
హైదరాబాద్, వెలుగు: దేశంలోని ప్రతి ఒక్కరు స్వదేశీ వస్తువులే వాడాలని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ లక్ష్మణ్ అన్నారు. ఇతర దేశాలపై ఎక్కువ ఆధారపడితే బంగ్లాదేశ్, నేపాల్, ఫిలిప్పిన్స్, పాకిస్తాన్లో నెలకొన్న రాజకీయ, ఆర్థిక అస్థిర పరిస్థితులే ఎదురవుతాయని హెచ్చరించారు. అందుకే దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఆత్మనిర్భర్ భారత్ ధ్యేయంతో ముందుకు సాగుతున్నారని తెలిపారు.
మేక్ ఇన్ ఇండియా ప్రణాళికను ప్రోత్సహిస్తూ, స్వదేశీ వస్తువులే వాడాలని, స్వదేశీ వస్తువులను విక్రయించాలని ప్రజలకు మోదీ పిలుపునిచ్చారని పేర్కొన్నారు. గురువారం బీజేపీ స్టేట్ ఆఫీసులో నిర్వహించిన పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జయంతి కార్యక్రమానికి హాజరై, మాట్లాడారు. అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా పార్టీ కార్యకర్తలు చేనేతలకు సత్కారం, రక్తదాన శిబిరాల ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు.
చేనేత కార్మికులతో పాటు సమాజంలో వివిధ వృత్తులపై ఆధారపడి జీవించే వారిని ఆదుకోవాలని కోరారు. దేశవ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు చేనేత వస్త్రాలు ధరించడంతో పాటు వాటిని కొనుగోలు చేయాలని ప్రచారం చేయాలన్నారు. ప్రపంచంలోనే ఇండియా నాల్గో ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా కేంద్రం ముందుకెళ్తుందని చెప్పారు.