- కేటీఆర్, హరీశ్ పిల్లకాకులు.. కేసీఆర్ అసెంబ్లీకి రాకుంటే బీఆర్ఎస్ పని ఖతం
- టెర్రరిస్టు కసబ్‌తో కేసీఆర్‌ను పోల్చుతరా? ఉద్యమకారుడిని ఉరి తియ్యాలంటారా?
- సీఎం చేసిన వ్యాఖ్యలతో నా రక్తం మరుగుతున్నది
- ప్రాజెక్టు పనుల ప్యాకేజీని హరీశ్ అమ్ముకున్నరు
- అలాంటి వ్యక్తి సభలో మాట్లాడితే మ్యాచ్ ఫిక్సింగే
- కేసీఆర్ పిలిచినా మళ్లీ బీఆర్ఎస్‌లోకి పోను
- పార్టీ పెట్టి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని వెల్లడి
హైదరాబాద్/హైదరాబాద్ సిటీ, వెలుగు: బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుపై వివరిస్తే బాగుంటుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత అన్నారు. కేసీఆర్‌ను నిందిస్తూ సీఎం రేవంత్ రెడ్డి మాటలు అంటుంటే తన రక్తం మరుగుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘కేసీఆర్అసెంబ్లీకి రావాలి. పాలమూరు ప్రాజెక్ట్ సోర్సును ఎందుకు మార్చారో? ఎందుకు మార్చాల్సి వచ్చిందో? జవాబు చెప్పాలి. తప్పు చేయనప్పుడు మాటలు ఎందుకు పడాలి. ఆరోపణలు చేస్తున్నోళ్ల నోరు మూయించాలి.
పాలమూరు ప్రాజెక్ట్ నిర్మాణ ప్యాకేజీల్లో అక్రమాలకు పాల్పడిన వ్యక్తిని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా చేయడం అన్యాయం. పాలమూరు ప్రాజెక్ట్ ప్యాకేజీని హరీశ్అమ్ముకున్నారు. ఆయన సభలో మాట్లాడితే మ్యాచ్ ఫిక్సింగ్అవుతుంది. గతంలో సీఎం రేవంత్ రెడ్డితో హరీశ్ రావు ప్రత్యేకంగా మాట్లాడిన విషయం అందరికీ తెలుసు. అలాంటి వ్యక్తికి నీళ్ల గురించి మాట్లాడే అవకాశం కల్పిస్తే బీఆర్ఎస్‌కే నష్టం” అని కవిత పేర్కొన్నారు. శుక్రవారం శాసన మండలిలో మీడియాతో కవిత చిట్‌చాట్ చేశారు. అలాగే మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు.
నీళ్లివ్వని మాట నిజమే..
పాలమూరు ప్రాజెక్టుతో ఒక్క ఎకరానికీ నీళ్లు ఇవ్వలేదన్నది నిజమేనని కవిత తెలిపారు. ‘‘బబుల్షూటర్ (హరీశ్)కు పెత్తనం ఇచ్చి, సమాధానం చెప్పిస్తే ప్రజలకు అర్థం కాదు. అసలు బబుల్ షూటర్ వల్లే ట్రబుల్ వచ్చింది. ఆయన కారణంగానే మొదటి ప్యాకేజీకి దెబ్బపడ్డది. నదీ జలాల అంశాన్ని పిల్లకాకులైన కేటీఆర్, హరీశ్ మీద వదిలేయవద్దు. కేసీఆర్ అసెంబ్లీకి రాకపోతే బీఆర్ఎస్‌ను దేవుడు కూడా కాపాడలేడు. అందుకే కేసీఆర్అసెంబ్లీకి రావాలి” అని డిమాండ్ చేశారు. అనుకోకుండా అందలం ఎక్కిన వ్యక్తితో కేసీఆర్ మాటలు పడాల్సిన అవసరమేముందని ప్రశ్నించారు.
‘‘ఆంధ్ర ప్రాంత నేతలు రాజకీయాలకు అతీతంగా మన నీళ్లను దోచుకెళ్తున్నారు. కాంగ్రెస్పాలనలోనూ రెండేండ్లలో పాలమూరు ప్రాజెక్టు ద్వారా ఒక్క ఎకరానికీ నీళ్లివ్వలేదు. ఆ ప్రాజెక్టుకు లీగల్ఇష్యూస్ఉంటే.. భీమా, నెట్టెంపాడు, సుందిళ్ల, కల్వకుర్తికి ఏమైంది?” అని నిలదీశారు. ‘‘బీఆర్ఎస్‌పై నాకు మనసు విరిగింది. కేసీఆర్మళ్లీ పిలిచినా సరే.. ఆ పార్టీలోకి వెళ్లను. కేసీఆర్డైరెక్షన్లోనే హరీశ్, కేటీఆర్పని చేశారు. సొంత పార్టీ పెట్టి, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తాను” అని వెల్లడించారు.
5న కౌన్సిల్‌లో మాట్లాడ్త..
కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో తన రక్తం మరుగుతున్నదని కవిత మండిపడ్డారు. ‘‘కేసీఆర్‌ను టెర్రరిస్ట్కసబ్తో పోల్చుతరా? ఉద్యమ నాయకుడిని రాళ్లతో కొట్టాలంటూ.. ఉరి తియ్యాలంటూ మాట్లాడుతరా? సీఎం స్థాయి వ్యక్తి మాట్లాడే మాటలా ఇవి? సీఎం తన మాట తీరు మార్చుకోవాలి” అని హెచ్చరించారు. తాను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి నాలుగు నెలలైందని, అయినా ఇంకా ఆమోదించలేదని తెలిపారు.
‘‘నా రాజీనామాను ఆమోదించాలని శాసన మండలి చైర్మన్‌ను కోరాను. అదే విధంగా రాజీనామా ఆమోదానికి ముందు కౌన్సిల్‌లో మాట్లాడే అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశాను. ఈ నెల 5న కౌన్సిల్‌లో మాట్లాడ్తాను” అని చెప్పారు. కాగా, అంతకుముందు మండలి చైర్మన్‌గుత్తా సుఖేందర్‌రెడ్డితో కవిత భేటీ అయ్యారు. తన రాజీనామాను ఆమోదించాలని కోరారు.
