ఓరుగల్లు సిగలో ఆరు మెగా ప్రాజెక్టులు

ఓరుగల్లు సిగలో ఆరు మెగా ప్రాజెక్టులు

 

  • ప్రారంభానికి రెడీగా కాజీపేట కోచ్  ఫ్యాక్టరీ, మెగా టెక్స్​టైల్  పార్క్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
  • శంకుస్థాపనలకు రెడీ అవుతున్న మామునూరు ఎయిర్​పోర్ట్, అండర్  గ్రౌండ్  డ్రైనేజీ, ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్టులు
  • జనవరి, మార్చి నెలల నడుమ ఓపెనింగ్, శంకుస్థాపనలకు ఏర్పాట్లు
  • హాజరుకానున్న ప్రధాని మోదీ, సీఎం రేవంత్​రెడ్డి

వరంగల్‍, వెలుగు: ఓరుగల్లులో ఈ ఏడాది ఆరు మేజర్‍ ప్రాజెక్టులకు అడుగులు పడనున్నాయి. రేవంత్‍రెడ్డి ప్రభుత్వం హైదరాబాద్‍ తర్వాత అంతే స్థాయిలో ఓరుగల్లు అభివృద్ధిపై దృష్టి పెట్టింది. ఏండ్ల తరబడి ఎన్నికల హామీలుగా ఉంటున్న మెగా ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతోంది. కేంద్రం పరిధిలో ఉండే ప్రాజెక్టుల విషయంలో సైతం రాష్ట్ర సర్కారు చొరవ చూపి వాటికి అవసరమైన భూసేకరణ పూర్తి చేసింది. దీంతో రాబోయే రెండు, మూడు నెలల్లోనే ఆరు ప్రధాన ప్రాజెక్టులతో గ్రేటర్‍ వరంగల్‍ సిటీ భవిష్యత్‍ మారనుంది. 

ప్రారంభానికి సిద్ధంగా మూడు ప్రాజెక్టులు..

గ్రేటర్‍ వరంగల్‍ రూపురేఖలు మార్చడానికి తోడు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో కీలకమైన మూడు ప్రాజెక్టులు పనులు పూర్తి చేసుకుని ఓపెనింగ్‍కు సిద్ధమయ్యాయి. ఎన్నో పోరాటాల తర్వాత మంజూరైన కాజీపేట రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్‍ యూనిట్‍(కోచ్‍ ఫ్యాక్టరీ) చివరి దశ పనులు కొనసాగుతున్నాయి. 160.4 ఎకరాల్లో గ్రీన్‍ క్యాంపస్​గా నిర్మిస్తున్న పనులు 90 శాతం కంప్లీట్​ అయ్యాయి. 

తొలి దశలో రూ.521 కోట్లు వెచ్చించి కోచ్‍లు, వ్యాగన్లు, ఇంజిన్ల తయారీ కోసం 60,933 చదరపు మీటర్ల ఏరియాలో నిర్మాణాలు చేపట్టారు. వరంగల్‍ జిల్లా గీసుగొండ, సంగెం మండలాల పరిధిలో కాకతీయ మెగా టెక్స్​టైల్‍ పార్క్  నిర్మాణానికి 2017 శంకుస్థాపన చేయగా, కంపెనీలు ఒక్కొక్కటిగా వస్త్రాల తయారీకి అవసరమైన ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసుకున్నాయి. కాగా, కేంద్ర ప్రభుత్వం ‘పీఎం మిత్ర’ స్కీంలో వరంగల్‍ టెక్స్​టైల్‍ పార్క్  అభివృద్ధికి అవకాశమిచ్చింది. 

మొదటి దశలో రూ.200 కోట్లు ప్రకటించింది. త్వరలోనే పార్క్  ప్రారంభం కానుంది. గ్రేటర్ వరంగల్‍ పరిధిలో 2021 జూన్‍ 21న వరంగల్‍ సెంట్రల్‍ జైల్‍ కూల్చివేసిన స్థలంలో నిర్మిస్తున్న 24 అంతస్తుల సూపర్‍ స్పెషాలిటీ హాస్పిటల్‍ పనులు చివరి దశకు చేరాయి. మొదట్లో రూ.1,200 కోట్లతో మొదలుపెట్టగా, ఆ తరువాత మరో రూ.626 కోట్లు అదనంగా ఖర్చు చేశారు. 

కాగా, ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కుగా ఉండే ఎంజీఎంలో నిత్యం ఏదో ఒక సమస్య వస్తుండడంతో సూపర్‍ స్పెషాలిటీ హాస్పిటల్‍ పనులు స్పీడప్  చేశారు. ముందుగా ఆరు అంతస్తుల్లో సేవలు అందించేలా ప్లాన్​ చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని ఎమర్జెన్సీ విభాగాల్లో అవసరమైన మెషనరీలను తీసుకొచ్చి ఆపరేషన్‍ థియేటర్లలో అమర్చుతున్నారు.

మరో మూడు ప్రాజెక్టులకు శంకుస్థాపన..

గ్రేటర్ వరంగల్‍ లుక్‍ మార్చే మరో మూడు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసేందుకు స్థానిక ఎమ్మెల్యేలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఓరుగల్లువాసుల 40 ఏండ్ల కలగా మిగిలిన మామునూర్‍ ఎయిర్‍పోర్ట్  పునర్నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. ఇన్నాళ్లు అడ్డంకిగా ఉన్న 253 ఎకరాల భూసేకరణ కోసం రేవంత్‍ సర్కారు రూ.295 కోట్లు కేటాయించింది. దీనికితోడు జీఎంఆర్‍ సంస్థతో 150 కిలోమీటర్లలో మరో ఎయిర్‍పోర్ట్  నిర్మించకూడదనే అగ్రిమెంట్‍ను వెనక్కు తీసుకునేలా చొరవ చూపింది. 

గ్రేటర్‍ వరంగల్లో అండర్‍ గ్రౌండ్‍ డ్రైనేజీ నిర్మాణంపై 25 ఏండ్లుగా హామీలు ఇస్తూనే ఉన్నారు. కేసీఆర్‍ ప్రభుత్వం ఎన్నోసార్లు ప్రకటనలు చేసినా పనులు చేపట్టలేదు. ఈక్రమంలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సీఎం ఇచ్చిన హామీ మేరకు డీపీఆర్‍లు సిద్ధం చేసి, మొదటి దశలో రూ.500 కోట్లతో పనులు చేపట్టేందుకు రెడీ అయ్యారు. వీటితో పాటు ఓరుగల్లులో కీలకమైన మామునూర్‍ ఎయిర్‍పోర్ట్, టెక్స్​టైల్‍ పార్క్  కనెక్ట్  అయ్యేలా ఔటర్‍ రింగ్​రోడ్‍ నిర్మాణానికి రాష్ట్ర సర్కారు గ్రీన్‍సిగ్నల్‍ ఇచ్చింది.

 సిటీ చుట్టూ 70 కిలోమీటర్ల ఓఆర్‍ఆర్‍ నిర్మించాల్సి ఉండగా, 39 కిలోమీటర్లు ఐఆర్‍ఆర్‍, గ్రీన్‍ఫీల్డ్  హైవే రూపంలో అందుబాటులో ఉంది. ఢిల్లీ పబ్లిక్‍ స్కూల్‍ ఏరియా నుంచి మామునూర్‍ ఎయిర్‍పోర్ట్, టెక్స్​టైల్‍ పార్క్ అనుసంధానంగా 31 కిలోమీటర్ల ఓఆర్‍ఆర్‍ నిర్మాణానికి సీఎం గ్రీన్‍సిగ్నల్‍ ఇచ్చారు.

ఓరుగల్లుకు ప్రధాని, సీఎం

గ్రేటర్‍ వరంగల్‍ చుట్టూ చేపడుతున్న ఆరు ప్రాజెక్టులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉన్న నేపథ్యంలో వీటి ప్రారంభోత్సవం, శంకుస్థాపన కోసం ప్రధాని మోదీ, సీఎం రేవంత్‍రెడ్డి హాజరుకానున్నారు. ఈ విషయాన్ని గత నెలలో కోచ్‍ ఫ్యాక్టరీని సందర్శించిన కేంద్ర మంత్రి కిషన్‍రెడ్డి వెల్లడించారు. ప్రధాని చేతుల మీదుగా కోచ్‍ ఫ్యాక్టరీ, మెగా టెక్స్​టైల్‍ పార్క్  ఓపెనింగ్‍ ఉంటాయని చెప్పారు. 

ఈ నెలలో సీఎం రేవంత్‍రెడ్డి జిల్లాలో పర్యటించి అండర్​గ్రౌండ్‍ డ్రైనేజీ శంకుస్థాపన, సూపర్‍ స్పెషాలిటీ హాస్పిటల్‍ను ఓపెన్​ చేయనున్నారు. వీటితో పాటు ఫాతిమా రెండో కొత్త బ్రిడ్జి, డబుల్‍ ఇండ్ల పంపిణీ వంటి కార్యక్రమాలు ఉండనున్నాయి. అలాగే మామునూర్‍ ఎయిర్‍పోర్ట్  భూసేకరణ పూర్తి కావడంతో కేంద్రంలోని ప్రముఖులను ఆహ్వానించి ఆ భూములను ఎయిర్‍పోర్ట్  అథారిటీకి అప్పగించేందుకు లీడర్లు ప్లాన్‍ చేస్తున్నారు. 

కాజీపేట కోచ్‍ ఫ్యాక్టరీ, మెగా టెక్స్​టైల్‍ పార్క్  ఓపెనింగ్, మామునూర్‍ ఎయిర్‍పోర్ట్, ఓఆర్‍ఆర్‍ పనుల శంకుస్థాపన ప్రోగ్రామ్స్​ ఫిబ్రవరి లేదంటే మార్చి నెలలో చేపట్టేందుకు రెడీ అవుతున్నారు.