- ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 11లక్షల ఎకరాలకు పైగా సాగుకు అంచనా
- సాగులో వరి పంటదే అగ్రస్థానం
- ఎస్సారెస్పీ కాలువ, మానేరు జలాశయాల్లో నీరుండడమే కారణం
కరీంనగర్/పెద్దపల్లి, వెలుగు: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వానాకాలం సీజన్‌కు దీటుగా యాసంగిలోనూ సాగు విస్తీర్ణం పెరుగుతుందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. యాసంగిలోనూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 11లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేసే అవకాశం కనిపిస్తోంది. ఎస్సారెస్పీలో నీరు ఉండడంతోపాటు ఎగువ, మిడ్‌మానేరు, లోయర్ మానేరు డ్యామ్ లోనూ పుష్కలంగా నీరు ఉండడంతో సాగు జోరందుకున్నట్లు తెలుస్తోంది.
జగిత్యాల జిల్లాలో అత్యధికంగా 3.95 లక్షల ఎకరాలు, కరీంనగర్‌లో 3.20 లక్షలు, పెద్దపల్లి జిల్లాలో 2.40 లక్షలు, సిరిసిల్లలో 1.93 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యే అవకాశం ఉంది. దీనిలో వరి పంటదే అగ్రస్థానం. మొత్తం సాగు విస్తీర్ణంలో సుమారు 70 నుంచి 80 శాతం వరకు వరి ఉండనుందని, వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు.
పెద్దపల్లి జిల్లాలో..
పెద్దపల్లి జిల్లాలో ఎస్సారెస్సీ కింద టేల్ ఎండ్ కింద మంథని, కాల్వశ్రీరాంపూర్, ఓదెల మండలాల్లో దాదాపు 20 వేల ఎకరాలు ఉన్నాయి. రెండేళ్లుగా ఎస్సారెస్పీ ద్వారా యాసంగిలోనూ టేల్ ఎండ్ వరకు సాగునీరు అందిస్తుండటంతో పంటల దిగుబడి ఊహించిన విధంగా వస్తోంది. పదేళ్లలో ఎన్నడూ లేని విధంగా టేల్ ఎండ్ కాల్వ శ్రీరాంపూర్ మండలం కిష్టంపేట గ్రామ పరిధిలోని పొలాలకు అందుతుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లాలో ప్రస్తుత యాసంగి సీజన్లో 2.40 లక్షల ఎకరాలు సాగవుతుందని అంచనా వేశారు. అందులో వరి 2.08 లక్షల ఎకరాలు, మొక్కజొన్న 18,940 ఎకరాలు, ఇతరాలు 12, 497 ఎకరాలుగా వ్యవసాయాధికారులు చెప్తున్నారు.
పెద్దపల్లి జిల్లాలో ఎస్పారెస్పీ డి 83, 86 కెనాల్స్ ద్వారా పంటలకు సమృద్ధిగా నీరందించే ప్రణాళికలు ఇప్పటికే రెడీ చేశారు. జిల్లాలో గతానికి భిన్నంగా యాసంగికి ఎస్పారెస్పీ కాల్వల ద్వారా వారాబందీ పద్ధతిలో నీళ్లు విడుదల చేస్తున్నారు. కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటయ్యాక ఎస్సారెస్పీ నీటి ప్రాధాన్యం గుర్తించి కాల్వల మరమ్మతులు చేశారు. దీంతో యాసంగిలోనూ దిగుబడులు పెరిగేలా చర్యలు తీసుకుంటున్నారు.
కరీంనగర్ జిల్లాలో 3.20 లక్షల ఎకరాల్లో సాగు..
కరీంనగర్ జిల్లాలో ఈ యాసంగిలో 3.20 లక్షల ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేస్తారని వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందులో 2.72 లక్షల ఎకరాల్లో వరి, 30 వేల ఎకరాల్లో మక్క, 600 ఎకరాల్లో వేరుశనగ, 350 ఎకరాల్లో పొద్దు తిరుగుడు, 550 ఎకరాల్లో పొగాకు, 240 ఎకరాల్లో పప్పుదినుసుల పంటలతోపాటు మరో 12,040 ఎకరాల్లో కూరగాయలు, ఇతర పంటలు సాగు చేస్తారని వారు అంచనా వేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో.. జిల్లాలో యాసంగి సీజన్ లో 1.93 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని అగ్రికల్చర్ ఆఫీసర్లు అంచనా వేశారు. ఇందులో వరి 1.73 లక్షల ఎకరాల్లో, మక్కజొన్న1,014 ఎకరాల్లో, సన్ ఫ్లవర్ 300 ఎకరాల్లో, నువ్వులు 240 ఎకరాల్లో సాగవుతుందని అంచనా. 18,446 ఎకరాల్లో మిగతా పంటలు పండించనునన్నట్లు వ్యవసాయ ఆఫీసర్లు అంచనా వేశారు.
జగిత్యాల జిల్లాలో 3.95 లక్షల ఎకరాలు..
జగిత్యాల జిల్లాలో యాసంగి సీజన్‌లో సుమారు 3,95,555 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తారని అగ్రికల్చర్ ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు. ఇందులో వరి 3,02,600 ఎకరాలు, మొక్కజొన్న 35 వేల ఎకరాలు, మామిడి 38,300 ఎకరాలు, నువ్వులు 11 వేల ఎకరాలు, ఆయిల్‌పామ్4,200 ఎకరాలు, పల్లి 320 ఎకరాలు, జొన్నలు 2,300 ఎకరాలు, మిరప 750 ఎకరాలు, చెరుకు 190 ఎకరాలు, పెసర, మినుము, ఆలసంద, ఆవాలు, కందులు తదితర పంటలు 895 ఎకరాల్లో సాగవుతుందని వ్యవసాయ అధికారులు భావిస్తున్నారు.
