- ఈ దశలోనైనా పట్టు నిలుపుకోవాలని ప్రధాన పార్టీల ప్రయత్నం
- జిల్లాలో జోరుగా డబ్బులు, లిక్కర్, చికెన్, మటన్ పంపిణీ
కరీంనగర్/జగిత్యాల/సిరిసిల్ల/పెద్దపల్లి, వెలుగు: గ్రామపంచాయతీ ఎన్నికల ఘట్టం చివరి దశకు చేరింది. మూడో దశ ఎన్నికలకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల పరిధిలోని 19 మండలాల్లోని 386 గ్రామపంచాయతీల్లో సర్పంచ్, వార్డు సభ్యులకు బుధవారం ఎన్నికలు జరగనున్నాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మూడో దశ ఎన్నికలు జరిగే 386 జీపీల్లో 1,580 మంది సర్పంచ్ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మంగళవారం ఆయా మండల కేంద్రాల నుంచి పోలింగ్ సిబ్బంది బ్యాలెట్ పేపర్లు, బ్యాలెట్ బాక్సులు, ఇతర ఎన్నికల సామగ్రిని తీసుకుని బస్సుల్లో పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లారు.
కరీంనగర్ జిల్లాలో 108 జీపీలకు ఎన్నికలు
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్, జమ్మికుంట, వీణవంక, ఇల్లందకుంట, సైదాపూర్ మండలాల్లో 111 గ్రామాల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా.. నామినేషన్ల సమయంలోనే మూడు జీపీల సర్పంచులు ఏకగ్రీవమయ్యారు. మిగతా 108 గ్రామాల్లో 454 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అలాగే 1,034 వార్డుల్లో 184 మంది ఏకగ్రీవం కాగా మిగతా 850 వార్డుల్లో 2421 మంది పోటీపడుతున్నారు. జిల్లాలో మహిళా ఓటర్లు 80,190, పురుషులు 84,853 మంది, ట్రాన్స్ జండర్లు ముగ్గురితో కలిపి మొత్తం 1,65,046 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
రాజన్నసిరిసిల్ల జిల్లాలో నాలుగు మండలాల్లో...
రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, ముస్తాబాద్, వీర్నపల్లి మండలాల్లోని గ్రామాల్లో ఎన్నికలు జరగనున్నాయి. వీటి పరిధిలో 80 సర్పంచ్ స్థానాలకు, 551 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందుకు 914 మంది ప్రిసైడింగ్ అధికారులు, 1,244 మంది ఓపీవోలు విధులు నిర్వర్తించనున్నారు. క్రిటికల్, సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఉంటుందని ఎన్నికల అధికారి, కలెక్టర్ గరిమా అగర్వాల్ తెలిపారు.
జగిత్యాల జిల్లాలో..
జగిత్యాల జిల్లాలోని ఆరు మండలాల్లో 119 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో ఆరు జీపీలు ఏకగ్రీవం కాగా.. మిగతా 113 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి. మూడో విడతలో మొత్తం 456 మంది సర్పంచ్ అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ధర్మపురి మండలంలోని 25 జీపీల్లో మూడు ఏకగ్రీవాలు అయ్యాయి.
మిగతా 22 జీపీల్లో 91 మంది, ఎండపల్లి మండలంలో 15 జీపీల్లో ఒకటి ఏకగ్రీవం కాగా, 14 జీపీల్లో 52 మంది, పెగడపల్లి మండలంలో 23 జీపీల్లో 2 ఏకగ్రీవం కాగా, 22 జీపీల్లో 91 మంది అభ్యర్థులు, గొల్లపల్లి మండలం 27 జీపీల్లో 99 మంది, వెల్గటూర్ మండలంలో 19 జీపీల్లో 74 మంది, బుగ్గారం మండలం 10 సర్పంచ్ స్థానాల్లో 49 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.
పెద్దపల్లి జిల్లాలో..
పెద్దపల్లి జిల్లాలో చివరి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు చేశారు. జిల్లాలో పెద్దపల్లి, సుల్తానాబాద్, ఓదెల, ఎలిగేడు మండలాల్లో 91 జీపీల్లో ఇప్పటికే ఆరు ఏకగ్రీవం కాగా, 85 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరుగనున్నాయి. నాలుగు మండలాల పరిధిలో 1,44,563 ఓటర్లు ఉండగా, అందులో మహిళలు 73,669, పురుషులు 70,892 మంది ఓటర్లు ఉన్నారు.
జిల్లాల వారీగా ఓటర్లు ఇలా..
జిల్లా జీపీలు మహిళలు పురుషులు మొత్తం
1.కరీంనగర్ 108 80,190 84,853 1,65,046
2.పెద్దపల్లి 91 73,669 70,892 1,44,563
3.జగిత్యాల 119 89,959 85,061 1,75,020
4.రాజన్న సిరిసిల్ల 87 61,928 65,992 1,27,920
