కరెంట్ చార్జీల పెంపుపై ఇయ్యాల బీజేపీ నిరసన

కరెంట్ చార్జీల పెంపుపై ఇయ్యాల బీజేపీ నిరసన
  •     టీఆర్ఎస్ సర్కార్‌‌కు పోయేకాలం దగ్గర పడ్డది: బండి సంజయ్
  •     రాష్ట్ర ప్రభుత్వం డిస్కమ్‌లకు 48 వేల కోట్లు కట్టాలె
  •     ప్రభుత్వ శాఖలే రూ.12,598 కోట్ల బిల్లులు కట్టాలె
  •     మీరు కరెంటు బకాయిలు కట్టకుండా జనంపై భారం వేస్తరా?

హైదరాబాద్, వెలుగు: టీఆర్ఎస్ ప్రభుత్వానికి పోయే కాలం దగ్గర పడిందని, అందుకే ప్రజలపై కరెంట్ చార్జీల పెంపుతో మోయలేని భారాన్ని వేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. ‘‘రాష్ట్ర ప్రభుత్వం డిస్కమ్‌లకు కట్టాల్సిన రూ.48 వేల కోట్ల బకాయిలు ఇంతవరకు చెల్లించలేదు. డిస్కమ్‌లకు వినియోగదారులు చెల్లించాల్సిన కరెంట్‌ బకాయిలు రూ.17 వేల కోట్లుండగా.. అందులో ప్రభుత్వ శాఖలకు చెందిన బకాయిలే రూ.12,598 కోట్లు ఉన్నాయి. వినియోగదారులు చెల్లించాల్సిన బకాయిలు రూ.4,603 కోట్లు. అందులో అత్యధికంగా పాతబస్తీకి చెందినవే ఉన్నయ్” అని చెప్పారు. కరెంటు చార్జీల పంపును నిరసిస్తూ శుక్రవారం బీజేపీ ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో నిరసనలు చేపడుతామని స్పష్టం చేశారు. వీటిని విజయవంతం చేసి టీఆర్ఎస్ సర్కార్‌‌పై ఉన్న ప్రజా వ్యతిరేకతను తెలియజేయాలని ప్రజలను గురువారం ఓ ప్రకటనలో సంజయ్ కోరారు. రాష్ట్ర ప్రజలపై ఏకంగా రూ.6 వేల కోట్ల భారాన్ని మోపడం దారుణమన్నారు. ప్రభుత్వం ఒకవైపు తన శాఖలు వాడుకున్న కరెంట్‌కు బిల్లులు చెల్లించడం లేదని, మరోవైపు పాతబస్తీలో కరెంట్ బిల్లులు వసూలు చేసే దమ్ము లేదని ధ్వజమెత్తారు. ఈ లోటును పూడ్చేందుకు ప్రజలపై భారం మోపడం ఎంత వరకు న్యాయమని ప్రశ్నించారు. చార్జీలు త‌గ్గించేవ‌ర‌కు బీజేపీ పోరాడుతుందని స్పష్టం చేశారు.

వడ్లను రాష్ట్ర ప్రభుత్వమే కొనాలి

వడ్లను రాష్ట్ర ప్రభుత్వమే కొనాలని, లేకుంటే సీఎం పదవి నుంచి కేసీఆర్ తప్పుకోవాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ప్రధాని మోడీకి బుధవారం అబద్ధాలతో కూడిన లేఖను కేసీఆర్ రాశారని మండిపడ్డారు. గురువారం కేసీఆర్‌‌కు సంజయ్​ బహిరంగ లేఖ రాశారు. ‘‘మీరు మోడీకి రాసిన లేఖ.. తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉంది. ధాన్యం సేకరణపై అబద్ధాలు ప్రచారం చేశారు. ఇలాంటి లేఖలు రాసి, దుష్ప్రచారం చేసి ప్రజలను, రైతులను తప్పుదోవ పట్టించడం దారుణం” అని విమర్శించారు. ధాన్యం సేకరణపై కేసీఆర్ చెప్పేవన్నీ అబద్ధాలేనని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గురువారం ఆధారాలతో సహా తేల్చేశారని చెప్పారు. ‘‘పంజాబ్ సహా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కేంద్రం బియ్యం సేకరిస్తుందే తప్ప.. ధాన్యం సేకరించడం లేదు. రాష్ట్ర రైతాంగానికి, తెలంగాణ ప్రజానీకానికి వాస్తవాలు తెలియజేయాల్సిన బాధ్యతతోనే ఈ బహిరంగ లేఖను రాస్తున్నా’’ అని అందులో పేర్కొన్నారు. ధాన్యం కొని, మర ఆడించి, బియ్యంగా మార్చి ఎఫ్‌సీఐకి అప్పగించే విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం దశాబ్దాలుగా కొనసాగిస్తున్నదని, వాటికయ్యే ఖర్చుతోపాటు ఈ బాధ్యత నెరవేర్చినందుకు రాష్ట్రానికి కమీషన్ల రూపంలో కేంద్రమే డబ్బులు చెల్లిస్తుందని వివరించారు. 

కేంద్రంతో ఒప్పందం చేసుకుని మాటతప్పుతరా?

2021– -22 గాను వానాకాలం, యాసంగి పంటలకు సంబంధించిన ధాన్యాన్ని సేకరించి బియ్యంగా మార్చి ఎఫ్‌సీఐకి అప్పగించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య గతేడాది ఒప్పందం కుదిరిందని, దీన్ని ఉల్లంఘించి, తర్వాత  తప్పుకుంటామని చెప్పడం ఎంత వరకు కరెక్ట్‌ అని కేసీఆర్‌‌ను సంజయ్ నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వ ధాన్యం సేకరణలో పెద్ద కుంభకోణం దాగి ఉందనే అనుమానం కలుగుతున్నదని, రేషన్ బియ్యం రీ సైక్లింగ్, లేని పంటను లెక్కల్లో చూపడం, పక్క రాష్ట్రాల్లోని బియ్యాన్ని తెచ్చి అమ్మడం వంటి వ్యవహారాలు చాలా జరిగినట్లు తమ దగ్గర సమాచారం ఉందని బండి సంజయ్ చెప్పారు. మిల్లర్లు, కేసీఆర్ కుమ్మక్కై చేస్తున్న స్కామ్ బయటపడుతుందని ముందే గుర్తించి, కేంద్రంపై కావాలని రాద్ధాంతం చేస్తూ... సమస్యను పక్కదారి పట్టిస్తున్నట్లు అర్థమవుతున్నదని ఆరోపించారు.