
- బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ లక్ష్మణ్
హైదరాబాద్, వెలుగు: కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఎంబీసీల బతుకులు ఆగమయ్యాయని టీఆర్ఎస్ సర్కార్ పై బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్న కులాలంటే కేసీఆర్కు చిన్న చూపని, బీసీల్లో పూర్తిగా వెనుకబడిపోయిన వారి జీవితాలు దారుణంగా మారాయన్నారు. బీజేపీ స్టేట్ ఆఫీసులో శనివారం జరిగిన రాష్ట్ర ఎంబీసీ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న లక్ష్మణ్ మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే ఎంబీసీల బతుకులు బాగుపడుతాయని ఆశిస్తే.. మరింత హీనంగా మారాయని విమర్శించారు. అణగారిన, బడుగు, బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని ఎంతో సంబరపడ్డామని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు.
దేశ వ్యాప్తంగా మోడీ సర్కార్ చిన్న కులాల సంక్షేమం కోసం, వారి అభ్యున్నతి కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని, వారికి రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత కల్పిస్తున్నారని చెప్పారు. తెలంగాణలో మాత్రం చిన్న కులాలను కేసీఆర్ రాజకీయంగా వాడుకుంటున్నాడే తప్ప వారి సంక్షేమం గురించి పట్టించుకోవడం లేదన్నారు. ఐదేండ్లలో రూ.3వేల కోట్ల హామీని ఎంబీసీల కోసం ఇచ్చిన రాష్ట్ర సర్కార్, విడుదల చేసింది మాత్రం రూ.350 కోట్లని, అందులోనూ ఖర్చు పెట్టింది కేవలం రూ.7.68 కోట్లు మాత్రమేనని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు భాస్కర్రాజ్ విమర్శించారు.