నిజామాబాద్​ సీపీ ఆఫీస్​ ముందు ఎంపీ అర్వింద్​ ధర్నా

నిజామాబాద్​ సీపీ ఆఫీస్​ ముందు ఎంపీ అర్వింద్​ ధర్నా
  • నిజామాబాద్​ సీపీ ఆఫీస్​ ముందు ఎంపీ అర్వింద్​ ధర్నా
  • జిల్లా అభివృద్ధిని ఎమ్మెల్సీ కవిత అడ్డుకుంటోందని మండిపాటు
  • టీఆర్ఎస్​ గూండాలపై పోలీసులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోలే
  • గ్రామం దగ్గరున్న గుంపులను క్లియర్​ చేయాలని డిమాండ్

నిజామాబాద్, వెలుగు : నిజామాబాద్​ పోలీస్​ కమిషనర్​ కేఆర్ నాగరాజు టీఆర్ఎస్​కు తొత్తుగా మారారని, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సేవకుడిలా వ్యవహరిస్తున్నారని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. టీఆర్ఎస్​ తనకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వనుందని ఇటీవల కమిషనర్​ నాగరాజు చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఎంపీగా ఓడిపోయి.. దొడ్డిదారిన ఎమ్మెల్సీ పదవి పొందిన కవిత జిల్లా అభివృద్ధిని అడ్డుకుంటోందని మండిపడ్డారు. తన దత్తత గ్రామమైన కుకునూరు పర్యటనను అడ్డుకునేందుకు టీఆర్ఎస్ కిరాయి గుండాలు ప్రయత్నిస్తున్నారని, తాను అక్కడకు వెళ్లేందుకు రక్షణ కల్పించాలని కోరితే పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తన కుకునూరు పర్యటనకు రక్షణ​ కల్పించాలని డిమాండ్​ చేస్తూ శనివారం నిజామాబాద్​సీపీ క్యాంప్​ ఆఫీస్​ ఎదుట 3 గంటలపాటు అర్వింద్ బైఠాయించి ధర్నా చేశారు. నిజామాబాద్​ ఏసీపీ వెంకటేశ్వర్లు ఎంపీ వద్దకు వచ్చి ధర్నా విరమించాలని కోరారు. కుకునూర్​ లో ఉన్న గుంపును క్లియర్​ చేయాలని ఆయన పోలీసులను డిమాండ్ చేశారు. మంత్రి హరీశ్​ జగిత్యాల పర్యటన ఉందని రైతు ఐక్య వేదిక నాయకులను మందుస్తుగా అరెస్ట్​ చేస్తున్న పోలీసులు.. తన పర్యటనకు అడ్డుతగిలే నేతలను ఎందుకు అరెస్ట్​ చేయడం లేదని ప్రశ్నించారు. జనవరిలో తన పర్యటనను టీఆర్ఎస్​ గూండాలు అడ్డగించాలని చూస్తున్నారని పోలీసులకు ముందస్తు సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదన్నారు. పోలీసుల నిర్లక్ష్యానికి ఇస్సాపల్లి ఘటనే సాక్ష్యమని చెప్పారు. కత్తులతో దాడి చేసిన టీఆర్ఎస్​ నేతలపై ఇప్పటివరకు పోలీసులు చర్యలు తీసుకోలేదన్నారు.

కాంగ్రెస్ అంటే కరప్షన్ ఫ్రీ కాదు కరప్షన్ ట్రీ
కాంగ్రెస్ డిక్లరేషన్ రియల్ ఎస్టేట్ కంపెనీ బ్రోచర్ లా ఉందని ధర్మపురి అన్నారు. కాంగ్రెస్ అంటే కరప్షన్ ఫ్రీ కాదని కరప్షన్ ట్రీ అని మండిపడ్డారు. వరంగల్​ డిక్లరేషన్ లోని అంశాలు ఉన్న కొత్త సాగు చట్టాలను కాంగ్రెస్ ఎందుకు వ్యతిరేకించిందని ఆయన ప్రశ్నించారు. బీజేపీ జిల్లా ఆఫీస్ లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. పెట్టుబడి సాయం దేశం మొత్తం ఇస్తారో? లేక తెలంగాణలోనే ఇస్తారో? చెప్పాలని డిమాండ్​ చేశారు.