కొడుకును సీఎం చేయడానికే కేంద్రంపై విమర్శలు

కొడుకును సీఎం చేయడానికే కేంద్రంపై విమర్శలు

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ పథకాలను కాపీ కొట్టారని, వాటికి వేరే పెట్టుకొని ప్రజలను మోసం చేశారని సీఎం కేసీఆర్ పై బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ఆరోపించారు. రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత  ఎంపీ లక్ష్మణ్ శనివారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమయ్యారు. అనంతరం ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతూ... తనకు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించినందుకు జేపీ నడ్డాకు ధన్యవాదాలు తెలిపినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర రాజకీయాల గురించి చర్చించామన్న ఆయన... రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేయాలని నడ్డా సూచించారని తెలిపారు. కేంద్ర పథకాలను ప్రజలకు వివరిస్తామని చెప్పారు. 

కుటుంబ పాలనలో రాష్ట్ర ప్రజలు ఇబ్బందిపడుతున్నారని తెలిపారు. కేసీఆర్ హయాంలో రాష్ట్రం అప్పుల పాలయ్యిందని, కనీసం జీతాలకు కూడా నిధులు లేవని చెప్పారు. బీజేపీ కార్యకర్తలపై టీఆర్ఎస్ నాయకులు దాడులకు పాల్పడుతూ అక్రమంగా కేసులు పెడుతున్నారన్న ఆయన... టీఆర్ఎస్ దాడులను తిప్పి కొడుతామని చెప్పారు. తన కొడుకు కేటీఆర్ ను సీఎం చేయడానికి కేసీఆర్ కేంద్రంపై విమర్శలకు పాల్పడుతున్నారని, కేసీఆర్ చెప్పే అబద్ధాలను నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరని స్పష్టం చేశారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో రాష్ట్రంలోని సమస్యల గురించి ప్రస్తావిస్తానని తెలిపారు.  రాష్ట్రాన్ని కేసీఆర్ ఓ నియంతలా పాలిస్తున్నారని, ఆయన పాలనకు చరమగీతం పాడుతామని లక్ష్మణ్ స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా బీజేపీ పని చేస్తోందని ఆయన స్పష్టం చేశారు. టీఆర్ఎస్ ను ఓడించి రాష్ట్రంలో కాషాయ జెండాను ఎగురవేస్తామని ఎంపీ లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు.