హుజురాబాద్ ఎన్నిక కోసమే కేసీఆర్, జగన్ డ్రామా

హుజురాబాద్ ఎన్నిక కోసమే కేసీఆర్, జగన్ డ్రామా

హైదరాబాద్: కృష్ణా జలాలపై సీఎం కేసీఆర్ తన వైఖరేంటో స్పష్టంగా చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. గోదావరి, కృష్ణా జలాలపై కేంద్ర జలశక్తి శాఖ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని సంజయ్ చెప్పారు. రాబోయే రోజుల్లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు బండారం బయట పడుతుందన్నారు. కేసీఆర్, జగన్‌లు కమీషన్ల కోసమే పని చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణకు రావాల్సిన నీటి వాటాల విషయంలో కేసీఆర్ పట్టించుకోవడం లేదని.. అందుకే జగన్ దోచుకుపోతున్నాడని మండిపడ్డారు. 

‘తెలంగాణ ప్రజలను మోసం చేసిన ఘనుడు కేసీఆర్. కమీషన్ల కోసం పక్క రాష్ట్రంతో కుమ్మక్కయ్యాడు. బహిరంగంగా ఎవరి వాటా ఎంతనేది మేం బహిరంగంగా చెబుతున్నా సీఎం స్పందించడం లేదు. ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని సీఎం కేంద్రానికి లెటర్ రాశాడు. సుప్రీంలో కేసు వేస్తే ట్రిబ్యునల్ ఎలా ఏర్పాటు చేస్తారు? 8 నెలల తర్వాత కేసు వాపస్ తీసుకున్నాడు. రెండు రాష్ట్రాల సీఎం ప్రజలను మోసం చేస్తున్నారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని కోరినప్పటికీ సీఎం కేసీఆర్‌కు పాల్గొనేందుకు సమయం లేదంట? అందుకే వాయిదా వేయించాడు. పునర్విభజన హామీలు ఉల్లంఘించి రెండు రాష్ట్రాల సీఎంలు మోసం చేస్తున్నారు. హుజురాబాద్ ఎన్నికల కోసమే ఇద్దరు ముఖ్యమంత్రులు హైడ్రామా చేస్తున్నారు. తెలంగాణకు అన్యాయం జరిగితే బీజేపీ తప్పకుండా అండగా ఉంటుంది’ అని బండి సంజయ్ పేర్కొన్నారు.