంది ఉన్నారు. ఈ నెల 1న ఆయా మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా ఓటర్ల లిస్టు విడుదలైంది. ఈ నెల 5న రాజకీయ నాయకులతో మీటింగ్ జరగనుంది. 6న జిల్లాస్థాయిలో కలెక్టర్ ఆధ్వర్యంలో పొలిటికల్ ప్రతినిధులతో మీటింగ్ నిర్వహిస్తారు. 10న ఓటర్ లిస్ట్ తుది జాబితాను విడుదల చేస్తారు.
మున్సిపాలిటీల వారీగా ఓటర్ల వివరాలు
మున్సిపాలిటీ వార్డులు పురుషులు మహిళలు మొత్తం
కామారెడ్డి 49 48,511 51,027 99,555
బాన్సువాడ 19 11,579 12,599 24,189
ఎల్లారెడ్డి 12 6,328 6,954 13,283
బిచ్కుంద 12 6,201 6,556 12,759
