15 జిల్లాల బీజేపీ అధ్యక్షులు ఔట్.. లోక్ సభ ఎన్నికలకు కొత్త టీం

15 జిల్లాల బీజేపీ అధ్యక్షులు ఔట్.. లోక్ సభ ఎన్నికలకు కొత్త టీం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 15 జిల్లాల బీజేపీ అధ్యక్షులను తొలగించాలని పార్టీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి నిర్ణయించారు. ఇదే సమయంలో స్టేట్ ఆఫీసు బేరర్లలో కూడా కొందరిని మార్చాలని ఆయన డిసైడ్ అయ్యారు. శనివారం నలుగురు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులతో కలిసి ఓ ప్రైవేట్ ప్లేస్ లో ప్రత్యేకంగా సమావేశమైన కిషన్ రెడ్డి ఈ మార్పులపై సుదీర్ఘంగా కసరత్తు చేశారు. 

వారంలోపు కొత్త నియామకాలు చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ మేరకు  పార్టీ పెద్దల అనుమతి కూడా తీసుకున్నారు. పార్లమెంట్ ఎన్నికలకు కొత్త టీంతో పని చేయించుకోవాలనే ప్లాన్ తో ఉన్న కిషన్ రెడ్డి.. ఈ మేరకు సమర్థులైన వారికి పార్టీ పదవుల్లో పెద్దపీట వేసేందుకు మొగ్గు చూపారు. అసెంబ్లీ ఎన్నికల్లో సరిగ్గా పని చేయని, బాధ్యతలు అప్పగించినా నిర్వర్తించని జిల్లా అధ్యక్షులను, స్టేట్ ఆఫీసు బేర్లర్లను గుర్తించిన కిషన్ రెడ్డి.. వెంటనే ఆ నేతలను పదవుల నుంచి తొలగించాలని డిసైడ్ అయ్యారు. 

బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు బంగారు శృతి, ప్రేమేందర్ రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు, దుగ్యాల ప్రదీప్ తో శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు రహస్యంగా ఓ చోట ఆయన సమావేశమయ్యారు. సమర్థులైన, చురుకైన నేతలను గుర్తించి వారికి ఆయా జిల్లాల్లో పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించారు. దీర్ఘ కాలంగా అవే పదవులను అంటిపెట్టుకొని ఉన్న నేతలను కూడా తప్పించనున్నారు. ఆయా జిల్లాల్లో కూడా అసెంబ్లీ ఎన్నికల్లో సరిగ్గా పని చేయని నియోజకవర్గ, మండల స్థాయి నేతలపై వేటు వేయాలని జిల్లా నేతలను ఆదేశించారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి పార్టీ తరపున ఒక ఇంచార్జీని నియమించడంపై కూడా ఈ సమావేశంలో కసరత్తు చేశారు. ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండే నేతలకు ఈ బాధ్యతలు అప్పగించేందుకు సిద్ధమవుతున్నారు.  

పలువురు నేతలకు షోకాజ్ నోటీసులు 

అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పని చేసిన నాయకులకు, మీడియాతో పాటు సోషల్ మీడియాలో పార్టీ లైన్ దాటి మాట్లాడిన నాయకులకు క్రమశిక్షణ ఉల్లంఘన కింద రాష్ట్ర బీజేపీ క్రమ శిక్షణ కమిటీ శనివారం షోకాజ్ నోటీసులు పంపింది. బీజేపీ స్టేట్ ఆఫీసులో పార్టీ క్రమశిక్షణ కమిటీ సమావేశమైంది. మాజీ ఎమ్మెల్యే, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ధర్మారావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సభ్యులు నాగూరావు నామోజీ, పద్మజా రెడ్డి, రవీందర్ విశ్వనాథ్, ప్రతాప్ బోసుపల్లి పాల్గొన్నారు. అయితే, ఎవరెవరికి షోకాజ్ నోటీసులు ఇచ్చారన్న విషయాన్ని కమిటీ గోప్యంగా ఉంచింది.