ఎమ్మెల్యేల కొనుగోలుపై ఈసీకి ఫిర్యాదు చేసిన బీజేపీ

ఎమ్మెల్యేల కొనుగోలుపై ఈసీకి ఫిర్యాదు చేసిన బీజేపీ

న్యూఢిల్లీ:  ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై బీజేపీ జాతీయ నాయకత్వం కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. టీఆర్ఎస్ ఓటమి భయంతో తప్పుడు ప్రచారాలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు కోసం తమ పార్టీ నాయకులు ప్రయత్నించినట్లు ఆరోపణలు చేస్తున్నందున వాస్తవాలు నిగ్గు తేల్చేందుకు సీబీఐతో విచారణ జరిపించాలని బీజేపీ నాయకులు ఎన్నికల సంఘాన్ని కోరారు. కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, బీజేపీ జనరల్ సెక్రెటరీ  అరుణ్ సింగ్ తదితరులు  కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఈ మేరకు ఫిర్యాదు చేశారు. 

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన బీజేపీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో తమ పార్టీపై అనవసరంగా బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంలో నిజానిజాలు వెలికి తీయాల్సిన అవసరం ఉందన్నారు. వంద మంది ఎమ్మెల్యేల బలమున్న టీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం నలుగురు ఎమ్మెల్యేల  వల్ల పడిపోతుందా ? అని ఆయన ప్రశ్నించారు. మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్  ఓడిపోవడం ఖాయమని బీజేపీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు.