కాంగ్రెస్ కు ఓటేస్తే టీఆర్ఎస్ వేసినట్టే

కాంగ్రెస్ కు ఓటేస్తే టీఆర్ఎస్ వేసినట్టే

బీజేపీతోనే రాష్ట్రంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరుగుతుందని ఎమ్మెల్యే రఘునందన్ అన్నారు. అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేల సస్పెన్షన్ ను నిరసిస్తూ ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద చేపట్టిన ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్షలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన రఘునందన్.. అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకుండా బడ్జెట్ ఎలా ప్రవేశపెడతారని ప్రశ్నించినందునే సభ నుంచి  అన్యాయంగా సస్పెండ్ చేశారని విమర్శించారు. తాము సభలో ఉంటే కేసీఆర్ చెబుతున్నవన్నీ అబద్దాలని నిరూపిస్తామనే  తమను సభ నుంచి బయటకు పంపారని అన్నారు.

ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకునే ధైర్యం స్పీకర్ కు లేదని మండిపడ్డారు. అందుకే హైకోర్టు ఆర్డర్ కాపీ తిప్పి తిప్పి చూసి తిరస్కరిస్తున్నట్లు చెప్పారని విమర్శించారు. కేసీఆర్ పై ప్రజలు తిరుగుబాటు చేసే రోజు త్వరలోనే వస్తదని, దుబ్బాక, హుజూరాబాద్ ప్రజలు చూపిన చైతన్యాన్ని రాష్ట్ర ప్రజలంతా అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. పీకేలు, ఏకే 47లు టీఆర్ఎస్ ను కాపాడలేవని అన్నారు.

టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కయ్యాయని రఘునందన్ ఆరోపించారు. బడ్జెట్ సమావేశాల్లో భట్టిని కేసీఆర్.. కేసీఆర్ను భట్టి పరస్పరం పొగుడుకోవడమే ఇందుకు నిదర్శనమని అన్నారు. భవిష్యత్తులో కాంగ్రెస్, టీఆర్ఎస్ లు నాణేనికి బొమ్మా బొరుసులా మారతాయన్న రఘునందన్... కాంగ్రెస్ కు ఓటేస్తే టీఆర్ఎస్ కు వేసినట్లేనని అన్నారు.