- ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 మున్సిపాలిటీలు
- పోటీ చేసిన అభ్యర్థుల సంఖ్య 1125
- చెప్పకుంటే గెలిచిన వారిపై అనర్హత, ఓడిన మళ్లీ పోటీ చెయ్యకుండా నిబంధన
జనగామ, వెలుగు : మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్లుగా పోటీ చేసిన వారు ఖర్చు లెక్కల చెప్పేందుకు ఎన్నికల సంఘం ఈ నెల 29 వరకు గడువు విధించింది. గెలిచినా, ఓడినా లెక్కలు చెప్పని వారిపై వేటు వేసేందుకు సిద్ధమవుతోంది. పార్టీతో సంబంధం లేకుండా పోటీ చేసిన ప్రతి అభ్యర్థి గ్రేడ్-1 మున్సిపాలిటీల్లో రూ.5 లక్షలు, గ్రేడ్–2 మున్సిపాలిటీలకు రూ.4 లక్షలు, గ్రేడ్–3 మున్సిపాలిటీల్లో రూ.3 లక్షలులకు మించి ఖర్చు చేయవద్దని ఎన్నికల సంఘం నిబంధనలు విధించిన సంగతి తెలిసిందే.
లెక్కకు మించి ఖర్చు..
ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఎన్నికల సంఘం సూచించిన ప్రకారం ఖర్చు చేయాలి. వేటికి ఎంత ఖర్చు చేయాలో కూడా సంఘమే రేట్లు నిర్ణయించింది. ఇందులో అభ్యర్థి చేసే ఎన్నికల ప్రచారానికి సంబంధించిన ఖర్చుల్లో ప్రచార పోస్టర్లు, బ్యానర్లు, ఫ్లెక్సీలు, ప్రచార వాహనాలు, మైక్ సిస్టమ్, సభలు, ర్యాలీలు, ప్రచార పత్రికల్లో ప్రచారం వంటి వాటికి సంబంధించిన ప్రతి అభ్యర్థి రోజువారీ ఖర్చు వివరాలు నమోదు చేయాలి. ఆయా వివరాలను ఎన్నికల అనంతరం నిర్దిష్ట గడువులోపు ఎన్నికల అధికారులకు సమర్పించాలి. కానీ, గెలవాలని ఆశించిన ప్రతి అభ్యర్థి రూ.20 లక్షల నుంచి రూ.కోటికి పైగా ఖర్చు చేశారు. ఎన్నికల సంఘం ఎంత నిఘా వేసినా పరిమితికి మించిన ఖర్చును ఆపలేకపోయింది. యథేచ్ఛగా ఓటర్లకు పంపకాలు చేశారు. ఈసారి ఎన్నికల్లో ఓటర్లే డబ్బులు ఇవ్వాలంటూ డిమాండ్ చేసి మరీ తీసుకున్న ఘటనలు కూడా ఉన్నాయి.
ఖర్చు వివరాలు ఇవ్వల్సిందే..
ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటిలో మొత్తంగా 1125 మంది అభ్యర్థులు పోటీ చేశారు. పరకాల మున్సిపాలిటీలో అత్యధికంగా 174 మంది పోటీ చేయగా, ఆ తర్వాత మహబూబాబాద్‌లో 155, జనగామలో 127, నర్సంపేటలో 120 అభ్యర్థులు పోటీ చేశారు. అతి తక్కువగా వర్ధన్నపేటలో 50 మంది పోటీ చేశారు. పోలింగ్ జరిగి ఇప్పటికే నెల గడిచింది. రూల్స్ ప్రకారం 45 రోజుల్లో ఎన్నికల్లో చేసిన ఖర్చు వెల్లడించాలి.
చెప్పకుంటే అనర్హత వేటు..
ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ నెల 29లోగా అంటే 15 రోజుల్లో ఖర్చుల వివరాలు అందజేయవలసి ఉంటుంది. ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు ఖర్చుల లెక్కలు చెప్పకున్నా, పరిమితికి మించి చేసినట్టు ఉన్నా వారిపై అనర్హత వేటు వేస్తుంది. అదే ఓడిన వారైతే వచ్చే మూడేండ్లలో ఏ ఎన్నిక జరిగినా పోటీ చేయడానికి అవకాశం ఉండదు. ఆయా మున్సిపాలిటీల్లోని ఎన్నికల అబ్జర్వర్లకు ఖర్చుల లెక్కలు అందించాల్సి ఉంటుంది.
