కులగణనతోనే సామాజిక న్యాయం..జనగణనలో కులగణన కీలక అడుగు: ఎంపీ లక్ష్మణ్​

కులగణనతోనే సామాజిక న్యాయం..జనగణనలో కులగణన కీలక అడుగు: ఎంపీ లక్ష్మణ్​
  • ఏండ్లపాటు అధికారంలో ఉన్నా కాంగ్రెస్​ చేయలే
  • కులగణనపై ప్రశ్నించే హక్కు ఆ పార్టీకి లేదని కామెంట్​
  • బీసీసీఎఫ్​ ఆధ్వర్యంలో కులగణన, ఓబీసీల భవిష్యత్ నిర్మాణంపై రౌండ్ టేబుల్ మీటింగ్ 

హైదరాబాద్, వెలుగు: కులగణనతోనే  సామాజిక న్యాయం సాధ్యమని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ పేర్కొన్నారు. దేశంలో నిజమైన సామాజిక న్యాయం సాధించడానికి కుల గణన ప్రకటన కీలక అడుగు అని,  కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడంపై దేశవ్యాప్తంగా  ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు.   శనివారం హైదరాబాద్​ సోమాజిగూడలోని ఓ హోటల్ లో  బ్యాక్ వర్డ్ క్లాసెస్ సెంటర్ ఫర్ ఎంపవర్ మెంట్ (బీసీసీఎఫ్ ) ఆధ్వర్యంలో ఆ సంస్థ డైరెక్టర్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తూళ్ల వీరేందర్ గౌడ్  అధ్యక్షతన  ‘కుల గణన.. ఓబీసీల భవిష్యత్ నిర్మాణం.. సామాజిక న్యాయం”అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఉత్తర ప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి నరేంద్ర కశ్యప్, ఎంపీ ఆర్ కృష్ణయ్య,  మధ్య ప్రదేశ్ పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ పరికిపండ్ల నరహరి,  బీసీ మేధావుల ఫోరం కన్వీనర్ రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు, ఆర్టీఏ రిటైర్డ్ ఆఫీసర్ సీఎల్ఎన్ గాంధీ, బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్  పాల్గొన్నారు.  ఈ కార్యక్రమం ప్రారంభించే ముందు ఉగ్రవాదుల దాడిలో అమరులైన వారికి నివాళి అర్పించారు.

అనంతరం ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని సుదీర్ఘకాలంపాటు పరిపాలించినప్పటికీ కులగణనను నిర్వహించలేకపోయిందని  విమర్శించారు. దేశంలో బీసీలు అత్యధిక సంఖ్యలో ఉన్నారని, వారి సంక్షేమాన్ని నాటి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు.  కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీసీలకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని తెలిపారు. కాగా, తమ రాష్ట్రంలో బీసీల సంక్షేమం కోసం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని  నరేంద్ర కశ్యప్ తెలిపారు.

 చాలా దశాబ్దాలుగా కుల గణన జరగాలని పోరాటం చేస్తుంటే గత ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేదని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయడం కోసం దాన్ని ప్రస్తావిస్తున్నదని ఎంపీ ఆర్. కృష్ణయ్య విమర్శించారు.  బీసీ ప్రధాన మంత్రి అయిన నరేంద్ర మోదీ మన గొంతుకను గౌరవించి కుల గణన చేపడుతున్నారని తెలిపారు.  దీనికి అందరూ మద్దతు తెలపాలని, ప్రజలందరికీ అవగాహన కల్పించాలని  ఆర్. కృష్ణయ్య కోరారు. కులగణనను సమర్థవంతంగా  నిర్వహిస్తామని కేంద్రం చెప్పడంతో దేశ ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారని తూళ్ల వీరేందర్ గౌడ్ అన్నారు.