చేనేతపై 5% జీఎస్టీకి టీఆర్ఎస్ ఓకే చెప్పింది: లక్ష్మణ్​

చేనేతపై 5% జీఎస్టీకి టీఆర్ఎస్ ఓకే చెప్పింది: లక్ష్మణ్​

హైదరాబాద్, వెలుగు : చేనేతపై 5 శాతం జీఎస్టీకి కౌన్సిల్ సమావేశంలో టీఆర్ఎస్ సర్కార్ ఓకే చెప్పిందని, ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నికలో లబ్ధి పొందేందుకు కేంద్రంపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని కేసీఆర్ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఫైర్ అయ్యారు. చేనేత ఓటర్లను తప్పుదారి పట్టించేందుకు కేంద్ర సర్కారును బద్నాం చేయడానికి టీఆర్ఎస్ ప్రయత్నం చేస్తున్నదని ఆయన విమర్శించారు. టీఆర్ఎస్ సర్కార్ కు చేనేతపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే 5 శాతం జీఎస్టీలో రాష్ట్ర వాటా 2.5 శాతం వదులుకోవాలని ఓ ప్రకటనలో ఆయన డిమాండ్ చేశారు.

టెస్కోకు  చైర్మన్, డైరెక్టర్లను ఇంతకాలం ఎందుకు నియమించలేదని, చేనేత కార్మిక సంఘాలకు ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించారు. గతంలో ఆప్కో ద్వారా తక్కువ వడ్డీకే చేనేత కార్మికులకు రుణాలు ఇచ్చేవారని, ఇప్పుడు టెస్కోకు పాలక మండలి లేకపోవడంతో ఎక్కువ వడ్డీకి రుణాలు తీసుకునే దుస్థితి నేత కార్మికులకు ఏర్పడిందని ఆయన మండిపడ్డారు.