జీహెచ్ఎంసీ హెడ్డాఫీసులో బీజేపీ ఆందోళన.. కేంద్ర నిధులను వినియోగించాలని డిమాండ్

జీహెచ్ఎంసీ హెడ్డాఫీసులో బీజేపీ ఆందోళన.. కేంద్ర నిధులను వినియోగించాలని డిమాండ్
  • స్ట్రీట్ లైట్స్, చెత్త సమస్య పరిష్కరించాలని నినాదాలు

హైదరాబాద్ సిటీ, వెలుగు: కేంద్ర ప్రభుత్వం బల్దియాకు ఇచ్చిన నిధులను వినియోగించి నగరంలో సమస్యలు పరిష్కరించాలని గురువారం బీజేపీ కార్పొరేటర్లు హెడ్డాఫీసు ఏడో ఫ్లోర్ లో ఉన్న స్టాండింగ్ కమిటీ హాల్ ముందు బైఠాయించారు. స్ట్రీట్ లైట్ల నిర్వహణ, చెత్త సమస్య పరిష్కరించడంలో విఫలమవుతున్నారంటూ నినాదాలు చేశారు. 

మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రవణ్ మాట్లాడుతూ ఏండ్లుగా పేరుకుపోయిన సమస్యలపై ఇప్పటికే ఇచ్చిన వినతి పత్రాలపై సమాధానం చెప్పాలని, అధికార పార్టీ లేదా స్టాండింగ్ కమిటీ సభ్యులకే కాకుండా సిటీలోని అన్ని డివిజన్లకు నిధులు కేటాయించాలన్నారు. 

కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వట్లేదని చెబుతున్నారని, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద కేంద్రం ఇచ్చిన రూ.113 కోట్లను 38 చెరువుల పునరుద్ధరణకు వాడాల్సి ఉన్నా..  ఎందుకు వాడట్లేదని ప్రశ్నించారు. 25న జరగనున్న కౌన్సిల్ సమావేశానికి హెచ్ఎండీఏ  అధికారులతో పాటు, కలెక్టరేట్ల అడిషనల్ కలెక్టర్లను కూడా పిలిచి, నగర అభివృద్ధి, సమస్యలపై చర్చించాలని డిమాండ్ చేశారు. దీంతో ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. తర్వాత గ్రౌండ్ ఫ్లోర్ లో లిఫ్ట్ ముందు బైఠాయించారు. 

అక్కడి నుంచి చిక్కడపల్లి పీఎస్​కు తరలించారు. సరూర్ నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి, మూసాపేట్ కార్పొరేటర్ మహేందర్, గోషా మహల్ కార్పొరేటర్ లాల్ సింగ్, బీజేపీ  నాయకులు గౌలికర్ ఆనంద్, ప్రభు గుప్తా, శ్రీకాంత్, నందు యాదవ్, వీరేష్, నాని, సుధీర్, మహేశ్​పాల్గొన్నారు.

మేయర్, కమిషనర్ వివరణ ఇవ్వాలి: బీజేపీ స్టేట్ చీఫ్
నిధుల కేటాయింపు, అభివృద్ధి పనుల పురోగతి, కేంద్ర నిధుల వినియోగంపై మేయర్, కమిషనర్ హాజరై వివరణ ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్ రావు అన్నారు. దీనికి సంబంధించి ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజల కోసం అడిగిన ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అధికార యంత్రాంగం, పోలీసులను ఉపయోగించి కార్పొరేటర్లపై దాడి చేయించడం సరికాదన్నారు. మేయర్ కమిషనర్ క్షమాపణ చెప్పాలని, గ్రేటర్ లోని అన్ని రిప్రజెంటేషన్లపై స్పష్టమైన టైమ్‌‌లైన్‌‌తో చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.