
నిజామాబాద్: సికింద్రాబాద్ అల్లర్లకు టీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులే కారణమని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. శనివారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన పార్టీ జాతీయ సన్నాహక సమవేశంలో ఎంపీ అర్వింద్ తో కలిసి డీకే అరుణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... టీఆర్ఎస్, కాంగ్రెస్ ఏకమై యువతను రెచ్చగొట్టారన్నారు. విద్యార్థుల ముసుగులో టీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు ఆందోళన దూరి విధ్వంసానికి కారణమయ్యారని మండిపడ్డారు. అగ్నిపథ్ స్కీంలో ఏమైనా లోపాలుంటే సలహాలు ఇవ్వాల్సిందిపోయి... యువతలో లేనిపోని అపోహలు సృష్టించారని ధ్వజమెత్తారు. చాలా దేశాల్లో అగ్నిపథ్ లాంటి పథకాలున్నాయని, అందుకే మన దేశంలో పథకాన్ని తీసుకొస్తే ప్రతి పక్షాలు యువతను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఫైర్ అయ్యారు.
నాలుగేళ్ల తర్వాత 25 శాతం మందిని తీసుకొని... మిగతావారిని విద్య, వ్యాపార, ఇతర రంగాల్లో సెటిల్ కావడానికి కేంద్రం ప్రోత్సహిస్తుందని ఆమె తెలిపారు. స్కీంను సరిగ్గా అర్థం చేసుకోలేక కేసీఆర్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. మోడీ ప్రతిష్ట పెరుగుతోంటే చూడలేకే కేసీఆర్ ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రత్యేక రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం మాత్రమే బంగారుమయం అయిందని, రాష్ట్రం అప్పులపాలయిందని పేర్కొన్నారు. కేసీఆర్ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారని, వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోవడం ఖాయమన్నారు. అందుకే విధ్వంసకారుడు పీకేను తెచ్చుకున్నారని చెప్పారు.