బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీకి కరోనా.. సివియర్ సింప్టమ్స్‌

బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీకి కరోనా.. సివియర్ సింప్టమ్స్‌

దేశంలో రోజు రోజుకీ కరోనా వైరస్ ఉధృతి తీవ్రమవుతోంది. సామాన్యుల నుంచి సెలబ్రెటీలు, రాజకీయ నాయకుల వరకూ భారీ సంఖ్యలో ఈ మహమ్మారి బారినపడుతున్నారు. ఇటీవల పలువురు సినిమా స్టార్స్, ఇద్దరు కేంద్ర మంత్రులు, ఢిల్లీ, రాజస్థాన్ రాష్ట్రాల సీఎంలు, 11 మంది మహారాష్ట్ర మంత్రులు, 20 మందికి పైగా ఎమ్మెల్యేలు, పలువురు ఎంపీలు కరోనా బారినపడ్డారు. తాజాగా ఇప్పుడు యూపీ బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీకి కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయన ఈ రోజు ఉదయం ట్విట్టర్‌‌లో వెల్లడించారు.

తీవ్రంగా లక్షణాలు..

మూడ్రోజులుగా పీలీభీత్‌లో ఉన్న తనకు కరోనా పాజిటివ్ అని తేలిందని ఎంపీ వరుణ్ గాంధీ ట్వీట్ చేశారు. తనకు సింప్టమ్స్ తీవ్రంగా ఉన్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం మనం థర్డ్ వేవ్‌ మిడిల్‌లో ఉన్నామని, మరోవైపు ఎన్నికల ప్రచారాలు సాగుతున్నాయిని, ఈ నేపథ్యంలో ప్రికాషనరీ డోసు (బూస్టర్ డోసు) వ్యాక్సిన్‌ను ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు, రాజకీయ నేతలకు కూడా వేసేలా ఎన్నికల కమిషన్‌ ఆదేశాలివ్వాలని వరుణ్ కోరారు. యూపీ సహా ఐదు రాష్ట్రాల్లో వచ్చే నెల నుంచి ఏడు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయన ఈ రిక్వెస్ట్ చేశారు.