వరంగల్/ వర్ధన్నపేట (ఐనవోలు)/ టేకులపల్లి, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక జోరుగా సాగుతోంది. ఇందులో భాగంగా గ్రేటర్ వరంగల్లోని భద్రకాళి చెరువు సుందరీకరణ పనులను పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి గ్రేటర్ మేయర్ గుండు సుధారాణి, హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఓరుగల్లు భద్రకాళి ఆలయాన్ని జాతీయస్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దబోతున్నట్లు తెలిపారు. రూ.16.10 కోట్లతో భద్రకాళి చెరువు పూడికతీతను సమగ్రంగా చేపడుతున్నామన్నారు. హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పంతిని గ్రామంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పశువులకు ఉచిత టీకాల కార్యక్రమాన్ని ప్రారంభించారు.
భద్రాద్రికొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం లచ్చగూడెం, ముత్యాలంపాడు క్రాస్ రోడ్డు గ్రామాల్లో నిర్వహిస్తున్న ప్రజాపాలన కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్, డిప్యూటీ కమిషనర్ విద్యాలత, జిల్లా గ్రామీణాభివృద్ధి ఆఫీసర్ విద్యా చందనలు పాల్గొన్నారు. ముత్యాలంపాడు రైతువేదికలో నిర్వహించిన వార్డు సభ్యుల శిక్షణ కార్యక్రమంలో పాల్గొని పలు సూచనలు చేశారు.
